ఉప్పు గనేనండోయ్‌! చెప్పుకొనే వింతేనండోయ్‌!!

అక్కడో ఫుట్‌బాల్‌ మైదానముంది... అక్కడో సినిమానూ తీశారు... అక్కడెన్నో చిత్రమైన శిల్పాలుంటాయి... విచిత్రమైన దారులుంటాయి... ఇలా చాలా చోట్లే ఉండొచ్చు... కానీ భూమిలోపలున్న ఓ గనిలో ఇవన్నీ ఉంటే ఆశ్చర్యమే...

Published : 12 Feb 2018 01:20 IST

ఉప్పు గనేనండోయ్‌! చెప్పుకొనే వింతేనండోయ్‌!!

అక్కడో ఫుట్‌బాల్‌ మైదానముంది... అక్కడో సినిమానూ తీశారు... అక్కడెన్నో చిత్రమైన శిల్పాలుంటాయి... విచిత్రమైన దారులుంటాయి... ఇలా చాలా చోట్లే ఉండొచ్చు... కానీ భూమిలోపలున్న ఓ గనిలో ఇవన్నీ ఉంటే ఆశ్చర్యమే కదూ!
నకు తెలిసి ఉప్పు గనంటే ఎలా ఉంటుంది? గోడలు, దారులు, పైవైపు ఎటుచూసినా ఉప్పే కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా ఓ ఉప్పు గనుంది. పైగా దానిలో బోలెడు పర్యాటక ప్రాంతాలూ ఉన్నాయి. ఇంకా గమ్మత్తయినవీ చాలానే చూడొచ్చు. తమాషాగా ఉన్న ఆ సంగతులన్నీ చదివేద్దాం రండి.

* ఈ సొరంగాలు మొత్తం 125 మైళ్ల దూరం ఉన్నాయి. ఇంత దూరం ప్రయాణించి లోపల ఈ విశేషాలన్నింటినీ చూసి ఆనందించేయవచ్చు.

* ఉక్రెయిన్‌లో ఉన్న ఈ ఉప్పు  గని పేరు ‘సోలెదార్‌ సాల్ట్‌మైన్‌’. సోలెదార్‌ అనేది రష్యన్‌ పదం. ఆంగ్లంలో దానర్థం ‘గిఫ్ట్‌ ఆఫ్‌ సాల్ట్‌’ అని.
* ఇప్పుడు దీనిలోకి వెళ్లగానే చిత్రమైన అలలు అలలుగా ఉన్న గోడలు దర్శనమిస్తాయి. అక్కడక్కడా తెల్లటి ఉప్పు పొరలు, మధ్య మధ్యలో నల్లని రాతిచారలతో భలేగా కనిపిస్తాయి.
* దీనిలోపల వేరు వేరు దారుల్ని కలుపుతూ చాలానే సొరంగాలుంటాయి.
* కొన్ని గోడలపై అపురూపమైన శిల్పాలు దర్శనమిస్తాయి.
* ఒకచోట ఉప్పు రాతితో తీర్చిదిద్దిన ప్రతిమలు కనువిందు చేస్తాయి. మరోచోటున్న సాకర్‌ స్టేడియం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది.
* ఈ అందాల గనిలో ఓ సినిమానీ తీశారు.
* అంతేకాదండోయ్‌... భూమి అంతర్భాగంలో ఉన్న   దీనిలో ఓ చర్చి కూడా ఉంది.
* ప్రత్యేక సందర్భాలప్పుడు దీనిలోనే హాట్‌ ఎయిర్‌ బెలూన్లనూ ఎగరేస్తారు. అంటే దీని పై కప్పు అంత ఎత్తుకు ఉందని మనం అర్థం చేసుకోవచ్చు.
* ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే ఇప్పుడు దీన్ని చూసేందుకు బోలెడు మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్లకోసం దీనిలోనే కేఫ్‌లు, దుకాణాలూ వెలిశాయి.
* ఇక్కడ ఉప్పు నిక్షేపాలు ఉన్నట్లు 19వ శతాబ్దంలోనే గుర్తించారు. దాదాపుగా వందేళ్లు దీని నుంచి ముడి ఉప్పును బయటకు తీశారు. తర్వాత దీనిలో లవణం తక్కువైపోవడంతో మైనింగ్‌ పనులు నిలిపేశారు. ఇలా పర్యాటక గనిగా మార్చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని