US Cop: వేరే అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి మృతి

ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది.

Updated : 10 May 2024 13:51 IST

ఫ్లోరిడా: ఓ ఇంట్లో గొడవ జరుగుతుందన్న సమాచారం అందుకున్న ఫ్లోరిడా పోలీసులు.. పొరపాటున మరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నల్లజాతికి చెందిన వైమానిక దళ ఉద్యోగి మరణించారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసు అధికారి ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. ఓ ఇంటి తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోడవంతో గట్టిగా తలుపును బాదారు. తలుపు తెరిచిన వెంటనే ఇంట్లోని వ్యక్తి.. పోలీస్‌కు గన్‌ గురిపెట్టాడు. దీంతో ఆ పోలీసు అధికారి అతడిపై  కాల్పులు జరిపారు. మృతుడు అమెరికా వైమానిక దళంలో విధులు నిర్వహిస్తున్న నల్లజాతి ఉద్యోగి రోజర్ ఫోర్ట్‌సన్ అని.. తాము ఒక అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా మరో అపార్ట్‌మెంట్‌కు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.

రోజర్ ఫోర్ట్‌సన్ ఇంట్లో ఉండగా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసు అధికారి అతడిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారని అతడి కుటుంబసభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘‘ఘటనకు ముందు రోజర్‌ నాతో వీడయో కాల్‌ మాట్లాడుతుండగా బయట నుంచి తలుపును గట్టిగా బాదిన శబ్దం వచ్చింది, ఎవరు అని ప్రశ్నించినా సమాధానం రాకపోవడంతో అతడు తన లైసెన్స్‌డ్‌ గన్‌ తీసుకొని బయటకు వెళ్లాడు. అనంతరం కాల్పుల శబ్దం వినిపించింది’’ అని మృతుడి స్నేహితురాలు చెప్పినట్లు బాధితుల తరఫు న్యాయవాది యెన్‌ క్రంప్‌ పేర్కొన్నారు. రోజర్ ఫోర్ట్‌సన్ మరణంపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అతడికి న్యాయం జరిగేలా పారదర్శకంగా దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ఫ్లోరిడా న్యాయ విభాగం, స్టేట్ అటార్నీ కార్యాలయంలో విచారణ చేపట్టింది. 2020లో పోలీసుల దౌర్జన్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన అమెరికన్‌-ఆఫ్రికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ సంఘటన అమెరికాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు