నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరు

తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు.

Updated : 10 May 2024 15:29 IST

హైదరాబాద్‌: తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గురువారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నేను రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నా. పిఠాపురానికి నేను వెళ్లడం లేదు. మీడియాలో వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అక్కడకు రావాలని కళ్యాణ్‌బాబు ఎప్పుడూ కోరుకోలేదు. నా సౌకర్యానికి వదిలేస్తాడు. తను (పవన్‌) బాగుండాలి. జీవితంలో ఎన్నో సాధించాలి. ఆ విషయంలో తనకు మద్దతుగా ఉన్నానని చెప్పేందుకు వీడియో విడుదల చేశాను. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబ సభ్యులందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం సముచితం. నేను కూడా ఈ విషయమై అభ్యర్థిస్తున్నా. ప్రభుత్వ తరపు నుంచి చేస్తే అది త్వరగా సాకారమవుతుంది. ఎంజీఆర్‌కి వచ్చినప్పుడు ఎన్టీఆర్‌కు రావడం సముచితం. ఆనందదాయకం.’’ అని అన్నారు. ప్రస్తుతం మీరు కాంగ్రెస్‌లోనే ఉన్నారు కదా! అని ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని