USA: ‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా

భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. 

Published : 10 May 2024 14:08 IST

వాషింగ్టన్‌: భారత అంతర్గత వ్యవహారాలు సహా సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అమెరికా (USA) ప్రయత్నిస్తోందని రష్యా (Russia) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. ‘‘ప్రపంచంలో ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోనట్టుగానే.. భారత్‌ విషయంలోనూ మా ప్రమేయం ఉండదు. అవి భారత ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయాలు’’ అని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు.

మత స్వేచ్ఛ విషయంలో భారత్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) నివేదిక ఇచ్చింది. దీన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపైనే మీడియా అడిగిన ప్రశ్నకు భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలన్న ఉద్దేశంతో అక్కడి అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపర్చాలని యత్నిస్తోందన్నారు.

కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్‌ హత్య కేసుపై భారత్‌

ఇదిలా ఉంటే.. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ నివేదిక వేళ భారత్‌కు అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి స్పందించారు. నిష్పక్షపాత ఎన్నికల విషయంలో ఇప్పటి మాదిరిగానే.. మరో 10 ఏళ్లు కూడా భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంగా ఉండనుందన్నారు. భారత ప్రజాస్వామ్యం గురించి వ్యక్తమవుతోన్న ఆందోళనలను తోసిపుచ్చారు. ఎన్నో విషయాల్లో అమెరికన్ల కంటే భారతీయులు మెరుగని వ్యాఖ్యానించారు. కాగా, ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ కమిటీ వేసి దర్యాప్తు చేస్తోంది. దీని గురించి గార్సెట్టి మాట్లాడుతూ.. పన్నూ కేసులో భారత్ చూపిస్తున్న జవాబుదారీ తీరుపై జో బైడెన్ ప్రభుత్వం సంతృప్తిగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు