రైళ్లు లేవ్‌... రోడ్లు కనపడవ్‌!

గ్రీన్‌లాండ్‌నేల ఎక్కడో గానీ కనిపించదు... భూమిలో మాత్రం బోలెడు రత్నాలు... వేలల్లోనే జనాభా ఉన్న ఆ దేశం ఏంటో ఎక్కువశాతం మంచుతో నిండి ఉండే దేశం గ్రీన్‌లాండ్‌. దీనిలో ఎనభై శాతానికిపైగా నేల మంచు దుప్పట్లోనే ఉంటుంది. భౌగోళికంగా చూస్తే ఉత్తర అమెరికా...

Published : 24 Feb 2018 01:11 IST

రైళ్లు లేవ్‌... రోడ్లు కనపడవ్‌!

గ్రీన్‌లాండ్‌నేల ఎక్కడో గానీ కనిపించదు... భూమిలో మాత్రం బోలెడు రత్నాలు... వేలల్లోనే జనాభా ఉన్న ఆ దేశం ఏంటో...  దాని విశేషాలేంటో?

* దేశం: గ్రీన్‌లాండ్‌
* రాజధాని: నూక్‌
* విస్తీర్ణం: 21,66,086
* చదరపు కిలోమీటర్లు
* కరెన్సీ: డానిష్‌ క్రోనె
* జనాభా: 56,483
* భాష: గ్రీన్‌లాండిక్‌

క్కువశాతం మంచుతో నిండి ఉండే దేశం గ్రీన్‌లాండ్‌. దీనిలో ఎనభై శాతానికిపైగా నేల మంచు దుప్పట్లోనే ఉంటుంది.
* భౌగోళికంగా చూస్తే ఉత్తర అమెరికా ఖండంలోదే. కానీ ఐరోపా ఖండంతో ఎక్కువ సంబంధాలున్నాయి. ఎందుకంటే ఇది ఐరోపా దేశమైన డెన్మార్క్‌ అధీనంలో ఉండేది. 1981లో పూర్తి స్వతంత్ర దేశంగా మారింది.
* డెన్మార్క్‌ అధీనంలో ఉన్నప్పుడు 1946లో దీన్ని అమెరికా కొనేసుకోవాలని చూసింది. అందుకు డెన్మార్క్‌ అంగీకరించలేదట.
* ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ మహా సముద్రాల మధ్యలో ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద దీవి ఇది. దీనిలో కొంత భాగం ఆర్కిటిక్‌ వలయంలోనూ ఉంటుంది.
* వీరి అధికారిక భాష గ్రీన్‌లాండిక్‌. డానిష్‌, ఆంగ్లమూ ఎక్కువగా మాట్లాడతారు.
* గున్‌బోర్న్‌ శిఖరం ఇక్కడ అతిఎత్తయిన ప్రాంతం. ఇది సముద్రమట్టానికి  3,733 మీటర్ల ఎత్తున ఉంటుంది.

పడవల్లోనే ప్రయాణం!

* మంచుతో కప్పి ఉండటంతో ఈ దేశంలో రైల్వే వ్యవస్థే లేదు. ఎక్కువగా బోట్లు వాడతారు. విమానాలు, స్నోమొబైల్‌ల మీద అరుదుగా ప్రయాణిస్తారు. దగ్గర దగ్గర దూరాలకైతే కుక్కలతో నడిచే డాగ్‌స్లెడ్‌ల మీదెక్కి వెళతారు.
* ఇక్కడ రోడ్డు వ్యవస్థ కూడా తక్కువే. ఒక్క రాజధాని నగరంలో మాత్రమే మంచి రోడ్లు కనిపిస్తాయి. దేశం మొత్తం మీద 2,570 కార్లున్నాయంతే. ఒక టౌను నుంచి ఇంకో టౌనును కలిపేలా మాత్రం రహదారులు లేవు.
* ఈ నేలల్లో రత్నాల నిధులు ఎక్కువ. నీలం, కెంపులు బాగా దొరుకుతాయి.

అర్ధరాత్రి సూరీడు!

  * భూమిపై ఇదున్నచోటు, తీరుని బట్టి ఇక్కడో విచిత్రం కనిపిస్తుంది. మే మధ్య నుంచి జులై మధ్య వరకూ ఇక్కడ సూర్యుడు ఎప్పుడూ పూర్తిగా అస్తమించడు. అంటే అర్ధరాత్రి కూడా కనిపిస్తాడన్నమాట.
* ఇక్కడున్న మంచు నాలుగు నుంచి ఎనిమిది లక్షల ఏళ్ల క్రితందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తేల్చారు. అందుకే ఇక్కడ పచ్చదనమూ పెద్దగా కనిపించదు.
* దేశమంతా మంచు కప్పే ఉన్నా అక్కడక్కడా వేడినీటి బుగ్గలున్నాయి. వీటిల్లో దాదాపు 37డిగ్రీల సెల్సియస్‌లో వేడి నీరుంటుంది. అందుకే ఇవున్న చోట్ల పర్యాటకం పెరిగింది.
* ఒక్క జులైలో మాత్రమే ఇక్కడ నీరు గడ్డకట్టని ఉష్ణోగ్రతలు అక్కడక్కడా నమోదవుతాయి. మిగిలిన కాలం అంతా మైనస్‌ డిగ్రీలే.
* ఇక్కడ పేరుకుపోయిన మంచు ప్రపంచం మొత్తం మీద ఉన్న మంచి నీటిలో ఏడు శాతానికి సమానం.

జనం కొంచెం.. భూమి ఘనం!

* విస్తీర్ణాన్ని బట్టి చూస్తే ఇది పెద్ద దేశమే. దాదాపుగా గ్రేట్‌బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీలను కలిపితే ఎంతో అంతకన్నా ఎక్కువే. అయితే జనాభా ఉన్నది మాత్రం వేలల్లోనే.
* రాజధాని నగరం నూక్‌లోనే పదహారు వేల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. చిన్న పల్లెలు కాకుండా ఇక్కడున్నది 16టౌనులు మాత్రమే. రోడ్లు లేకపోవడంతో ఒకదానికొకటి సంబంధంలేనట్లుగా ఉంటాయి.
* ఇక్కడి స్థానికులంతా మధ్య ఆసియా ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారని చెబుతారు.
* ప్రాచీన కాలం నుంచీ ఇక్కడ ఉంటున్న స్థానికుల్ని కలాలిత్‌ అని పిలుస్తారు. స్థానిక భాషలో దీనర్థం ‘గ్రీన్‌లాండర్‌’ అని.
* పూసల ఎంబ్రాయిడరీతో చేసే ఓరకం దుస్తులువీరి ‘నేషనల్‌ కాస్ట్యూమ్‌’.
* సీళ్లు, తిమింగలాల్ని వీరు ఎక్కువగా తింటారు. అందుకే వీటితోపాటు చేపల్ని వేటాడటం వీరికి ప్రధాన ఆదాయ వనరు.
* మాంసంతో చేసుకునే సాసట్‌ వీరి జాతీయ వంటకం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని