Poonch attack: పూంఛ్‌ దాడిలో పాక్‌ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!

పూంఛ్‌ వద్ద వాయుసేన కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పాక్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. 

Published : 09 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌డెస్క్: జమ్మూ-కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో వాయుసేనకు చెందిన వాహనశ్రేణిపై దాడి కేసు దర్యాప్తులో ఏజెన్సీలు కీలక ముందడుగు వేశాయి. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను సేకరించాయి. వీరిలో పాక్‌ సైన్యం ప్రత్యేక దళాల్లో పనిచేసిన ఓ మాజీ కమాండో కూడా ఉండటం గమనార్హం. వీరిని ఇల్లియాస్‌ (పాక్‌ మాజీ కమాండో), అబూ హమ్జా (లష్కరే కమాండో), హడూన్‌గా గుర్తించారు. ఇల్లియాస్‌ను ఫౌజీ అనే పేరుతోను పిలుస్తారు.

కొత్తగా ఏర్పాటుచేసిన పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫోర్స్‌ తరఫున ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాన్వాయ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ జైషే అహ్మద్‌ అనుబంధంగా పనిచేస్తోంది. భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులను పట్టుకోవడానికి రాజౌరీ, పూంఛ్‌ జిల్లాల్లో భారీ గాలింపు చర్యలకు తెరతీశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.  

దాడి అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో షహసితార్‌, గురుసాయ్‌, సనాయ్‌, షీన్‌దార్‌ టాప్‌ ప్రాంతాలను సైన్యం, పోలీసులు జల్లెడ పడుతున్నారు. దాడిలో ఉగ్రవాదులు ఏకే 47 రైఫిల్స్‌తో పాటు, అమెరికా తయారీ ఎం-4 కార్బైన్‌ను, స్టీల్‌ తూటాలను వాడినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో కూడా సైనిక వాహనంపై పీఏఎఫ్‌ఎఫ్‌ సంస్థ ఉగ్రవాదులు మాటు వేసి దాడి చేశారు. నాటి ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందారు. అప్పుడు కూడా స్టీల్‌ తూటాలు వాడినట్లు గుర్తించారు.  

పీర్‌పంజాల్‌లో ఏం జరుగుతోంది..?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం కొత్త ముసుగు తొడిగింది. పీర్‌పంజాల్‌ పర్వతాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా మార్చేందుకు పాక్‌ యత్నిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత జమ్మూలో రాజౌరీ, పూంఛ్‌ జిల్లాలు గతేడాది నుంచి హింసతో దద్దరిల్లుతున్నాయి. 2021 నుంచి ఇక్కడ జరిగిన ఉగ్ర దాడుల్లో సుమారు 36 మంది సైనికులు, ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో సగానికి పైగా 2023లోనే చోటుచేసుకొన్నాయి.

ఆర్థిక కార్యదళం ఒత్తిడి నుంచి బయటపడేలా పాకిస్థాన్‌ వ్యూహం మార్చింది. లష్కరే తోయిబా ముసుగు సంస్థగా టీఆర్‌ఎఫ్‌ (ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌), జైషే మొహమ్మద్‌కు చెందిన పీఏఏఎఫ్‌ (పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌), హిజ్బుల్‌ సహా మిగిలిన సంస్థల ఉగ్రవాదులను పోగేసి జమ్మూకశ్మీర్‌ ఘజ్నవీ ఫోర్స్‌ సంస్థలను ఏర్పాటుచేశాయి. వీటిల్లో స్థానికులను నియమిస్తున్నాయి. 

2022లో జమ్మూకశ్మీర్‌లో 187 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. వారిలో స్థానికుల సంఖ్య 130. ఇక 2023లో సెప్టెంబరు నాటికి  53 మందిని ఎన్‌కౌంటర్‌ చేయగా.. ఇందులో స్థానికుల సంఖ్య 11 మాత్రమే. ఇటీవల విదేశీ ఉగ్రవాదుల రాక పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా దాడిలో విదేశీ ఉగ్రవాది ఉండటం గమనార్హం.  ఉగ్ర చొరబాట్లకు జమ్మూలోని రాజౌరీ-పూంఛ్‌ జిల్లాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ గతేడాది జరిగిన తొమ్మిది ఎన్‌కౌంటర్లలో ఆరు ఈ రెండు జిల్లాలోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

కశ్మీర్‌ లోయలోని మైదాన ప్రాంతాలతో పోలిస్తే గుహలతో నిండిన ఈ పర్వతాలు ఉగ్రవాదులు నక్కి ఉండటానికి అనుకూలం. ఇక్కడి పీర్‌ పంజాల్‌ పాస్‌ కశ్మీర్‌ను రాజౌరీ-పూంఛ్‌తో కలుపుతుంది. ఈ జిల్లాలకు 225 కి.మీ. మేరకు పాక్‌తో సరిహద్దు (ఎల్‌వోసీ) ఉంది. ఉగ్రమూక పూంఛ్‌లో ఎల్‌వోసీ దాటితే షోపియాన్‌, పుల్వామా, బుద్గామ్‌, బారాముల్లా, ఉరి ప్రాంతాలకు చేరుకోవచ్చు. అదే రౌజౌరీలో దాటితే రెయసీ(reasi), కుల్గామ్‌, కోకెర్‌నాగ్‌కు వెళ్లొచ్చు. భద్రతా దళాలు కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌, శ్రీనగర్‌, షోపియాన్‌, బారాముల్లా వంటి ప్రాంతాలపై పట్టు బిగించడంతో ముష్కరులు పీర్‌పంజాల్‌లోకి మకాం మార్చారు. ఈ ప్రాంతంలోని భింబర్‌ గలి, డేరాకీ గలి, మెందహార్‌, సురాన్‌ కోట్‌ అడవులు ఉగ్ర పుట్టలుగా మారాయి. 

పాక్‌ నుంచి డ్రోన్లతో సాయం..

సరిహద్దుల సమీపంలో ఉండటంతో ఎన్‌కౌంటర్ల వేళ పాక్‌ నుంచి డ్రోన్లు ఇక్కడికి ఆయుధాలు చేరవేస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో 17 రోజుల పాటు పూంఛ్‌ జిల్లాలో సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌ జరగడమే దీనికి నిదర్శనం. గతేడాది జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో కూడా డ్రోన్ల కదలికలను దళాలు గుర్తించాయి.  ఇక్కడ మన దళాలపై దాడుల్లో పాక్‌ సైనికులు, బోర్డర్‌ యాక్షన్‌ బృందాలు, మాజీ సైనికులు కూడా పాల్గొనే అవకాశం ఉందని భారత్‌ అనుమానిస్తోంది. ముష్కరులు అమెరికా, చైనా తయారీ ఆయుధాలను వాడుతున్నారు. తాజాగా వాయుసేన కాన్వాయ్‌పై దాడిలో కూడా ఇలాంటివి వాడారు. స్నైపర్లు కూడా వీరిలో ఉండటం పాక్‌ సైన్యం పాత్రను బలపరుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు