Australia student visa: ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.16 లక్షలు ఉండాల్సిందే!

వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Published : 08 May 2024 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్‌ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మన కరెన్సీలో అది సుమారు రూ.16,35,000. ఈ నిబంధన మే 10 నుంచి అమల్లోకి రానుంది. గత ఏడు నెలల్లో విద్యార్థుల బ్యాంకు బ్యాలెన్సు   ఇలా పెంచడం రెండోసారి. ఆంథోనీ ఆల్బనీస్‌ (Australia) ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత విద్యార్థులపైనా భారం పడనుంది.

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు.. అక్కడ ఏడాది నివాసానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని తమ ఖాతాలో ఉన్నట్లు చూపెట్టాల్సి ఉంటుంది. ఈ వీసా డిపాజిట్‌ కనీస పరిమితి గతంలో 21,041 ఆస్ట్రేలియన్‌ డాలర్లుగా ఉండేది. గతేడాది అక్టోబర్‌లో దాన్ని 24,505 డాలర్లకు పెంచగా.. తాజాగా 29,710 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 19,576 అమెరికన్‌ డాలర్లతో సమానం.

ఆస్ట్రేలియాలో... అడుగుపెడదామా!

కొవిడ్‌-19 ఆంక్షల సడలింపు తర్వాత ఆస్ట్రేలియా వైపు వలసలు ఎక్కువయ్యాయి. దీంతో అద్దె ఖర్చులు భారీగా పెరగడంతోపాటు వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం ఇబ్బందికరంగా మారింది. ఇలా పెరుగుతోన్న విద్యార్థుల వలసలు, మోసపూరిత దరఖాస్తులను నిరోధించేందుకు అక్కడి ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా విద్యార్థి వీసాలపై నియంత్రణ పెడుతోంది. వీటిలో భాగంగా ఐఈఎల్‌టీఎస్‌ స్కోరును కూడా ఇటీవల పెంచింది. అంతేకాకుండా విద్యార్థులను ఎంపిక చేసుకొనే క్రమంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 విద్యాసంస్థలపై కఠిన చర్యలుంటాయని అక్కడి హోంశాఖ హెచ్చరించింది.

భారత్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ దేశాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జనవరి-సెప్టెంబర్‌ 2023 మధ్యకాలంలో దాదాపు 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నట్లు తేలింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు