రొట్టె కొంచెం.. చేయూత ఘనం!

‘మనం రైల్వే స్టేషన్‌కు వెళ్తే ఏం చూస్తాం..?’.. ఇంకేం చూస్తాం.. ఎంచక్కా కూఁ..చుక్‌.. చుక్‌..ను చూస్తాం.. కుదిరితే చక్కగా రైలెక్కి.. చిరుతిళ్లు తింటూ ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేస్తాం!.. కానీ ఓ చిన్నారికి మాత్రం

Published : 16 Feb 2021 01:13 IST

‘మనం రైల్వే స్టేషన్‌కు వెళ్తే ఏం చూస్తాం..?’.. ఇంకేం చూస్తాం.. ఎంచక్కా కూఁ..చుక్‌.. చుక్‌..ను చూస్తాం.. కుదిరితే చక్కగా రైలెక్కి.. చిరుతిళ్లు తింటూ ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేస్తాం!.. కానీ ఓ చిన్నారికి మాత్రం ఆ ప్రాంగణంలో కనిపించిన వారిని చూసి ‘నేను తిన్నాను. మరి వీళ్లంతా భోజనం చేశారా?’ అనే సందేహం వచ్చింది. వాళ్లను ఇదే విషయం అడిగాడు. అందులో చాలా మంది.. ‘లేదు.. మా దగ్గర డబ్బులు లేవు. మేము ఏమీ తినలేదు’ అని సమాధానం చెప్పారు. అంతే ఆ పిల్లవాడి హృదయం ద్రవించింది. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. దాన్ని అమలు చేశాడు. అదే ఇప్పుడు చాలామంది అభాగ్యుల కడుపు నింపుతోంది.
కటక్‌లోని బాదంబాడి ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల అభిషేక్‌ సాహు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఒక రోజు రాత్రి వేళలో నాన్నతో కలిసి కటక్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్ల్లాడు. అక్కడ రోడ్డు పక్కన చాలా మంది ఉన్నారు. వారిలో 80 శాతం మంది ఏమీ తినలేదని తెలుసుకుని తల్లడిల్లాడు. నగరంలో ఇలా ఇంకెంత మంది పేదలు ఆకలితో ఉంటున్నారోనని ఆవేదన కలిగింది. దీంతో అమ్మానాన్న సహకారంతో ఇంట్లోనే ‘రోటీ బ్యాంక్‌’ ఏర్పాటు చేశాడు. తాను ఉండే ప్రాంతంలో చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి ‘మీరు తినగా మిగిలిన రోటీలు ఇవ్వండి. వాటిని పేదలకు అందజేస్తాను’ అని కోరాడు. చిన్నారి మంచి ప్రయత్నానికి వాళ్లూ చేయూత ఇచ్చారు. అలాగే సమీపంలోని హోటళ్ల వాళ్లతోనూ మాట్లాడాడు. వాళ్ల దగ్గర మిగిలిన ఆహారాన్ని వృథాగా పడేయకుండా తన ‘రోటీ బ్యాంక్‌’కు అందివ్వాలని కోరాడు. వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది. నాన్న అలోక్‌ సాహు సహకారంతో నిత్యం రోటీలు, ఇతర ఆహార పదార్థాలు సేకరించి వాటిని రాత్రి పూట బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, రోడ్లపక్కన ఉండే అభాగ్యులకు అందిస్తున్నాడు.
స్వచ్ఛంద సంస్థల చేయూత
రోటీ బ్యాంకు సేవలను విస్తరించాలని భావించి, కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభిషేక్‌ సంప్రదించాడు. వారు సహకరించేందుకు ముందుకు రావడంతో సీడీఏ, బాదంబాడి, దేవుళ్ల సాహి ప్రాంతాల్లోనూ రోటీలు సేకరిస్తున్నాడు. రాత్రిపూట ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి గోవులకూ ఆహారంగా ఇస్తున్నాడు. మరో విషయం ఏంటంటే మన అభిషేక్‌ అద్భుతంగా డ్రమ్స్‌ కూడా వాయిస్తాడు. తానిచ్చిన ప్రదర్శనల్లో వచ్చిన ఆదాయాన్నీ, వివిధ సంస్థలు ఇచ్చిన నగదు, బహుమతులనూ సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు.
ప్రధాని మాటలతో..
‘తోటివారికి తోడుగా నిలవాలి. పేదలను ఆదుకోవాలి. సమాజ సేవకు ముందడుగు వేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో చెప్పిన మాటల ప్రభావంతో తాను ఈ పని చేస్తున్నట్లు అభిషేక్‌ సాహు చెబుతున్నాడు. గతంలో ఫోని తుపాను సమయంలోనూ 5,000 తాగునీటి సీసాలు పంచిపెట్టి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రాణాలకు ఎదురొడ్డి విధులు నిర్వహించిన పోలీసులకు అయిదువేలకు పైగా శానిటైజర్లు, మంచినీటి సీసాలు అందించాడు. అభిషేక్‌ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఒడిశా గవర్నర్‌ గణేశీలాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తమ తమ నివాసాలకు బాలుడిని ఆహ్వానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతానని చెబుతున్న మన అభిషేక్‌ సాహును మనసారా అభినందిద్దామా! మనమూ మన వంతుగా ఆహారవృథాను అరికట్టి.. వీలైతే కాస్తోకూస్తో పేదలకు సాయపడదామా!!  

  

  - న్యూస్‌టుడే, కటక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని