శెభాష్‌ షెరూ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి పిల్లలకు పెంపుడు జంతువులంటే బోలెడు ఇష్టం కదూ! అందులోనూ కుక్క పిల్లలంటే మరీనూ.. యజమాని కనిపిస్తే చాలు, తోక ఊపుకొంటూ ఎంచక్కా దగ్గరకు వెళ్లిపోతాయవి. విశ్వాసానికి మారుపేరుగా కూడా వీటిని చెబుతుంటారు. చెప్పడమే కాదు అందుకు

Published : 03 Jun 2022 01:06 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి పిల్లలకు పెంపుడు జంతువులంటే బోలెడు ఇష్టం కదూ! అందులోనూ కుక్క పిల్లలంటే మరీనూ.. యజమాని కనిపిస్తే చాలు, తోక ఊపుకొంటూ ఎంచక్కా దగ్గరకు వెళ్లిపోతాయవి. విశ్వాసానికి మారుపేరుగా కూడా వీటిని చెబుతుంటారు. చెప్పడమే కాదు అందుకు ఉదాహరణగానూ నిలుస్తోంది ఓ పప్పీ. అది చేస్తున్న పనికి అందరూ శెభాష్‌ అంటున్నారు కూడా. ఆ పప్పీ కథేంటో తెసుకోవాలంటే, చకచకా ఇది చదివేయండి మరి.

జర్మన్‌ షెఫర్డ్‌ జాతికి చెందిన ఓ కుక్క.. నోటితో టిఫిన్‌ బాక్స్‌ పట్టుకొని రోడ్డు మీద వెళ్తుండటాన్ని ఓ ట్రావెలర్‌ చూశాడు. అది ఏ ప్రాంతమో తెలియదు కానీ వెంటనే తన వాహనాన్ని పక్కన నిలిపి, దాని గురించి అక్కడి వారిని ఆరా తీశాడు. ఆ పప్పీ పేరు షెరూ అనీ, ఇతర వివరాలూ తెలుసుకున్నాక అతడు అవాక్కయ్యాడట.

రోజూ 2 కిలోమీటర్లు..

ఆ కుక్క యజమాని.. వాళ్ల ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ కంపెనీలో పనిచేస్తుంటాడట. ఆయన కోసం ఈ పప్పీ లంచ్‌ బాక్స్‌ తీసుకొని వెళ్తుందట. నిజమే ఫ్రెండ్స్‌.. ఒకటీ రెండుసార్లు కాదు, ప్రతిరోజూ మధ్యాహ్నం ఆ కుక్క లంచ్‌ బాక్స్‌ను నోటితో పట్టుకొని మరీ.. 2 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న యజమానికి ఇస్తుందట. బాక్స్‌లోనివి తినేసిన తర్వాత.. ఖాళీ డబ్బాను కూడా మళ్లీ పప్పీనే ఇంటికి తీసుకెళ్తుందట. 

వాహనం వస్తే...

‘ఈ పప్పీ వచ్చివెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే?’ అనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే, ఈ కుక్క రోడ్డు నియమాలను కచ్చితంగా పాటిస్తుంది. ఎలా అంటే.. నడుస్తున్న సమయంలో ఏదైనా వాహనం ఎదురుగా వస్తే.. రోడ్డు కిందకు దిగి మరీ దానికి దారి ఇస్తుందట. వాహనం వెళ్లిపోయిన తర్వాత మళ్లీ యథావిధిగా తన ప్రయాణం సాగిస్తుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌

ఈ కుక్క టిఫిన్‌ బాక్సు మోసుకెళ్తున్న వీడియోను సదరు ట్రావెలర్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ లక్షల్లో వ్యూస్‌, వేలల్లో లైక్స్‌ తెచ్చుకున్న ఈ షెరూను నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు. కొందరు విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటే, ఇంకొందరేమో మూగజీవితో పని చేయించడం బాగోలేదంటున్నారు. ఏది ఏమైనా ఈ పప్పీ నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని