logo

టీఎస్‌బీపాస్‌తోనే అనుమతులు.. డీపీఎంఎస్‌ విధానం పూర్తిగా నిలుపుదల

భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్‌ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్‌ లేఅవుట్‌ అండ్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్‌బీపాస్‌) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు.

Updated : 26 Apr 2024 08:14 IST

ఈనాడు, హైదరాబాద్‌

వన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్‌ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్‌ లేఅవుట్‌ అండ్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్‌బీపాస్‌) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. హెచ్‌ఎండీఏ ఏడు జిల్లాల పరిధిలోని 70 మండలాలు, 1032 గ్రామాలు, ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో విస్తరించి ఉంది. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు, లేఅవుట్‌ అనుమతుల కోసం టీఎస్‌బీపాస్‌తోపాటు 2016లో ప్రవేశపెట్టిన డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(డీపీఎంఎస్‌) విధానాన్ని వాడుతున్నారు. ఇది పాత విధానం కావడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రక్రియలో జాప్యం తోపాటు జవాబుదారీతనం లోపిస్తోంది. ఈ నేపథ్యంలో డీపీఎంఎస్‌ను పూర్తిగా నిలుపుదల చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నుంచి హెచ్‌ఎండీఏ పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు గ్రామ పంచాయతీల్లో అనుమతులు కోసం టీఎస్‌బీపాస్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ ప్రయోజనాలు...

  • టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పత్రాలు అప్‌లోడ్‌ చేసి నిర్ణీత ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఏకగవాక్ష విధానంలో అన్ని విభాగాల నుంచి ఎన్‌వోసీలను పొందే వీలుంది.
  • డీపీఎంఎస్‌తో పోల్చితే డేటా, దరఖాస్తుదారుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత ఉంటుంది.. దరఖాస్తు చేసుకున్న నిర్ణీత వ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలి. ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తే...సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వీలు ఇందులో ఉంది. నిర్ణీత కారణం లేకుండా అర్జీలను తిరస్కరించే అధికారం సిబ్బందికి లేదు.
  • టీఎస్‌బీపాస్‌ విధానంలో 75 చదరపు గజాల విస్తీర్ణం జీప్లస్‌ వన్‌ ఫ్లోర్‌ బిల్డింగ్‌ కోసం అనుమతి లేదా ఆక్యుపెన్సీ ధ్రువపత్రం పొందాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అనుమతుల అవసరం లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు. అంతకుమించిన భవన నిర్మాణ అనుమతులు,  ఆక్యుపెన్సీ ధ్రువీకరణ కోసం ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కొత్త లేఅవుట్లకు సైతం టీఎస్‌బీపాస్‌ ద్వారా అనుమతులు పొందవచ్చు.  భూ వినియోగం, భూ వినియోగ మార్పిడి ధ్రువపత్రాలు, బహుళ అంతస్తుల  నిర్మాణాలకు సంబంధించి ఎన్‌వోసీలకూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని