చిన్ని అందమైన పక్షిని..!

హాయ్‌ నేస్తాలూ..! నా గురించి మీకు కొన్ని విషయాలు చెబుదామని.. చాలా దూరం నుంచి ఎగురుకుంటూ.. మీ పేజీలోకి వచ్చాను. అన్నట్టు ఎలా ఉన్నారు..

Published : 11 May 2024 00:01 IST

హాయ్‌ నేస్తాలూ..! నా గురించి మీకు కొన్ని విషయాలు చెబుదామని.. చాలా దూరం నుంచి ఎగురుకుంటూ.. మీ పేజీలోకి వచ్చాను. అన్నట్టు ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా..! ఆలస్యం చేయకుండా వెంటనే.. ఈ కథనం చదివి నా విశేషాలేంటో తెలుసుకోండి.. ఎందుకంటే నేను మళ్లీ వెళ్లిపోవాలి కదా!

నా పేరు అమెరికన్‌ గోల్డ్‌ఫించ్‌. అమెరికానే నా స్వస్థలం కదా.. అందుకే ఆ పేరుతో పిలుస్తారు. ఇంకా కెనడా, మెక్సికో వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను. నేను చూడటానికి చిన్నగానే ఉన్నా.. అందంగా ఉంటాను. మాలో ఆడ పక్షులు లేత పసుపు-బ్రౌన్‌ రంగులో ఉంటాయి. మగ పక్షులేమో.. ఎండాకాలంలో ముదురు పసుపు రంగు, శీతాకాలంలో ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాబట్టి మమ్మల్ని చాలా సులభంగా గుర్తుపట్టేయొచ్చు. రెక్కలు నలుపు.. కాళ్లు, ముక్కు లేత ఎరుపు రంగులో ఉంటాయి.

 శాకాహారిని..!

 మరో విషయం ఏంటంటే.. ప్రపంచంలో ఉన్న శాకాహార పక్షుల్లో నేనూ ఒకదాన్ని. పండ్లు, ఆకులు తింటాను. కానీ.. ఎక్కువగా విత్తనాలు తినడానికి ఇష్టపడతాను. నేను కొన్నిసార్లు గుంపులో ఉండటానికి ఆసక్తి చూపుతాను. మా గుంపుకు ‘చార్మ్‌’ అని పేరు కూడా ఉంది. నేను ఒక్కోసారి ఒక్కోలా శబ్దాలు చేస్తాను. మీకో విషయం తెలుసా.. నేను న్యూజెర్సీ రాష్ట్ర పక్షిని కూడా! అక్కడ నన్ను ఈస్టర్న్‌ గోల్డ్‌ఫించ్‌ అని పిలుస్తారు.

తరంగాల్లా..!

నేను అన్ని పక్షుల్లా ఒకేలా ఎగరను తెలుసా..! తరంగాల్లా కిందకి, పైకి వెళ్తుంటాను. కొంతమంది నన్ను పెంచుకోవడానికి కూడా ఆసక్తి చూపుతారు తెలుసా! నా బరువు 11 నుంచి 20 గ్రాములు ఉంటుంది. పొడవు 11 నుంచి 14 సెంటీ మీటర్లు. ప్రస్తుతం మా సంఖ్య బాగానే ఉంది. సాధారణంగా అయితే మూడేళ్లు, కాస్త రక్షణ కల్పిస్తే 11 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు. ఉంటా మరి బై నేస్తాలూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని