నడిచే చేపమ్మా.... నీ కబుర్లు చెప్పమ్మా!

హాయ్‌! పిల్లలూ! నన్ను చూస్తే ఏదో వింత జీవిలా అనిపిస్తున్నాను కదూ... నేను ఎవరో కాదు ఓ చేపను. ప్రపంచంలోని అరుదైన చేపల్లో ఒకదాన్ని. మరి ‘చేపలా మొప్పల్లేవే’ అంటారా? తలపై కిరీటం, నాలుగు కాళ్లు... విచిత్రంగా ఉండే నా ఈ రూపమే నా అసలు ప్రత్యేకతన్నమాట.

Published : 31 Jan 2018 01:01 IST

నడిచే  చేపమ్మా.... నీ కబుర్లు చెప్పమ్మా!

హాయ్‌! పిల్లలూ! నన్ను చూస్తే ఏదో వింత జీవిలా అనిపిస్తున్నాను కదూ... నేను ఎవరో కాదు ఓ చేపను. ప్రపంచంలోని అరుదైన చేపల్లో ఒకదాన్ని. మరి ‘చేపలా మొప్పల్లేవే’ అంటారా? తలపై కిరీటం, నాలుగు కాళ్లు... విచిత్రంగా ఉండే నా ఈ రూపమే నా అసలు ప్రత్యేకతన్నమాట.

ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. మెరిసే నా ఎర్రని రంగు, వింత ఆకారం వల్ల రెడ్‌ హ్యాండ్‌ ఫిష్‌ అని పిలిచేస్తారు.
* సముద్ర లోతుల్లో తిరుగాడే చేపల సంగతులే వినుంటారు ఇప్పటి వరకు. మరి నేనేం చేస్తానో తెలుసా? నీటి అడుగున చకచకా నడిచేస్తా. గెంతులు వేస్తూ కలయ తిరిగేస్తా. అవునండి కోడి కాళ్లలాంటి నా బుజ్జి బుజ్జి కాళ్లతో నడుస్తుంటా.
* మేం ఉండేది ఆస్ట్రేలియా... టస్మేనియా సముద్రజలాల్లో. ఇదంతా బాగానే ఉంది. మరి హఠాత్తుగా నేనిప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే? ఇప్పటి వరకు మా సంఖ్య 20 నుంచి 40లోపే ఉందనుకున్నారట మీ శాస్త్రవేత్తలు. ఏవో పరిశోధనలు చేస్తుంటే నీటి అడుగున అటూ ఇటూ తిరుగుతున్న మా చేపల్ని చూసి అనుకున్నదానికన్నా రెట్టింపు సంఖ్యలో 80 వరకూ ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... మేమసలే అంతరించిపోయే దశలోఉన్నాం మరి. అలా ఈమధ్య వార్తల్లోకి వచ్చామన్నమాట.
* మా జాతిని మొదటిసారిగా గుర్తించింది 1800 సంవత్సరంలో. మా హ్యాండ్‌ ఫిష్‌ చేపల్లో వివిధ రంగుల్లో మొత్తం 14 రకాల జాతులున్నాయి.
* మాది ఇంత అరుదైన జాతి కాబట్టే ఆస్ట్రేలియా ప్రభుత్వం మా బొమ్మతో ఓ పోస్టల్‌ స్టాంపునూ విడుదల చేసింది.
* అయిదు అంగుళాల పొడవుండే మేం, చిన్న
పురుగుల్ని, బుల్లి నత్తల్ని తిని పొట్ట నింపుకొంటాం.
* సంతోషకరమైన విషయం ఏమిటంటే... మా ఉనికి కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగైనా మాకు మంచి రోజులు వస్తాయేమో. ఇక ఉంటానే. ఇప్పటికే ఆలస్యమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని