Polimera 2: సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్‌’.. ఉత్తమ నటుడిగా నవీన్‌ చంద్ర

శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్‌’, సత్యం రాజేశ్‌ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డులు దక్కాయి.

Published : 01 May 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సత్యం రాజేశ్‌, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. నేరుగా ఓటీటీలో (డిస్నీ+ హాట్‌స్టార్‌) విడుదలై, మంచి వ్యూస్‌ దక్కించుకున్న ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబరులో థియేటర్లలో రిలీజై, ప్రేక్షకులను థ్రిల్‌ చేసింది. ఇప్పుడు మరో విజయం దక్కించుకుంది. ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అవార్డు (dada saheb phalke film festival award) సొంతం చేసుకుంది. మరోవైపు, శ్రీసింహా హీరోగా తెరకెక్కిన ‘ఉస్తాద్‌’ (Ustaad)కు ఆ ఫెస్టివల్‌లో ‘ఆనరరీ జ్యూరీ మెన్షన్‌’ విభాగంలో ఆ పురస్కారం లభించింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘‘ప్రేమతో మేం తెరకెక్కించిన ఈ సినిమాకి అవార్డు వచ్చింది. దీనికి కారణమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొంది. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే జయంతి సందర్భంగా దిల్లీలో 14వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను మంగళవారం నిర్వహించారు.

ఎత్తైన ప్రదేశాలంటే భయపడే ఓ యువకుడు పైలట్‌ అవ్వాలన్న తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు? ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లేంటి? అనే ఆసక్తికర అంశాలతో దర్శకుడు ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రమే ‘ఉస్తాద్‌’. కావ్యా కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌. గతేడాది ఆగస్టులో థియేటర్లలో అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఉత్తమ నటుడిగా నవీన్‌ చంద్ర..

‘మంత్‌ ఆఫ్‌ మధు’ చిత్రానిగానూ నవీన్‌ చంద్ర ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన ఈ సినిమా 2023 అక్టోబరులో థియేటర్లలో విడుదలైంది. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని