నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (CPC) అంగీకరించింది.

Published : 01 May 2024 00:06 IST

బీజింగ్‌: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. కొంతకాలంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదికలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (CPC) అంగీకరించింది. డిమాండ్‌ క్షీణించడం, అనిశ్చిత బాహ్య కారణాలే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యల కోసం జులైలో జరిగే సీపీసీ సెంట్రల్‌ కమిటీ సమావేశం ‘ప్లీనం’లో చర్చించాలని నిర్ణయించింది.

కొవిడ్‌-19 మహమ్మారి, తీవ్రమవుతోన్న ప్రాపర్టీ మార్కెట్‌ సంక్షోభాలతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన 24 మందితో కూడిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో అంగీకరించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. స్థానికంగా, విదేశాల్లో చైనా సంస్థలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావించారని తెలిసింది. డిమాండ్‌ తగ్గిపోవడం, సంస్థలు ఎదుర్కొంటున్న నిర్వహణ భారం, అనిశ్చితంగా ఉండే బాహ్య వాతావరణం వంటి సవాళ్ల గురించి హెచ్చరించినట్లు చైనా అధికార వార్తా సంస్థ వెల్లడించింది.

ఎన్నో వ్యాపార సంస్థలు నిర్వహణ భారంతో సతమతమవుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థలు విదేశాలకు తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తామని అధ్యక్షుడు చెప్పినట్లు సమాచారం. దేశీయ, సామాజిక, ఆర్థిక విధానాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని తాజా సమావేశంలో పిలుపునిచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని