Baahubali animated series: మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి

‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు.

Published : 01 May 2024 00:07 IST

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ (Baahubali) చిత్రాలు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేశాయి. ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, నాజర్‌ కీలకపాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద వందల కోట్ల వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘బాహుబలి-3’ ఉంటుందంటూ కొన్ని రోజుల కిందట వరకూ వార్తలు వచ్చాయి. ఆ మూవీ సంగతేమో కానీ, తాజాగా చిత్ర దర్శకుడు రాజమౌళి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ రాబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలవుతుందని ప్రకటించారు.

‘మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు, ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ యానిమేటెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌ రాబోతోంది’ అని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ‘బాహుబలి’ మూవీని వివిధ రూపాల్లో తీసుకొచ్చే అవకాశం ఉందని రాజమౌళి పలు వేదికలపై ప్రకటించారు. మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో కూడిన ఆనంద్‌ నీలకంఠన్‌ రాసిన ‘ది రైజ్‌ ఆఫ్‌ శివగామి’ పుస్తకం కూడా పాఠకులను అలరించింది. ఇప్పుడు యానిమేటెడ్‌ సిరీస్‌ గురించి రాజమౌళి స్వయంగా ప్రకటించడం విశేషం. మరి ఇందులో ఏయే అంశాలను చూపిస్తారు? శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవుడు, దేవసేన పాత్రలు ఉంటాయా? వాటితో పాటు ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సరికొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని తన సినిమాలను అత్యున్నత స్థాయిలో తీసే రాజమౌళి యానిమేటెడ్‌ సిరీస్‌ ప్రకటించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

ఇక జక్కన్న సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు కథానాయకుడిగా ఓ యాక్షన్ అడ్వెంచర్‌ మూవీ చేయబోతున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణలో సాగే కథ అని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను రాజమౌళి, ఆయన టీమ్‌ ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు