విక్రయించని స్థలాలకే ఎల్‌ఆర్‌ఎస్‌

లేఅవుట్లలో ఇప్పటివరకు విక్రయించకుండా మిగిలిపోయిన స్థలాల(ప్లాట్ల)కు మాత్రమే అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Published : 12 Nov 2022 00:57 IST

ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయితే నిరాకరణ

ఈనాడు, హైదరాబాద్‌: లేఅవుట్లలో ఇప్పటివరకు విక్రయించకుండా మిగిలిపోయిన స్థలాల(ప్లాట్ల)కు మాత్రమే అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్లాటు కొని రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉంటే.. అలాంటి వాటికి తాజా ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వాటిలో నేరుగా నిర్మాణాలకు మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. ఇందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఛార్జీలతోపాటు 33 శాతం కాంపౌండ్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణతో పోల్చితే ఈ ఫీజులు తడిసిమోపెడు అవుతుండటంతో చాలామంది స్థల యజమానులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకున్నా, మధ్యలో ఆగిపోయిన లేఅవుట్లలో ప్లాట్లకు సంబంధించి తాజాగా క్రమబద్ధీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, మేడ్చల్‌ జోన్లలో 1337 ఇలాంటి అక్రమ లేఅవుట్లను గుర్తించారు. ఇందులో క్రమబద్ధీకరణకు 628 లేఅవుట్లు అర్హమైనవిగా తేల్చారు. వీటిల్లో 1.31 లక్షల ప్లాట్లు ఉండగా.. ఇప్పటివరకు 40 వేల స్థలాలు ఇంకా విక్రయించకుండా మిగిలిపోయాయి. చాలా లేఅవుట్లు నగర శివార్లలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అక్కడ నిర్మాణాలు వచ్చే పరిస్థితి లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశం కల్పించడం వల్ల భవిష్యత్తులో నిర్మాణాలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండదని చెబుతున్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు

తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌కు అర్హమైన లేఅవుట్ల కోసం లెక్కలు తీస్తే.. కళ్లు చెదిరే వాస్తవాలు బయట పడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ లేఅవుట్లు వేసినట్లు తేలింది. మొత్తం 1337 లేఅవుట్లలో సగానికి పైగా కనీస నిబంధనలు పాటించలేదని తేలింది. అసైన్డ్‌ భూములు, చెరువుల శిఖం, నీటి వనరుల ప్రాంతంలో ఎఫ్‌టీఎల్‌ ఆక్రమించిన భూముల్లో లేఅవుట్లు కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఇలాంటి లేఅవుట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం కొందరు పైరవీలు చేస్తున్నారు. దళారులు రంగ ప్రవేశం చేసి పనులు చేసి పెడతామని నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం దరఖాస్తుదారులు, దళారులతో కిటకిటలాడుతోంది. అడిగినంత ముట్టచెబితే తక్షణమే పని పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని