రియాల్టీకి ఆశ.. నిరాశల బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌పై రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక మంత్రి అసలు పట్టించుకోలేదని కొందరు అంటుంటే... పట్టణాల్లో ఇన్‌ఫ్రాకు నిధుల కేటాయింపు పరోక్షంగా స్థిరాస్తి రంగానికి మేలు చేస్తుందని ఇంకొందరు అంటున్నారు.

Updated : 06 Feb 2023 12:28 IST

కేంద్ర ఆర్థిక పద్దుపై పరిశ్రమ వర్గాల నుంచి మిశ్రమ స్పందన
ఈనాడు, హైదరాబాద్‌

కేంద్ర బడ్జెట్‌పై రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక మంత్రి అసలు పట్టించుకోలేదని కొందరు అంటుంటే... పట్టణాల్లో ఇన్‌ఫ్రాకు నిధుల కేటాయింపు పరోక్షంగా స్థిరాస్తి రంగానికి మేలు చేస్తుందని ఇంకొందరు అంటున్నారు. రియాల్టీకి పెద్దగా ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం మాత్రం ఇళ్ల కొనుగోలుదారులనే కాదు రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమను నిరాశ పర్చింది. బడ్జెట్‌కు ముందు క్రెడాయ్‌, నరెడ్కో వంటి జాతీయ నిర్మాణ రంగ సంఘాలతో పాటూ తెలంగాణ క్రెడాయ్‌ నుంచి విత్తమంత్రికి వినతులు అందాయి.  ఒక్కటంటే ఒక్కటి కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు.

భారత్‌ 2025 నాటికి రూ.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎంతలేదన్నా లక్ష కోట్ల రూపాయల వరకు రియల్‌ ఎస్టేట్‌ తోడ్పాటు ఉంటేనే భారత లక్ష్యం సాకారం అవుతుందని రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగమిది అని.. పరోక్షంగా 250కిపైగా అనుబంధ పరిశ్రమలు నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్నాయని, బడ్జెట్‌ వచ్చిన ప్రతిసారి కేంద్రానికి గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువసార్లు వీటిపై బడ్జెట్‌లో నిరాశే ఎదురైంది. ఈసారి బడ్జెట్‌లో చూస్తే..

రూ.10వేల కోట్లు

బడ్జెట్‌లో వ్యక్తిగత ప్రోత్సాహకాలు, తాయిలాల కంటే సంస్థాగత మార్పులపై కేంద్రం దృష్టిపెట్టినట్లు బడ్జెట్‌ను విశ్లేషిస్తున్న రియాల్టీ నిపుణులు పేర్కొన్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇది స్వాగతించాల్సిన విషయమని..ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, శివార్ల అభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నారు. అయితే ఇంత పెద్ద దేశంలో రూ.10వేల కోట్లు ఏ మూలకు అనేవారు ఉన్నారు.

రూ.10 లక్షల కోట్లు

పట్టణీకరణ నేపథ్యంలో పట్టణాల అభివృద్ధికి సంబంధించి రూ.10 లక్షల కోట్ల మూల ధన వ్యయం చేయాలని బడ్జెట్‌లో ప్రకటించారు. 2019తో పోలిస్తే మూడురెట్లు ఎక్కువ. ఈ నిధులతో విద్యుత్తు, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతులపై ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. సహజంగానే ఇది రియాల్టీకి డిమాండ్‌ వైపు తీసుకెళుతుందని అంటున్నారు. విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరుగుతుందని చెబుతున్నారు.

పీఎంఏవై కింద..

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద ఇళ్ల నిర్మాణానికి రూ.79వేల కోట్లకుపైగా నిధులను కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఇది కూడా నిర్మాణ రంగానికి కొంత సానుకూల నిర్ణయమే అంటున్నారు. అయితే  పీఎంఏవై కింద నిర్మించే సరసమైన ధరల్లో ఇల్లు రూ.45 లక్షలుగా ఉంది. ఈ పరిమితి పెంచాలని కోరినా బడ్జెట్‌లో వాటి గురించి ఊసే లేదు.

సర్‌ఛార్జి తగ్గింపుతో..

రూ.5కోట్లకు మించి వార్షికాదాయం ఉన్నవారు ఆదాయపన్నుతో పాటూ 37 శాతం సర్‌ఛార్జిని ప్రస్తుతం చెల్లిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ మిగులు ఆదాయం స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని అంటున్నారు.


ప్రతికూలతలు

బడ్జెట్‌కు ముందు రోజు కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గవనే సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుతం వడ్డీరేట్లు సగటున 9 శాతంగా ఉన్నాయి. కొత్త గృహరుణాలకు 0.5 శాతం వరకు తక్కువకు ఇస్తున్నారు. పెరిగిన వడ్డీరేట్లతో గృహరుణ లభ్యత తగ్గడమే కాదు  ఈఎంఐ భారం పెరుగుతుంది. మధ్యతరగతి వర్గాలకు ఇది కొంత భారమే. దీని నుంచి ఊరట ఆశించినా బడ్జెట్‌లో దక్కలేదు. పాత ఆదాయ పన్ను విధానంలో మార్పులు లేకపోవడం నిరాశనే మిగిల్చింది.

* ఆదాయ పన్ను సెక్షన్‌ 54, 54 ఎఫ్‌ ప్రకారం ఇల్లు, మూలధన ఆస్తులను విక్రయించి.. తిరిగి స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడితే మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉండేది. కొత్తగా పరిమితులు విధించారు. రూ.పది కోట్ల లోపల ఇంటి విక్రయాల వరకే ఇది వర్తిస్తుంది. ఆపై ధర కలిగిన వాటికి మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది పరిశ్రమకు ప్రతిబంధకం అవుతుందని.. పునఃపరిశీలించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.


బడ్జెట్‌లో ప్రోత్సాహకాల ఊసే లేదు

- సీహెచ్‌ రాంచంద్రారెడ్డి, ఛైర్మన్‌, క్రెడాయ్‌ తెలంగాణ

బడ్జెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ను పూర్తిగా విస్మరించారు. ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. కొవిడ్‌ తర్వాత ప్రస్తుతం స్థిరాస్తి రంగం హైదరాబాద్‌ మినహా దేశవ్యాప్తంగా బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా పరిశ్రమకు రాయితీలు అవసరం లేదని కేంద్రం భావించినట్లు ఉంది. జీఎస్‌టీ, ఆదాయపన్నుపై ప్రోత్సాహకాలు లేవు. ఎన్నికల ఏడాది కావడంతో వారి ప్రాధాన్యతల మేరకు బడ్జెట్‌ను తీర్చిదిద్దినట్లు కనిపించింది. మౌలిక వసతుల కల్పనకు, పీఎంఏవైకి నిధులు పెంచడం ద్వారా పరోక్షంగా పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని