నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో మేలా? పూర్తి అయిన వాటిలో కొనాలా?

ఇల్లు కొనాలనే నిర్ణయానికి వచ్చినా... గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవాటిని కొంటే మేలా? నిర్మాణంలో ఉండగా బుక్‌ చేస్తే కలిసొస్తుందా? వంటి ప్రశ్నలు కొనుగోలుదారుల మదిని తొలుస్తుంటాయి. 

Published : 18 Feb 2023 01:13 IST

ఇల్లు కొనాలనే నిర్ణయానికి వచ్చినా... గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవాటిని కొంటే మేలా? నిర్మాణంలో ఉండగా బుక్‌ చేస్తే కలిసొస్తుందా? వంటి ప్రశ్నలు కొనుగోలుదారుల మదిని తొలుస్తుంటాయి.  కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థోమత నిర్ణయాన్ని ప్రభావితం చేసినా.. ఈ రెండింటి గురించి ముందే తెలుసుకుంటే ధీమాగా నిర్ణయం తీసుకోవచ్చు.


సిద్ధంగా ఉన్న వాటిలో...

* ఇల్లు కొనుగోలు చేశాక సంవత్సరాల తరబడి ఎదురుచూడటం చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వారు సిద్ధంగా ఉన్న ఇళ్ల వైపు మొగ్గు చూపవచ్చు.

నిర్మాణం పూర్తయ్యాక ఇల్లు ఎలా ఉంటుందో? ఇలాంటి సందేహాలేవీ లేకుండా సిద్ధంగా ఉన్న ఇళ్లను ప్రత్యక్షంగా చూసి కొనుగోలు చేయవచ్చు. మీరు ఏం చూస్తారో.. దాన్నే కొనుగోలు చేస్తారు.

రుణ మంజూరు సులభం. బ్యాంకులు వీటికి త్వరగా గృహ రుణాలను మంజూరు చేస్తాయి. నిర్మాణ సంస్థలు ప్రత్యేకించి బ్యాంకులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నాయి. ఆయా ప్రాజెక్టులను ఆమోదించిన బ్యాంకుల నుంచి రుణాలు పొందడం మరింత తేలిక.
ఇల్లు కొనగానే గృహ ప్రవేశం చేయవచ్చు కాబట్టి అద్దెల భారం ఉండదు. కిరాయి ఇంట్లో అద్దె కట్టే బదులు.. సొంతింట్లో ఈఎంఐ చెల్లించడం మేలు. బడ్జెట్‌లో చూసుకుని కొనుగోలు చేయవచ్చు.

సహజంగానే ధర కాస్త ఎక్కువే ఉంటుంది. బేరమాడితే ధర తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొహమాట పడొద్దు. చుట్టు పక్కల నాలుగైదు ప్రాజెక్టుల్లో ధర వాకబు చేస్తే తాము చెల్లించేది సహేతుకమైనదా కాదా అని తెలుస్తుంది. మరీ ఎక్కువ చెబుతుంటే మరో చోట తీసుకోవచ్చు.

పూర్తైన ఇళ్లు కొన్నిసార్లు తక్కువ ధరకు కూడా దొరుకుతాయి. మార్కెట్‌ పరిస్థితులు, నిర్మాణదారు ఆర్థిక అవసరాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.

కొనుగోలుకు ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాలి. వాయిదాల అవకాశం ఉన్నా స్వల్పకాలం మాత్రమే. ఇంటీరియర్‌, గృహప్రవేశం ఖర్చులన్నీ ఒకేసారి మీద పడతాయి.

నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలు, ఇష్టాలకు తగ్గట్టుగా మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు.

పరిమిత ఫ్లాట్ల కారణంగా కావాల్సిన అంతస్తు, నచ్చిన దిక్కు వంటి వాటిలో రాజీపడాల్సి ఉంటుంది. లభ్యత తక్కువగా ఉంటుంది.


నిర్మాణంలో ఉండగా కొంటే..

నిర్మాణ ఆరంభంలో ఉన్న ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయడం ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇల్లు పూర్తయ్యేసరికి నగరంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా 30 శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ఆ మేరకు కొనుగోలు చేసే మొత్తం వ్యయం తగ్గినట్లే.

మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు మొదలవుతుంటాయి. మనం ఏ ప్రాంతంలో ఇల్లు కోసం చూస్తున్నామో.. అక్కడ ఒకసారి తిరిగినా కొత్త నిర్మాణాలు తెలిసిపోతాయి. లభ్యత ఎక్కువగా ఉంటుంది.

ప్రాజెక్ట్‌ ప్రారంభంలో కాబట్టి నచ్చిన ఫ్లోర్‌, దిక్కుతో పాటూ ధర కూడా తక్కువకే వస్తుంది.

కొన్ని సంస్థలైతే వారి పూర్వ కొనుగోలుదారులకు ఇలాంటి సమాచారాన్ని ముందస్తుగా చేరవేస్తాయి. తద్వారా బుకింగ్స్‌ చేపడతాయి. రాయితీలు అందిస్తాయి.

ఇంటిని తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలోనే ఇటువంటి వెసులుబాటు ఉంటుంది.

* నిర్మాణదారుడు ఎంతకాలంలో ప్రాజెక్టును పూర్తిచేయగలరనేది కొనేముందు చూడాలి. చెప్పిన సమయానికి ఇచ్చే చరిత్ర ఉందా లేదా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.  

కట్టే సమయంలో ఎప్పటికప్పుడు వెళ్లి నిర్మాణ నాణ్యతను పరిశీలించవచ్చు.

విడతలవారీగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆర్థిక భారం కాదు. మొదట్లో తమ వద్ద ఉన్న పొదుపు సొమ్ము చెల్లించి.. ఆఖరున గృహరుణానికి  వెళ్లొచ్చు.

నిర్మాణం ఆరంభంలో మౌలిక వసతులు లేకపోయినా.. పూర్తైయ్యే నాటికి చాలావరకు రహదారులు, ఇతర సామాజిక మౌలిక వసతులు మెరుగయ్యే అవకాశం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని