గృహాల వైపే మన బిల్డర్ల మొగ్గు

కొవిడ్‌ తర్వాత స్థిరాస్తి రంగంలో చాలా మార్పులు వచ్చాయి. వాణిజ్య భవనాల నిర్మాణంపై స్థానిక బిల్డర్లు పునరాలోచనలో పడ్డారు.

Published : 04 Mar 2023 01:07 IST

కొవిడ్‌కి ముందు వాణిజ్య నిర్మాణాల వైపు పలు సంస్థల అడుగులు
కొందరికి మిశ్రమ ఫలితాలు.. రెసిడెన్షియలే లాభసాటంటున్న నిర్మాణదారులు
పెరిగిన కొత్త ప్రాజెక్టులు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ తర్వాత స్థిరాస్తి రంగంలో చాలా మార్పులు వచ్చాయి. వాణిజ్య భవనాల నిర్మాణంపై స్థానిక బిల్డర్లు పునరాలోచనలో పడ్డారు. తమకు పట్టున్న, తెలిసిన గృహ నిర్మాణమే మేలని భావిస్తున్నారు. కొవిడ్‌కు కొన్నేళ్ల ముందు గృహ నిర్మాణ రంగంలో ఉన్న పలువురు హైదరాబాద్‌ బిల్డర్లు కార్యాలయాలు మాల్స్‌, వాణిజ్య సముదాయాల విభాగంలోకి ప్రవేశించి భారీ ప్రాజెక్టులు చేపట్టారు. కొందరు సొంతంగా ప్రాజెక్ట్‌లు చేపడితే.. మరికొందరు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టారు. కొవిడ్‌ అనంతరం వీటికి డిమాండ్‌పై అనిశ్చితి నెలకొంది. ఇంటి నుంచి పనితో కార్యాలయాలు, మాల్స్‌కు ఆశించినంత డిమాండ్‌ లేదు. మార్కెట్‌లో వీటి సరఫరా సైతం ఎక్కువ ఉండటంతో గృహ నిర్మాణమే మేలనే నిర్ణయంతో రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లపై తిరిగి దృష్టి పెడుతున్నారు.

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా..

గృహ అద్దెలతో పోలిస్తే వాణిజ్య అద్దెలు చాలా అధికంగా ఉంటాయి. హైదరాబాద్‌లో కొవిడ్‌కి ముందు గ్రేడ్‌ ఏ రకం చదరపు అడుగుకు రూ.70 వరకు ఉండేది. ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇంటి నుంచి పనితో చాలా కార్యాలయాల స్థలాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్‌ ఏ తో పోలిస్తే ఇతర కార్యాలయాలకు అసలు డిమాండే లేదు. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు, ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌ సంస్థలు ఎక్కువగా గ్రేడ్‌ ఏ రకం కార్యాలయాలను అద్దెకు తీసుకునేవారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు గ్రేడ్‌ బీతోనూ సరిపెట్టుకునేవి. ఇప్పుడు వీరు సైతం గ్రేడ్‌ ఏ కే మొగ్గుచూపుతున్నారు. కాలంతోపాటు ప్రాధాన్యాలు మారిపోతున్నాయి. వీటిని దృష్టిని పెట్టుకుని ప్రస్తుతం అత్యధికం గ్రేడ్‌ ఏ రకమే నిర్మిస్తున్నారు. ఇంటి నుంచి పనితో వీటికి ఏ మాత్రం లీజింగ్‌ దక్కుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల అద్దెలు తగ్గించినట్లు బిల్డర్లు చెబుతున్నారు. కొత్తవాటిలో వాణిజ్య నిర్మాణం పురోగతి దశలో ఉన్నా ఒక్క అడుగు కూడా విక్రయించని ప్రాజెక్ట్‌లు సిటీలో చాలానే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడున్న దానికంటే రెండు మూడు రెట్లు అధికంగా సరఫరా రాబోతుంది. ఆ మేరకు హైదరాబాద్‌కు పలు కొత్త సంస్థలు, ఇప్పుడున్న కంపెనీల విస్తరణతో కార్యాలయ స్పేస్‌కు డిమాండ్‌ ఉంటుందనే అంచనాలు ఉన్నా.. మారిన ఉద్యోగుల పని విధానంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి పని, ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరగడం, ఓటీటీలో సినిమా వీక్షణ, ఇంటి నుంచే ఆహారానికి ఆర్డర్‌ వంటి మార్పులతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియడం లేదని చెబుతున్నారు. దీంతో కొత్తగా మొదలెట్టే వాళ్లు వాణిజ్యం కంటే గృహ నిర్మాణం లాభసాటని భావిస్తున్నారు. వాణిజ్య భవనాలకు నిధులు సమకూర్చుకోవడం కూడా పెద్ద సవాల్‌. అదే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లకైతే రెరా అనుమతులు ఉండి.. విశ్వసనీయత ఉంటే బుకింగ్స్‌తోనే నిధులు సమకూర్చుకునే వీలుంటుంది. పైగా ఇప్పుడు వాణిజ్య భవనాలు విక్రయించే చదరపు అడుగు కంటే పలు ప్రాజెక్టుల్లో గృహ నిర్మాణంలో చదరపు అడుగు ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని బేరీజు వేసుకుని రెసిడెన్షియల్‌కే మొగ్గుచూపుతున్నారు.

మాల్స్‌ పరంగా..

వాణిజ్య నిర్మాణాల్లో మాల్స్‌ కూడా ప్రధానమైనవి. నగరంలో గత రెండు దశాబ్దాల్లో 40 వరకు మాల్స్‌ వచ్చాయి. అందులో ఈ పదేళ్లలో వచ్చినవే అధికంగా ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి. వారాంతాల్లో మాల్స్‌ చాలా సందడిగా ఉండేవి. వీటిపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కొవిడ్‌ అనంతరం కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయని సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాంతం ఎంపిక, అధిక సరఫరా, రిటైలర్లను ఆకర్షించలేకపోవడం, ఆ ప్రాంతవాసుల కొనుగోలు శక్తి తక్కువ ఉండటం వంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. వీటిని బేరీజు వేసుకుని కొందరు బిల్డర్లు తమ వాణిజ్య ఆలోచనలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ప్రాజెక్ట్‌లు పూర్తై ఆ తర్వాత డిమాండ్‌ ఉంటే చూడొచ్చని ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లు మొదలెడుతున్నారు.


అధ్యయనం చేశాకే రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు వైపు

రాయదుర్గంలో ప్రధాని రహదారి పక్కనే 7 ఎకరాల విస్తీర్ణంలో స్థలం ఉంది. మొదట్లో ఇక్కడ హోటల్‌ కట్టాలనే ఆలోచన ఉండేది. వాణిజ్య సముదాయం కూడా బాగానే ఉంటుందనిపించింది. రెండు రియల్‌ఎస్టేట్‌ కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాం. మొదటిది ఆక్యుపెన్సీ పరంగా అంత లాభసాటిగా లేదని తేలింది. రెండోది రానున్న ఐదేళ్లలో అధిక సరఫరా ఉందని నివేదిక ఇచ్చారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ మేలని 45 అంతస్తుల ప్రీమియం ప్రాజెక్ట్‌ను భాగస్వామ్యులతో కలిసి మొదలెట్టాం. సింగపూర్‌లో ఆకాశహర్మ్యాల భవనాలపై మెరినా బే స్కై డెక్‌ పార్క్‌ ఉంటుంది. అక్కడి నుంచి నగర అందాలన్నీ వీక్షించవచ్చు. నేను అక్కడికి పలు మార్లు వెళ్లాను. 25 ఏళ్ల క్రితం వారు కట్టారు. భారత్‌లో ఇంతకాలమైనా ఎవరూ ఆ తరహాలో కట్టలేదు. హైదరాబాద్‌లోనే కాదు దేశంలోనే తొలిసారి స్కైడేక్‌ను నిర్మించబోతున్నాం.

పి.హర్షారెడ్డి, మేనేజింగ్‌ పార్ట్‌నర్‌, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌


అనరాక్‌ సంస్థ అధ్యయనం ప్రకారం..

* దేశంలో మాల్స్‌ స్టాక్‌ 51 మిలియన్‌ చదరపు అడుగులు ఉంటే హైదరాబాద్‌ వాటా 11 శాతంగా ఉంది.

* గత ఏడాది 2.6 మిలియన్‌ చ.అ. సరఫరా ఉంటే నగర వాటా 29 శాతంగా ఉంది.

* దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి ఏడు నగరాల్లో 25 మిలియన్‌ చ.అ. విస్తీర్ణంలో మాల్స్‌ కడుతున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో ఇవి పూర్తి కాబోతున్నాయి. హైదరాబాద్‌లోనే 5.2 మిలియన్‌ చ.అ.ల్లో వస్తున్నాయి. ఇది దాదాపు 21 శాతానికి సమానం. దేశంలోనే దిల్లీ తర్వాత ఇక్కడే    అత్యధికంగా వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు