Land: మీ ఆస్తి మీపేరు మీద ఉందా?

స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. భూమి, ఇల్లు, ఫ్లాట్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తగిన ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే పని అయిపోతుందని అందరూ సహజంగా భావిస్తారు.

Published : 29 Apr 2023 02:57 IST

రిజిస్ట్రేషన్‌ తర్వాత మ్యుటేషన్‌ తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. భూమి, ఇల్లు, ఫ్లాట్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో తగిన ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే పని అయిపోతుందని అందరూ సహజంగా భావిస్తారు. సేల్‌ డీడ్‌ పట్టుకుని ఇంటికి వెళ్లిపోతారు. కానీ కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆస్తిని తన పేరు మీదకు రికార్డులను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గ్రామాల్లో పంచాయతీ రికార్డుల్లో, నగరాల్లో అయితే మున్సిపాలిటీల్లో, జీహెచ్‌ఎంసీలోని రికార్డుల్లో తన పేరుపై నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆస్తికి తామే నిజమైన వారసులమని తెలియజేయడమే మ్యుటేషన్‌ ముఖ్య ఉద్దేశం.
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన ల్యాండ్‌ రెవెన్యూ రికార్డు ఉంటుంది. సామాన్యులకు వారి ఆస్తి పెట్టుబడులను సురక్షితంగా ఉంచడానికి ఈ రికార్డులు సహాయ పడతాయి. అందుకే ఎవరైనా ఆస్తి కొనుగోలు చేసిన వెంటనే మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రెవెన్యూ రికార్డులలో అమ్మిన వారి పేరు తొలగించి కొన్న వారి పేరు మీదకు ఆస్తి బదిలీ అవుతుంది.  ఎన్కంబరెన్స్‌ సర్టిఫికెట్‌(ఈసీ), ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌,(ఓసీ)లలో మీ పేరు ఉండటం వల్ల ఎలాంటి ఆటంకం ఉండదు.


ఇలా దరఖాస్తు చేయాలి..?

గతంలో మ్యుటేషన్‌ ఛార్జీల పేరిట డీడీని వసూలు చేసి సంబంధిత శాఖలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ పంపేది. ఆస్తిని కొనుగోలు చేసినా, వారసత్వంగా పొందినా, బహుమతిగా వచ్చినా, పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా కొన్నా మ్యుటేషన్‌ తప్పనిసరి. ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ వారే మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అలా మ్యుటేషన్‌ కాని ఆస్తులున్న వారు వెంటనే ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. భవిష్యత్తులో ఆస్తిని విక్రయించాల్సి వస్తే మ్యుటేషన్‌ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. విద్యుత్‌, నీటి సేవలు వంటి యుటిలిటీల కోసం దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు అవసరం. మీ ప్రాంతంలో ఉండే స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాలు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మున్సిపల్‌ సంస్థలు భూ రికార్డులను నిర్వహిస్తాయి. అక్కడే మీరు మీ భూమి లేదా ఇల్లు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తి విలువలో 0.1 శాతం చెల్లించాల్సి ఉంటుంది. పత్రాలు సమర్పించాక ప్రభుత్వ విభాగం ఆస్తి భౌతిక ధ్రువీకరణను నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఆస్తి మ్యుటేషన్‌ సర్టిఫికెట్‌ను ఇస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్నాక అవసరమైన పత్రాలతో పాటు రికార్డును నవీకరించడానికి మున్సిపల్‌ బాడీకి 15 నుంచి 30 రోజులు పట్టవచ్చు. ఆస్తి మ్యుటేషన్‌ దరఖాస్తుతో పాటు.. సేల్‌ డీడ్‌, స్టాంపు పేపర్‌పై ఈ ఆస్తి తనదే అని ధ్రువీకరిస్తూ స్టాంపు పేపర్‌పై అఫిడవిట్‌, ఆధార్‌ కార్డు, ఆస్తి పన్ను రసీదులు, వీలునామా లేదా వారసత్వ ధ్రువీకరణ పత్రం, ఒక వేళ యజమాని మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని