కోటి ఉంటేనే కోరుకున్న ఇల్లు

నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాల జోరు కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది.

Updated : 24 Feb 2024 08:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాల జోరు కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. కోరుకున్న చోట.. కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్‌ కమ్యూనిటీలో రెండు పడక గదుల ఫ్లాట్‌ కొనుగోలు చేయాలంటే కోటి రూపాయలు ఉండాల్సిందే. ప్రస్తుతం నగరంలో సగటు చదరపు అడుగు ధర రూ.5 వేలు పలుకుతోంది. ఇది బేస్‌ ధర మాత్రమే. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదికి రూ.70 లక్షల వరకు అవుతుంది. కారు పార్కింగ్‌, క్లబ్‌ హౌస్‌ సభ్యత్వం, గ్యాస్‌, ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల వంటి మౌలిక వసతుల కోసం మరో పది లక్షల వరకు తీసుకుంటున్నారు. 5 శాతం జీఎస్‌టీ, 7.6 శాతం వరకు రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు కలిపి మరో 10 లక్షల వరకు అవుతున్నాయి. ఇంటీరియర్‌ కోసం మరో రూ.పది లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.కోటి పెడితే రెండు పడకల ఫ్లాట్‌ మాత్రమే వస్తోంది. మరింత విశాలంగా మూడు పడకల గది కావాలన్నా... 20వ అంతస్తులో ఉండాలంటే ఫ్లోర్‌ రైజ్‌ ఛార్జీలు, తూర్పు, ఉత్తరం వైపు ఫ్లాట్‌ కావాలన్నా... చెరువు వైపు, గార్డెన్‌ వైపు ఉన్న బాల్కనీ కావాలన్నా అదనంగా చదరపు అడుగుకు రూ.75 నుంచి 475 వరకు చెల్లించాలి. వీటితో పాటూ మూడు పడకల ఫ్లాట్‌ అంటే కోటిన్నర అవుతోంది. ఇదంతా ఐటీ కారిడార్‌ బయటనే. ఐటీ కారిడార్‌లో అయితే రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగానే జనవరిలో కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. వెయ్యి నుంచి రెండువేల లోపు విస్తీర్ణం కలిగిన వాటి రిజిస్ట్రేషన్లు 71 శాతం జరిగాయి. గత ఏడాదికి, ఈ ఏడాదికి వీటిలో మార్పు లేకపోయినా.. ధరల్లో పెరుగుదల నమోదైంది.

అక్కడ అ‘ధర’హో..

ఇక మూడువేలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఫ్లాట్లు రెండు నుంచి 3 శాతానికి పెరిగాయి. 2 వేల నుంచి 3 వేల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లు 7 నుంచి పది శాతానికి పెరిగాయి. బంజారాహిల్స్‌లో గరిష్ఠంగా రూ.5.16 కోట్ల విలువైన స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ జనవరిలో జరిగింది. పుప్పాలగూడలో రూ.5.09 కోట్లు, నార్సింగిలో రూ.4.43 కోట్లు, సోమాజిగూడలో రూ.4.22 కోట్ల విలువైన రెండు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఇవన్నీ మూడు వేలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగినవే కావడం విశేషం.

అందుబాటు ధరల్లో పరిమితంగా.. : కొందరు బిల్డర్లు సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల లోపల ఉండే రెండు పడకల గదుల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. పటాన్‌చెరు, శామీర్‌పేట, బాచుపల్లి, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో వీటిని చేపట్టారు. అఫర్డబుల్‌ హౌసింగ్‌ కింద వీటిని నిర్మించారు. జీఎస్‌టీ 1 శాతమే ఉంటుంది. ఈ తరహా ఇళ్లు రూ.50 లక్షల ధరల్లో వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ విస్తీర్ణంలో కట్టడం లేదు. 2023 జనవరిలో వీటి రిజిస్ట్రేషన్లు 17 శాతం జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో 14 శాతానికి పడిపోయాయి.  

ధరల పెరుగుదలతో...:

  • ఇళ్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది తగ్గినప్పటికీ ధరల పెరుగుదలతో మొత్తం ఇళ్ల విక్రయాల విలువ 24 శాతం పెరిగింది.
  • రూ.25 లక్షల ఫ్లాట్ల వాటా 19 నుంచి 15 శాతానికి తగ్గింది.
  • రూ.25-50 లక్షల ఇళ్ల వాటా సైతం 53 శాతం నుంచి 47 శాతానికి తగ్గింది.
  • రూ.50-75 లక్షల నివాసాల రిజిస్ట్రేషన్లు 13 నుంచి 16 శాతానికి, రూ.75-1 కోటి విలువ కలిగిన ఇళ్ల వాటా 6 నుంచి 8 శాతానికి పెరిగింది.
  • రూ.కోటి నుంచి రెండు కోట్ల విలువ కలిగిన ఇళ్లు 7 నుంచి 11 శాతానికి, రెండు కోట్లు అంతకంటే ఖరీదైన నివాసాలు 1 నుంచి 3 శాతానికి పెరిగినట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని