గృహరుణ భారం తగ్గేదెలా?

గృహరుణం చాలామందికి భారంగా మారింది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గృహరుణం తప్ప మరో ఆదాయ ప్రత్యామ్నాయం లేకపోవడంతో అధిక వడ్డీరేట్లకైనా తీసుకొనేందుకు సిద్ధపడుతున్నారు.

Updated : 02 Mar 2024 14:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: గృహరుణం చాలామందికి భారంగా మారింది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గృహరుణం తప్ప మరో ఆదాయ ప్రత్యామ్నాయం లేకపోవడంతో అధిక వడ్డీరేట్లకైనా తీసుకొనేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఆ భారాన్ని దీర్ఘకాలంగా మోస్తున్నారు. చాలామంది పదవీ విరమణ చేసిన తర్వాత కూడా గృహరుణానికి వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆదాయం ఉంటే సరే.. లేనివారు ఇంటి రుణాన్ని వేగంగా తీర్చేయడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీరు తీసుకున్న రుణం, వర్తిస్తున్న వడ్డీ.. ఇంకా ఎన్నాళ్లు చెల్లించాలి అనే వివరాలు తెలుసుకోవాలంటే ఇదివరకు బ్యాంకుకు వెళ్లాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చూసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బ్యాంకులు, గృహరుణ సంస్థలు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా మొబైల్‌ యాప్‌లోనే రుణానికి సంబంధించిన వివరాలన్నీ అందిస్తున్నాయి. వీటిని పరిశీలించండి. అప్పుడే మీరు తీసుకున్న రుణంపై మీకు ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ఏం చేయాలన్నది నిర్ణయించుకోవడం సులభం అవుతుంది. దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నప్పుడు అనేక ఆర్థిక లక్ష్యాలు వెనక్కి వెళ్లిపోతాయి. వీటిని సాధించేందుకు రాజీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి, ఈ రుణాన్ని తొందరగా తీర్చే ప్రయత్నం చేయాలి.

  • మీ రుణాన్ని వేగంగా చెల్లించాలంటే ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించాలి. మీ ఆదాయం, ఖర్చులు, బాధ్యతలు, పెట్టుబడులు, రుణ వాయిదాలు పోను మిగులు మొత్తం కనిపిస్తే.. దాన్ని రుణం తీర్చేందుకు వినియోగించవచ్చు.
  • వృథా ఖర్చులను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. అప్పుడే మిగులు మొత్తం పెరుగుతుందన్న సంగతిని గుర్తించాలి. ఇలా మిగులు మొత్తంతో ఏడాదికోసారి రుణం అసలును చెల్లించే ప్రయత్నం చేయాలి.
  • ఏడాదికి 12 నెలలు వాయిదాలు చెల్లించాలి. కానీ, రుణం తొందరగా తీర్చాలంటే.. మీరు ఏడాదికి 14 నెలలు ఉన్నాయనుకోవాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గి, రుణం తొందరగా తీరుతుంది.
  • మీ బ్యాంకులో వసూలు చేస్తున్న వడ్డీ.. మిగతా బ్యాంకుల్లో ఉన్న వడ్డీని పోల్చి చూడండి. 0.5 శాతం వరకూ వ్యత్యాసం ఉంటే.. పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, 1 శాతం అధికంగా ఉందంటే మాత్రం ఆలోచించాల్సిందే. బ్యాంకు లేదా రుణ సంస్థను మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ క్రెడిట్‌ స్కోరు, ఆదాయం తదితరాలను బట్టి, రీఫైనాన్సింగ్‌ చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. ఈఎంఐ తగ్గితే, ఇతర పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. ముందుగా వర్తించే ఫీజుల గురించి తెలుసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని