మంచి రోజులొచ్చాయ్‌..

గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. మంచి రోజులు కావడంతో పాటు కొనుగోళ్లకు ఇదే సరైన సమయంగా నగరవాసులు భావిస్తున్నారు.

Published : 09 Mar 2024 00:16 IST

పెరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు
అత్యధికం ఇళ్లు, స్థలాలవే

ఈనాడు - హైదరాబాద్‌ : గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. మంచి రోజులు కావడంతో పాటు కొనుగోళ్లకు ఇదే సరైన సమయంగా నగరవాసులు భావిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్‌, మేెడ్చల్‌ జిల్లాల్లో ఫిబ్రవరిలో 42,300 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. ఇందులో అత్యధికం ఇళ్లతో పాటు, ప్లాట్‌లు ఉన్నాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 22,269 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఫిబ్రవరి నెలలో రంగారెడ్డి జిల్లా ఆదాయం రూ.437 కోట్లు కాగా గ్రేటర్‌ పరిధిలో రూ.737 కోట్ల వరకూ వెళ్లింది. గడచిన 32 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం గమనార్హం. జనవరిలో 36,818 రిజిస్ట్రేషన్లు జరగగా వచ్చిన ఆదాయం రూ.609 కోట్లు. గతేడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్లలో 21శాతం, ఆదాయంలో 42 శాతం అధికం.

రూ.50 లక్షలలోపు అత్యధిక కొనుగోళ్లు.. : స్థిరాస్తి విలువ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ఉన్నవి 45 శాతం కొనుగోళ్లు జరగగా.. రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల విలువైన ఆస్తులు 16 శాతం ఉన్నాయి. గతంతో పోల్చితే రూ.50 లక్షల లోపు విలువైన ఆస్తులు కొనుగోళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. రూ.75 లక్షల నుంచి రూ.కోటి విలువైన ఆస్తుల కొనుగోళ్లలో 7 శాతం నుంచి 9 శాతం పెరగ్గా.. రూ.కోటి నుంచి రూ.2 కొట్ల విలువైన ఆస్తుల కొనుగోళ్లలో 8 శాతం నుంచి 12 శాతం పెరిగాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల కంటే శివార్లలో నిర్మించే గేటెడ్‌ కమ్యునిటీల్లో ఫ్లాట్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం అందరూ 3 బెడ్‌రూంల ఇళ్లవైపే ఎక్కువమంది మక్కువ చూపుతున్నారు. గతేడాది 52 శాతం మంది 3 బెడ్‌ రూంల ఇళ్లను కొనగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 59 శాతం మంది కొన్నారు. ఒకటి, రెండూ, నాలుగు బెడ్‌రూంల ఇళ్ల అమ్మకాలలో గతేడాదికంటే 2 నుంచి 3 శాతం తగ్గుదల కనిపించింది.


ఛార్జీలు తగ్గిస్తే...

స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌, ట్రాన్స్‌ఫర్‌ ఛార్జీలు కలిపి 7.6 శాతం అవుతున్నాయి. రూ.50 లక్షల స్థిరాస్తి కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలే రూ.3.8 లక్షల వరకు అవుతున్నాయి. జీఎస్‌టీ అదనం. ఛార్జీల భారంగా చాలామంది రిజిస్ట్రేషన్లను వాయిదా వేస్తున్నారు. పరిమిత కాలానికి ఈ ఛార్జీల్లో రాయితీ ఇస్తే రిజిస్ట్రేషన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థిరాస్తి సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రాయితీ ఇచ్చినంత మాత్రాన సర్కారుకు వచ్చే ఆదాయం ఏం తగ్గదని.. లావాదేవీలు పెరగడం ద్వారా ఆ మేరకు భర్తీ అవుతుందని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని