తరుపరి ప్రక్షాళన రిజిస్ట్రేషన్‌ శాఖనే

ధరణి ప్రక్షాళన ప్రక్రియ వడివడిగా జరుగుతోందని.. తదుపరి వంతు రిజిస్ట్రేషన్‌ శాఖదే అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెవెన్యూ కార్యాలయాలను(ఎస్‌ఆర్‌వో)లను చూస్తుంటే సిగ్గుగా ఉందని.. వాటిని మెరుగుపర్చేందుకు, సేవలను సులభతరం చేసేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లు చెప్పారు. స్థిరాస్తి రంగం నుంచి వచ్చే విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ప్రాపర్టీ షోని ఆయన శుక్రవారం ప్రారంభించారు...

Updated : 09 Mar 2024 06:36 IST

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌  

రణి ప్రక్షాళన ప్రక్రియ వడివడిగా జరుగుతోందని.. తదుపరి వంతు రిజిస్ట్రేషన్‌ శాఖదే అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెవెన్యూ కార్యాలయాలను(ఎస్‌ఆర్‌వో)లను చూస్తుంటే సిగ్గుగా ఉందని.. వాటిని మెరుగుపర్చేందుకు, సేవలను సులభతరం చేసేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేయనున్నట్లు చెప్పారు. స్థిరాస్తి రంగం నుంచి వచ్చే విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ప్రాపర్టీ షోని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి రావాల్సి ఉండగా.. దిల్లీలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్‌ కమిటీ సమావేశం శుక్రవారం ఉదయం కూడా ఉండటంతో రాలేకపోయారని అన్నారు. మీ సమస్యల పరిష్కారం కోసం త్వరలో అందరితో సమావేశమవుతా అని సీఎం చెప్పమన్నారని పొంగులేటి తెలిపారు. అనుమతులకు సంబంధించి ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రెండురోజులుగా వడివడిగా జరుగుతున్నాయని.. మీరు కూడా పరిశీలన చేసుకోవచ్చు అని బిల్డర్లకు సూచించారు. భూ సమస్యలకు సంబంధించి ధరణి ప్రక్షాళనతో చాలావరకు తీరిపోతాయని అన్నారు. ధరణితో గత ప్రభుత్వం రియాల్టీని ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా చూశామని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి కొందరికే ప్రయోజనం చేకూరే నిర్ణయాలు కాకుండా అందరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పరిశ్రమ తరఫున లేవనెత్తిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చి సరిగ్గా మూడు నెలలు అయ్యిందని.. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది తప్ప రియాల్టీ రంగాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.  హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు, బ్రాండ్‌ తీసుకొచ్చింది నిర్మాణదారులే అని అన్నారు. డబ్బు చలామణికి మూలం రియాల్టినే అని.. ఎంత డబ్బు అయిన సరే  రియాల్టీ, భూముల్లో దాచుకోవచ్చు అన్నారు. ఈ రంగంలో మీరు సంపాదనతో ఎంత ఎదిగితే.. రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందని బలంగా నమ్మేవారిలో నేను ఒకడినని అన్నారు. తమది స్నేహపూర్వక ప్రభుత్వమని.. వ్యాపారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదన్నారు.

సిటీకి రెండింతల నీటి సరఫరా..

హైదరాబాద్‌ ఈ రోజు ఈ స్థితిలో ఉందంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన నాలుగైదు ప్రాజెక్ట్‌లు కారణమని అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్‌రింగ్‌రోడ్డు, గోదావరి, కృష్ణా నుంచి తాగునీటిని హైదరాబాద్‌కు తీసుకురాకపోతే సిటీ ఈ స్థాయిలో వృద్ధి చెందేది కాదని అన్నారు.  ఇప్పుడు హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న మంచినీటి సామర్థ్యాన్ని రెండింతలు చేయాలనే ప్రణాళికల్లో ఉన్నామని అన్నారు. శాంతిభద్రతలు ఉన్నచోటనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అందుకు భరోసా ఇస్తుందని అన్నారు. సిటీ నలువైపులా అభివృద్ధి చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని.. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అవుటర్‌, ప్రాంతీయ వలయ రహదారులు, అప్రోచ్‌ రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

జీవో 68తో దశ తిరిగింది.. : రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన జీవో 68, రింగ్‌రోడ్డుతోనే హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందిందని భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మళ్లీ ప్రజాపాలన, ప్రజస్వామ్య పాలన వచ్చిందన్నారు. మూసీ అభివృద్ధితో సెంట్రల్‌ హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. క్రెడాయ్‌ వ్యవస్థాపకుల్లో తానూ ఒకడిని అయినందుకు గర్వంగా ఉందన్నారు.  

మాకు గ్యారంటీలు కావాలి.. : ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌ల అనుమతులు కొంతకాలంగా నిలిచిపోయాయనని వీటిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని క్రెడాయ్‌ జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భాగస్వామ్యులకు ఒక కార్యశాల ఏర్పాటు చేసి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనుమతుల ప్రక్రియ పేరుకే ఆన్‌లైన్‌లో ఉందని.. ఆఫ్‌లైన్‌లో అంతా జారీ చేస్తున్నారని.. దీన్ని సరిచేయాలని సీఐఐ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి సర్కారును కోరారు. రెరా అనుమతులను అప్పటికప్పుడు జారీ చేసేలా చూడాలన్నారు. ఫార్మాసిటీ భూములకు సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ ఉండాలని..  నెట్‌జీరో సిటీని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం రింగ్‌రోడ్డు దగ్గరలో భూములను కేటాయిస్తే అందుబాటు ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి తమకు కొన్ని గ్యారంటీలు కావాలని అన్నారు.


3 నెలల్లో ఊపు వచ్చింది..

- వి.రాజశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

కొత్త ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు అయ్యింది. ఈ స్వల్పకాలంలోనే ప్రభుత్వం తీసుకున్న మెట్రోరైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఎలివెటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ శంకుస్థాపన, శివారు మున్సిపాలిటీల విలీనం, హెచ్‌ఎండీఏ పరిధి పెంపు వంటి అంశాలతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు వచ్చింది. రాష్ట్రంలో ఇల్లు కొనాలనే అందరి కల నెరవేర్చడంలో పరిశ్రమ ముందుంది. రాష్ట్ర ప్రగతికి వెన్నెముకగా ఉన్న తమకు ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలను ఆశిస్తున్నాం. ప్రీమియం మార్కెట్‌ పశ్చిమ హైదరాబాద్‌లో 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. ఇళ్ల నిర్మాణానికి డిమాండ్‌ ఉన్న ప్రధాన ప్రాంతాల్లో సర్కారు భూములు కేటాయిస్తే అక్కడ 1200 చ.అ. విస్తీర్ణంలోని ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఉంటుంది. అవసరం ఉన్న చోట ఇళ్ల నిర్మాణం జరగాలనేది మా ఆలోచన.


అందుబాటు ధరలో ఇళ్ల విధానం ప్రవేశపెట్టాలి

- జైదీప్‌రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, క్రెడాయ్‌ హైదరాబాద్‌

రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను ఆధునికీకరించాల్సి ఉంది. అందుకు క్రెడాయ్‌ తన వంతు తోడ్పాటు అందిస్తుంది. మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తే స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 5 శాతానికి తగ్గిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అందుబాటు ధరలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. అసోసియేషన్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలి.


హైటెక్స్‌లో ప్రారంభమైన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

క్రెడాయ్‌ హైదరాబాద్‌ 13వ ఎడిషన్‌ ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఆదివారం వరకు ప్రదర్శన కొనసాగనుంది. రెరా ఆమోదించిన వంద కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. స్థలాల వెంచర్లు మొదలు విల్లాలు, బహుళ అంతస్తుల నిర్మాణాల ప్రాజెక్ట్‌లను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. తమ కలల ఇంటిని ఎంచుకునేందుకు సిటీ అంతటా తిరగడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి... ప్రాపర్టీ షోని సందర్శిస్తే ఎంపిక సులువు అవుతుందని.. ఇది సరైన ‘మోకా’ అని క్రెడాయ్‌ వర్గాలు అంటున్నాయి. అందుబాటు ధరల్లో రూ.50 లక్షల్లోని గృహనిర్మాణాలు మొదలు... పాతిక కోట్ల వరకు ధర పలుకుతున్న ఫ్లాట్‌లు, విల్లాలు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. తమ బడ్జెట్‌ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు ప్రాపర్టీ షోలో బుక్‌ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీలను, ఐఫోన్‌ వంటి ఆఫర్లను అందిస్తున్నాయి.  

8.35 శాతానికి గృహరుణాలు..

ప్రాపర్టీ షోలో నిర్మాణ సంస్థలతో పాటూ బ్యాంకింగ్‌ సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. పలు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు 8.35 శాతానికి గృహరుణాలు అందిస్తున్నట్లు సందర్శకులకు వివరించాయి. తల్లిదండ్రులతోపాటూ వచ్చే పిల్లల వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పండగ రోజు ప్రారంభమైన ప్రాపర్టీ షో తొలిరోజు గృహ కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని