చట్ట పరిధిలో లేని వివాదాలనూ పరిష్కరిస్తున్నాం

ముందస్తు విక్రయాలు, అనుమతి లేకుండా విక్రయాల ప్రచారం చేయటం రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ చట్టాలకు విరుద్ధం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, ఫిర్యాదులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు.

Published : 23 Mar 2024 00:41 IST

కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సయోధ్య ఫోరం, ఆర్బిట్రేషన్‌ ఏర్పాటు చేశాం
పత్రాలు సక్రమంగా ఉంటే పది రోజుల్లోనే ప్రాజెక్టులకు అనుమతులు 
‘ఈనాడు’తో రెరా ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ

ముందస్తు విక్రయాలు, అనుమతి లేకుండా విక్రయాల ప్రచారం చేయటం రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ చట్టాలకు విరుద్ధం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, ఫిర్యాదులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సయోధ్య ఫోరం, హైదరాబాద్‌లోని ఆర్బిట్రేషన్‌ కౌన్సిల్‌తోనూ ఒప్పందాలు చేసుకున్నాం... ఈ ఒప్పందాలతో రెరా పరిధిలోని అంశాలే కాకుండా ఇతర వివాదాలను పరిష్కరించేందుకూ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ముందస్తు(ప్రీలాంచ్‌) అమ్మకాలతో కొనుగోలుదారులు మోసపోతున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వాటి కట్టడి ఎలా?

జ: ముందస్తు విక్రయాలు చేయటం చట్ట విరుద్ధం. ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకోవాలంటే నగదు చెల్లించినట్లు ఇచ్చిన రసీదులో ఫ్లాట్‌, ప్లాట్‌ నంబరు నమోదు చేసి ఉండాలి. రసీదు లేనిపక్షంలో అగ్రిమెంట్‌లోనైనా ఆ వివరాలు నమోదు చేసుంటే వారిపై చర్యలు తీసుకోవచ్చు.

రెరా నంబరు లేకుండానే విక్రయిస్తున్న ప్రాజెక్ట్‌లను గుర్తించేది ఎలా?

జ:  రెరా అనుమతి ఇచ్చిన వెంటనే నంబరు కేటాయిస్తాం. ప్రకటనల్లో ఆ నంబరును ప్రస్ఫుటంగా నమోదు చేయాలి. రెరా నంబరు లేకుండా విక్రయించటం నేరం. అనుమతి లేకుండా విక్రయిస్తున్న బిల్డర్లు, లేఅవుట్‌దారులపై చర్యలు తీసుకుంటాం. అపరాధ రుసుము విధించటంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. టీఎస్‌రెరా వెబ్‌సైట్‌లో బిల్డర్ల పేరు లేదా ఆ సంస్థ పేరు నమోదు చేస్తే రెరా అనుమతి ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో రెరా నంబరుపై అనుమానం ఉన్న పక్షంలో నంబరును నమోదు చేస్తే.. దానికి సంబంధించిన సమగ్ర వివరాలు కనిపిస్తాయి. రెరా నంబరు నమోదు చేసినా వివరాలు రానిపక్షంలో అనుమానించాల్సి ఉంటుంది. రెరా నంబరు లేకుండా విక్రయ ప్రకటనలు జారీ చేసిన పక్షంలో ఆ ప్రకటన కాపీతో ఫిర్యాదు చేయవచ్చు. సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన పక్షంలో దాన్ని నిర్ధారించటం కష్టంగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నాం.

ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన ఎన్ని సంస్థలపై చర్యలు తీసుకున్నారు?

జ: నిర్మాణాలు, లే అవుట్లపై ఇప్పటి వరకు 1,698 ఫిర్యాదులు వచ్చాయి. 1,098 ఫిర్యాదుల్లో ఉత్తర్వులు జారీ చేశాం. వారికి రూ. 22 కోట్ల వరకు అపరాధ రుసుము విధించాం. అపరాధ రుసుము చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కొన్ని కేసుల వివరాలు కలెక్టర్లకు పంపాం. అక్కడ కూడా చెల్లించని పక్షంలో సివిల్‌ వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు.

నెలకు సగటున ఎన్ని ప్రాజెక్టులకు అనుమతి ఇస్తున్నారు? ఆలస్యం అవుతుందన్న ఫిర్యాదులు ఉన్నాయి?

రెరా పూర్తి స్థాయిలో పని చేయటం ప్రారంభించి ఏడు నెలల  అవుతోంది. అప్పటి వరకు పెండింగులో ఉన్న 351 లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాం. ప్రతి నెలా వందకుపైగా అనుమతులు ఇస్తున్నాం. సాధారణంగా ప్రాజెక్టుల దరఖాస్తు వచ్చిన నెల రోజుల్లో అనుమతి ఇవ్వాలన్నది నిబందన. ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా సాధ్యమైనంత త్వరితంగా అనుమతులు ఇస్తున్నాం. దరఖాస్తులు సక్రమంగా ఉన్నపక్షంలో పది రోజుల్లోనే అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులూ ఉన్నాయి.

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కారణాలు ఏమిటి?

జ: ఫిర్యాదుల పరిష్కారానికి రెరా ఛైర్మన్‌, సభ్యులకు నిర్దుష్టమైన గడువు చట్టంలో లేదు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫిర్యాదులు వచ్చాక ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి వాదనలు విన్న మీదట తీర్పు ఇస్తాం. కేసులను బట్టి నాలుగు నుంచి ఆరు హియరింగ్స్‌ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫిర్యాదుల నంబరు కేటాయించటంలో జాప్యం జరుగుతున్న పక్షంలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌, అడ్జుడికేటింగ్‌ అధికారులకు మాత్రమే ఫిర్యాదులను రెండు నెలల్లో పరిష్కరించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ప్ర: ఏ స్థాయి నిర్మాణాలకు రెరా నుంచి అనుమతి అవసరం?

జ: 500 చదరపు మీటర్లు లేదా 598 చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టాలనుకుంటే రెరా అనుమతి అనివార్యం. ఎనిమిది ఫ్లాట్లకు మించిన సంఖ్యలో నిర్మాణం చేస్తున్నా అనుమతి తీసుకోవాలి. విక్రయం కోసం చేపట్టే నిర్మాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవాలి. వ్యక్తిగత అవసరాలకు నిర్మించే వారు ఎంత విస్తీర్ణంలో నిర్మించుకున్నా రెరా అనుమతి అవసరం లేదు. కేవలం సంబంధిత స్థానిక సంస్థ నుంచి ప్లాన్‌ అనుమతి తీసుకుంటే సరిపోతుంది.

ప్ర: ఏయే అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చు?

జ: లిఖితపూర్వకంగా ఇచ్చిన గడువులోగా ఫ్లాట్లు, ప్లాట్లు ఇవ్వకపోయినా, విక్రయ సమయంలో ఇచ్చిన బ్రోచర్‌లో పేర్కొన్న ప్రకారం నిర్మాణం చేపట్టకపోయినా, ముందస్తు అనుమతి లేకుండా నిర్మాణంలో మార్పులు చేర్పులు చేసినా, రెరా అనుమతి లేకుండా నిర్మాణాలు, లేవుట్లు వేసి విక్రయిస్తున్నా ఫిర్యాదు చేయవచ్చు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ వచ్చిన నాటి నుంచి అయిదేళ్లలో నిర్మాణంలో లోపాలు గుర్తించి, వాటి పరిష్కారానికి నిర్మాణ సంస్థ అంగీకరించకపోయినా ఫిర్యాదు చేసి నష్ట పరిహారం లేక ఆయా పనులు చేసేలా ఉత్తర్వులు పొందవచ్చు.

సయోధ్య(కన్సీలియేషన్‌) ఫోరం ఏర్పాటు ఎందుకు?

జ: రెరా చట్టం పరిధిలో లేని అంశాలపైనా ఫిర్యాదులు వస్తుంటాయి. రెరా అంశాల వరకే మా బాధ్యత. ఇతర అంశాలపై పోరాటం కోసం కొనుగోలుదారులు, బిల్డర్లు న్యాయస్థానాల్లోనే ఇతర మార్గాలను అనుసరించాల్సి వస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ వివాదాలను కూడా ఆర్బిట్రేషన్‌ పరిధిలోని కేంద్రం తీసుకురావటంతో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా ఏర్పాటు చేశాం. క్రెడాయ్‌, నరెడ్కో, రియల్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులతో ప్యానల్‌ను ఏర్పాటు చేశాం. రెరా మినహా ఇతర అంశాలను ఈ ఫోరం పరిష్కరిస్తుంది. ఈ ఫోరం ఇచ్చే తీర్పులపై అప్పీలు చేసుకునే అధికారం కూడా ఉండదు. 14 ఫిర్యాదులను ఫోరంకు అప్పగిస్తే ఇప్పటికే మూడు కేసులను పరిష్కరించింది. కేసుల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇంటర్‌నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌తో కూడా ఒప్పందం చేసుకున్నాం. కేసుల పరిష్కారంలో సాంకేతిక అంశాల కోసం ఆస్కీ, ఇంజినీర్స్‌ ఇండియా అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నాం. న్యాయ సలహాల కోసం నల్సార్‌ విశ్వవిద్యాలయంతో త్వరలో ఒప్పందం చేసుకోనున్నాం.

ప్ర: ఫిర్యాదులు చేయటం ఎలా?

జ: ఫిర్యాదులు చేయాలనుకుంటే సంబంధిత ఆధారాలతో 90000 06301కు వాట్సప్‌ చేయవచ్చు.tsreraoffice@gmail.com  లేదా  secretarytsrera@gmail.com ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా సమాచారాన్ని ఇవ్వాలనుకున్న పక్షంలో రెరా కార్యాలయం ల్యాండ్‌ లైన్‌ 040 2939 4973 నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.

ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని