హెచ్‌ఎండీఏలోనూ.. టీడీఆర్‌ బ్యాంక్‌ వెబ్‌సైట్‌

నగర విస్తరణను పరుగు తీయించే దిశగా హెచ్‌ఎండీఏ మరో ముందడుగు వేసింది.

Published : 23 Mar 2024 00:45 IST

నగర విస్తరణ, అభివృద్ధి పనుల వేగవంతానికి అడుగులు
ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న విధానం
ఈనాడు, హైదరాబాద్‌

గర విస్తరణను పరుగు తీయించే దిశగా హెచ్‌ఎండీఏ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే లేఅవుట్ల అభివృద్ధి, చెరువుల సంరక్షణ, పట్టణ అటవీ పార్కుల పెంపకం, రేడియల్‌ రోడ్లు, లింకు రోడ్లు, తదితర కార్యక్రమాలను హెచ్‌ఎండీఏ చేపడుతోంది. వీటికి అవసరమైన నిధుల కోసం టీడీఆర్‌(ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌)ను పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో మాదిరి.. హెచ్‌ఎండీఏలో డిజిటల్‌ టీడీఆర్‌ బ్యాంకును ఏర్పాటు చేసింది. భూసేకరణకు నిధుల భారాన్ని తగ్గించే టీడీఆర్‌ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచడం, క్రయవిక్రయాలకు డిజిటల్‌ రూపం ఇవ్వడం వల్ల మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతుందని ప్రణాళిక విభాగం సంతోషం వ్యక్తం చేస్తోంది.

టీడీఆర్‌ అంటే..

రోడ్ల విస్తరణ, పైవంతెనలు, చెరువుల సుందరీకరణ, నాలాల విస్తరణ, తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అందుకు రూ.వేల కోట్ల నగదును పరిహారంగా ఇవ్వాలి. ఆ మేర నిధులు లేకపోతే.. తలపెట్టిన, ప్రతిపాదిత పనులన్నీ పడకేస్తాయి. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం టీడీఆర్‌ విధానాన్ని తీసుకొచ్చింది. నగదుకు బదులు కోల్పోయిన భూమికి రెట్టింపు లేదా నాలుగు రెట్ల భూమిని పరిహారంగా ఇవ్వాలనేది ఉద్దేశం. గ్రామ కంఠం భూమికి రెట్టింపు(200శాతం) మొత్తంలో, రిజిస్టరు భూమికి నాలుగింతల(400శాతం) భూమిని పరిహారంగా ఇస్తారు. ఆ భూమి భౌతికంగా ఉండదు. కేవలం సర్టిఫికెట్‌ రూపంలో ఉంటుంది.

గజాల చొప్పున అమ్ముకోవచ్చు..

ఇలా వచ్చిన సర్టిఫికెట్‌ను భూ యజమాని గజాల చొప్పున అమ్ముకోవచ్చు. మార్కెట్లో డిమాండ్‌, సప్లయి సూత్రం ఆధారంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక్కడ టీడీఆర్‌ను ఎవరు కొనుగోలు చేస్తారంటే.. చట్టం ప్రకారం రెండు అంతస్తులు నిర్మించుకునే భూమిలో.. మూడో అంతస్తును టీడీఆర్‌తో కట్టుకోవచ్చు. ఐదు అంతస్తులకు మించిన భవనంపై రెండు అంతస్తులను అదనంగా నిర్మించుకోవచ్చు. గతంలో.. ఈ టీడీఆర్‌ సర్టిఫికెట్లు కాగితాల రూపంలో ఉండేవి. పారదర్శకత పెంపు, టీడీఆర్‌ ఉన్న వ్యక్తులను మార్కెట్‌తో అనుసంధానం చేసేందుకు జీహెచ్‌ఎంసీ 2019లో డిజిటల్‌ టీడీఆర్‌ సేవలను ప్రవేశపెట్టింది. టీడీఆర్‌ యజమానుల పేర్లు, వారి దగ్గర ఉన్న టీడీఆర్‌ విస్తీర్ణంతో ‘టీడీఆర్‌ బ్యాంక్‌’ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్నుంచి.. టీడీఆర్‌ అవసరమున్న వ్యక్తులు వెబ్‌సైట్‌లో చూసి యజమానులను నేరుగా సంప్రదించగలుగుతున్నారు. ఈ రకంగా.. టీడీఆర్‌ ప్రభుత్వానికి, ప్రజలకు ఉభయతారకంగా ఉపయోగపడుతోంది. సాధారణంగా.. టీడీఆర్‌లో భూ విస్తీర్ణం గజాల్లో ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్‌ ధరను ప్రమాణికంగా తీసుకుని.. టీడీఆర్‌ క్రయవిక్రయాలు జరుగుతాయి.

అభివృద్ధికి ఊతం..

జీహెచ్‌ఎంసీ చాలాకాలంగా టీడీఆర్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తోంది. ఇప్పటివరకు రూ.10వేల కోట్ల విలువైన సర్టిఫికెట్లను ఇచ్చింది. అంటే.. రూ.10వేల కోట్ల భూసేకరణ భారాన్ని జీహెచ్‌ఎంసీ టీడీఆర్‌ సర్టిఫికెట్ల రూపంలో భరించగలిగింది. లింకు రోడ్లు, పైవంతెనలు, రోడ్ల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ, చెరువుల సుందరీకరణ పనులు వేగంగా పూర్తయ్యేందుకు టీడీఆర్‌ ఎంతగానో ఉపయోగపడింది. టీడీఆర్‌ లేకపోతే.. రూ.10 వేల కోట్ల నిధులను నష్టపరిహారంగా ఇవ్వాల్సి ఉండేదని, నిధుల కొరత ఏర్పడి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయేవని అధికారులు చెబుతున్నారు. బల్దియా ఇచ్చిన టీడీఆర్‌ సర్టిఫికెట్ల వివరాలన్నీ టీడీఆర్‌ బ్యాంక్‌ అనే వెబ్‌సైట్‌లో ఉంటాయి. అందులోనే కొనాలనుకున్న వారు యజమానులను సంప్రదిస్తారు. హెచ్‌ఎండీఏ కొంతకాలంగా టీడీఆర్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నప్పటికీ.. ప్రక్రియ కాగితాల రూపంలో జరుగుతోంది. పారదర్శకత కోసం.. తాజాగా హెచ్‌ఎండీఏ కూడా టీడీఆర్‌ బ్యాంక్‌ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. త్వరలో వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

హెచ్‌ఎండీఏ పరిధి వరకు..

టీడీఆర్‌ విధానం రాష్ట్రమంతటా అమలవుతోంది. గ్రేటర్‌లో సేకరించే భూమికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో చేపట్టే భూసేకరణకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగాలు టీడీఆర్‌ను ఇస్తాయి. ఆయా సర్టిఫికెట్లను రెండు సంస్థల పరిధిలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అదనపు అంతస్తులకేగాక.. నిర్మాణ అనుమతి తీసుకోకుండా.. నిబంధనల ప్రకారం నిర్మించిన భవనానికి అనుమతి తీసుకునేటప్పుడు పడే జరిమానాను, నివాస యోగ్యపత్రాల జారీకి చెల్లించాల్సిన రుసుమును టీడీఆర్‌తో చెల్లించవచ్చు. హెచ్‌ఎండీఏ అవతల.. వేర్వేరు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు కూడా టీడీఆర్‌ ఇస్తాయని, వాటిని ఆయా పురపాలికల పరిధిలోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని