మౌలికంతో రియల్‌కు దన్ను

కాంగ్రెస్‌ ప్రభుత్వం నగరంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఎక్స్‌ప్రెస్‌వే, డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌, మెట్రో విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి, మూసీ సుందరీకరణ చేపట్టబోతుంది.

Updated : 23 Mar 2024 00:58 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం నగరంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఎక్స్‌ప్రెస్‌వే, డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌, మెట్రో విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి, మూసీ సుందరీకరణ చేపట్టబోతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు ఇంధనంగా పనిచేయనున్నాయి. సాధారణంగా మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లు మొదలెట్టినప్పటి నుంచి పూర్తయి అందుబాటులో వచ్చేనాటికి 3-5 ఏళ్ల సమయం పడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రాజెక్ట్‌లు వచ్చే మార్గాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ బాగా వృద్ధి చెందుతుంది అనడానికి పలు ఉదాహరణలున్నాయి. హర్యానాలో 19 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌వేను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ట్రాఫిక్‌ సమస్యలు తీరి ప్రయాణం మెరుగు కానుంది. నివాసాలు కొత్త ప్రాంతాలకు విస్తరించనున్నాయి. మూడేళ్ల క్రితానికి.. ఇప్పటికీ ఆ ప్రాంతంలో గృహాల మూలధన విలువలు ఏమేరకు వృద్ధి చెందాయి అనేదానిపై అధ్యయనం చేశారు.

విభాగాల వారీగా చూస్తే..

  • ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రభావం చుట్టుపక్కల స్థిరాస్తులపై చాలా ఎక్కువే. మంచి వృద్ధిని కనబరిచాయి. ఇళ్లలోనూ విభాగాల వారీ విలువల్లోనూ హెచ్చుతగ్గులను గమనించవచ్చు.
  • విలాసవంతమైన ఇళ్లలో 2021 నుంచి 2022కు వచ్చేసరికి 12 శాతం వృద్ధి నమోదైంది. 2023 ఆఖరుకు వచ్చేసరికి 26 శాతం పెరిగిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది.
  • ప్రీమియం విభాగం ఇళ్లలో 2021లో 7 శాతం విలువ పెరిగితే 2022లో 19 శాతం, 2023లో 34 శాతానికి పెరిగింది.
  • మిడ్‌ విభాగం గృహాల్లో 2022లో 10 శాతం పెరిగితే 2023లో 12 శాతం వృద్ధి చెందింది.

ముందుచూపు ఉంటే..

  • ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లు చేపట్టిన ప్రతిచోట ఉంటాయి. స్థానిక పరిస్థితులనుబట్టి కొన్నిచోట్ల ఎక్కువగానూ పెరగవచ్చు. శివార్లలో అయితే స్థలాలు, విల్లాలు నగరంలో అయితే ఇళ్లు, అపార్ట్‌మెంట్ల విలువలు పెరుగుతాయి.
  • నగరంలో బాహ్యవలయ రహదారి సమయంలో ముందుచూపుతో కొనుగోలు చేసిన వారు అధిక ప్రయోజనం పొందారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు, మెట్రో కారిడార్‌ చుట్టుపక్కల ముందే కొన్నవారి స్థిరాస్తుల్లో వృద్ధి కన్పించింది.
  • రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనూ అంతకంటే ముందే భూములు కొన్నవారు లాభపడ్డారు. జిల్లా ఏర్పడిన ప్రారంభంలో కొన్నవారి స్థిరాస్తుల ధరలు ఇప్పటికే బాగానే పెరిగాయి.
  • ప్రాంతీయ వలయ రహదారి వచ్చే ప్రాంతాల్లోనూ పెట్టుబడులతో మంచి రాబడులను అందుకోవచ్చు. ఇప్పటికే అక్కడ ధరలు పెరిగాయి. ప్రాజెక్ట్‌ సాకారమైతే మున్ముందు మరింత పెరుగుతాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రంగానే ప్రస్తుతం పెద్దఎత్తున వెంచర్లున్నాయి.
  • పలుచోట్ల జాతీయ రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అక్కడ కూడా ధరలు పెరిగాయి. ఇలాంటి మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లు వచ్చేచోట ముందుచూపుతో వ్యవహరిస్తే ప్రయోజనం పొందవచ్చు.

ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని