ఇళ్లు కట్టడం నేర్పిస్తారిక్కడ

నిర్మాణ రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతుంది.. మరోవైపు నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వేధిస్తోంది. ఈ రంగంలో వివిధ విభాగాల్లో యువతకు శిక్షణనిస్తూ మెండుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌).

Updated : 06 Apr 2024 03:00 IST

ఇంజినీర్లు, కార్మికుల్లో  నైపుణ్యాల పెంపునకు న్యాక్‌లో శిక్షణ  

మాదాపూర్‌, న్యూస్‌టుడే: నిర్మాణ రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతుంది.. మరోవైపు నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వేధిస్తోంది. ఈ రంగంలో వివిధ విభాగాల్లో యువతకు శిక్షణనిస్తూ మెండుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌). అధునాతన నిర్మాణాలు పటిష్ఠంగా రూపుదిద్దుకోవాలంటే అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్‌ బెండింగ్‌, పెయింటర్లు ఇలా ఎంతో మంది అవసరం ఉంటుంది. అలాంటి వారిని నిర్మాణరంగానికి అందించేందుకు న్యాక్‌ అవతరించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణ రంగంలో అనునిత్యం మార్పులు వస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులు ప్రవేశపెడుతూ శిక్షణ కార్యక్రమాలు అందిస్తోంది.

ముఖ్యమంత్రి అధ్యక్షుడు..

నిర్మాణరంగానికి సుశిక్షతులైన ఇంజినీర్లు, కార్మికులను అందిస్తూ న్యాక్‌ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. 1998లో అప్పటి ప్రభుత్వం న్యాక్‌ ఏర్పాటు చేసింది. మాదాపూర్‌లో అధునాతన శైలిలో వెలిసిన ఈ సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇక సంస్థల పాలకమండలిలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, కార్యదర్శితోపాటు వివిధ విభాగాధిపతులు, వర్సిటీ ఉపకులపతి సభ్యులుగా వ్యవహరిస్తారు.

ప్రత్యేక ప్రయోగశాలలు.. : న్యాక్‌లో ఆయా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. కన్‌స్ట్రక్షన్‌ టెక్నీషియన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హౌజింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, కాంట్రాక్టర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, ట్రాన్స్‌పోర్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రైనింగ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ అండ్‌ మెథడ్స్‌ రీసెర్చ్‌ ఇలా వేర్వేరు విభాగాలు ఆయా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

 • శిక్షణ అందించేందుకు వీలుగా న్యాక్‌ క్యాంపస్‌లో ప్రత్యేక ల్యాబ్స్‌ ఉన్నాయి. డ్రైవాల్‌ అండ్‌ ఫాల్‌ సీలింగ్‌ ల్యాబ్‌, ప్లంబింగ్‌ ల్యాబ్‌, ఎలక్ట్రికల్‌ ట్రైనింగ్‌ ల్యాబ్‌, సోలార్‌ ప్యానెల్‌ ఇన్‌స్టలేషన్‌ ల్యాబ్‌, ఫర్నిచర్‌ ఫిట్టింగ్‌, అసెంబుల్‌ ట్రైనింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ మెటీరియల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌, వెల్డింగ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. వీటితోపాటు శిక్షణ తీసుకుంటున్న వారికి భోజన, నివాస వసతి కల్పించేందుకు ప్రత్యేక క్యాంటీన్‌, హాస్టల్‌ భవనం ఉంది.

ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం..

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫినిషింగ్‌ స్కూల్‌ ప్రోగ్రాం పేరిట శిక్షణ అందిస్తున్నారు. బీటెక్‌(సివిల్‌) పూర్తి చేసినవారు కోర్సులో చేరేందుకు అర్హులు. డిప్లొమో చేసిన వారికి కన్‌స్ట్రక్షన్‌ సేఫ్టీ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు.

 • బీఈ, బీటెక్‌ సివిల్‌, బీఆర్క్‌, ఎంటెక్‌ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పీజీ డిప్లొమో కోర్సులను అందిస్తున్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమో ఇన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమో ఇన్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులున్నాయి. నిర్దేశించిన ఫీజు చెల్లించి కోర్సులో ప్రవేశం పొందవచ్చు.
 • ఆసక్తి గల అభ్యర్థులు 73961 29562, 90325 04507, 99129 71967, 96762 17118, 95056 31765 నంబర్లకు ఫోన్‌ చేసి లేదా ఎన్‌ఏసీ.ఈడీయూ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత శిక్షణ కోర్సులు ...

తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని ఐజీఎంఎం, ఎస్సీ కార్పొరేషన్‌ సహకారంతో నిరుద్యోగ యువత కోసం పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18-35 ఏళ్లలోపు వారికి ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తూ 3 నెలలపాటు ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

కోర్సులు- అర్హతలు

 • స్టోర్‌ సూపర్‌వైజర్‌- డిగ్రీ ఉత్తీర్ణత
 • స్ట్రక్చర్‌ సూపర్‌వైజర్‌ - ఇంటర్‌ ఉత్తీర్ణత
 • లాండ్‌ సర్వేయర్‌-ఇంటర్‌ ఉత్తీర్ణత
 • ఎలక్ట్రికల్‌, హౌజ్‌ వైరింగ్‌- ఎస్సెస్సీ ఉత్తీర్ణత
 • ప్లంబింగ్‌ అండ్‌ శానిటేషన్‌ -5వ తరగతి ఉత్తీర్ణత
 • డ్రైవాల్‌ అండ్‌ ఫాల్‌ సీలింగ్‌-5వ తరగతి
 • వెల్డింగ్‌- 5వ తరగతి  ః పెయింటింగ్‌, డెకొరేషన్‌- 5వ తరగతి
 •  డ్రైవాల్‌ అండ్‌ ఫాల్‌ సీలింగ్‌-5వ తరగతి
 •  బ్యాక్‌ హోలోడర్‌ ఆపరేటర్‌(జేసీబీ) 5వ తరగతి

2 లక్షల మందికి శిక్షణ: శాంతిశ్రీ న్యాక్‌ డైరెక్టర్‌

పదేళ్ల కాలంలో న్యాక్‌లో రెండు లక్షల మందికి శిక్షణ అందించాం. ఇందులో లక్షా 50 వేల మందికి పేరొందిన నిర్మాణరంగ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాం. నిర్మాణరంగానికి సుశిక్షుతులైన కార్మికుల అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ప్లంబింగ్‌, ఎలక్ట్రీషియన్‌, ల్యాండ్‌ సర్వేయర్లకు మంచి డిమాండ్‌ ఉంది. వేర్వేరు రాష్ట్రాలు, దేశాల నుంచి న్యాక్‌లో శిక్షణ కోసం వస్తున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థల సహకారం, ప్రైవేటు సంస్థల సౌజన్యంతో ఉచిత కోర్సులు నిర్వహిస్తున్నాం. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారికి క్షేత్రస్థాయి అనుభవం కలిగిస్తూ వారి నైపుణ్యం పెంపొందించే దిశగా పీజీ డిప్లొమో కోర్సులు నిర్వహిస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని