దశాబ్దంలో ఎలా పెరిగిందంటే

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ గడిచిన పదేళ్లలో పలు ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. వాటన్నింటినీ దాటుకుని గణనీయమైన పురోగతిని సాధించింది.

Published : 13 Apr 2024 01:36 IST

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ గడిచిన పదేళ్లలో పలు ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. వాటన్నింటినీ దాటుకుని గణనీయమైన పురోగతిని సాధించింది. అందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే క్రమంలో కొత్త పుంతలు తొక్కింది. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, జీడీపీలో తోడ్పాటు అందించింది. స్థిరాస్తి రంగం పరిమాణమూ గణనీయంగా పెరిగింది. ‘2014-2024 వరకు రియల్‌ ఎస్టేట్‌- మోదీ ప్రభావం’ పేరుతో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌(నరెడ్కో) రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌తో కలిసి నివేదికను రూపొందించింది.  

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రాముఖ్యత, తోడ్పాటును తక్కువ అంచనా వేయలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో రియల్‌ ఎస్టేట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా గృహ నిర్మాణం చేపట్టడం, ఆస్తుల క్రయ విక్రయాలతో సంపదకు మూలస్తంభంగా ఉంది. పదేళ్ల కాలంలో కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకొచ్చిన రెరాతో ప్రాజెక్ట్‌ల్లో పారదర్శకత పెరిగిందని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. ఫలితంగా కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగి ఇళ్ల నిర్మాణాల సంఖ్య సైతం పదేళ్లలో గణనీయంగా వృద్ధి చెందింది.

గృహ నిర్మాణం రెట్టింపైంది

దేశంలోని ప్రధానమైన ఏడు నగరాల్లోనే వ్యవస్థీకృత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కార్యక్రమాలు అధికం. ఈ నగరాలన్నింటిలో కలిపి 2018లో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే.. 2023 నాటికి 4.35 లక్షలకు చేరుకుంది. వార్షిక వృద్ధి 8 శాతంగా ఉంది.

సగటు ధరల పెరుగుదల చూస్తే

గత పదేళ్లలో ఏడు నగరాల్లోని స్థిరాస్తుల ధరల్లో పెరుగుదల కన్పించింది. 2014లో సగటు చదరపు అడుగు ధర రూ.5442 ఉంటే... 2020లో రూ.5,600తో నిలకడగా ఉన్నాయి. కొవిడ్‌ తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2022 నాటికి రూ.6,150కి చేరితే.. 2023 నాటికి రూ.7,080కి పెరిగింది.  కొనుగోలు చేసిన వారి స్థిరాస్తుల మూల ధన విలువలు భారీగా పెరిగాయి.

కొనుగోలు శక్తి పెరిగింది

ఇల్లు కొనుగోలు చేసేవారిలో అత్యధికం గృహరుణంతోనే. రుణం తీసుకుని కొనుగోలు చేసే సామర్థ్యం పదేళ్లలో మెరుగైంది. వచ్చే ఆదాయం, గృహరుణానికి చెల్లించే ఈఎంఐని బట్టి అఫర్డబులిటీ రేషియోని గణిస్తారు. 2014లో ఈ నిష్పత్తి 50 శాతంగా ఉండేది. అంటే ఆ రోజుల్లో గృహరుణంతో ఇల్లు కొనుగోలు చేయాలంటే ఆదాయంలో 50 శాతం ఈఎంఐకి సిద్ధపడితే కొనగల్గేవారు. ఇప్పుడిది 36 శాతానికి తగ్గింది. కొవిడ్‌ అనంతరం 2021లో అత్యల్పంగా 21 శాతానికి దిగి వచ్చినా.. వడ్డీరేట్ల పెంపుతో మళ్లీ స్వల్పంగా పెరిగింది.

ఇన్వెంటరీ తగ్గింది

గత పదేళ్లలో ఇన్వెంటరీ 24 నెలల నుంచి మధ్యలో 55 నెలలకు పెరిగినా.. 2023 నాటికి 15 నెలలకు తగ్గింది. ఒక ప్రాజెక్ట్‌ అనుమతులు వచ్చిన తర్వాత నుంచి ప్రాజెక్ట్‌ పూర్తి చేసి ఇళ్ల విక్రయానికి పట్టే కాలాన్ని ఇన్వెంటరీగా పరిగణనలోకి తీసుకోవాలని బిల్డర్లు చెబుతున్నారు.

2030 నాటికి ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్ల స్థాయికి

డాక్టర్‌ హీరానందాని నిరంజన్‌, ఛైర్మన్‌, నరెడ్కో

గత దశాబ్దంలో భారత ప్రభుత్వ సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా.. వరసగా మూడేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్‌ నిలబెట్టుకుంది. భారత్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2021లో 200 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల నుంచి 2030 నాటికి ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్ల మార్కెట్‌ స్థాయికి చేరుకుంటుందని అంచనా.


మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లతో

జి.హరిబాబు, అధ్యక్షుడు, నరెడ్కో

దశాబ్దకాలంలో భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం చెప్పుకోతగ్గ పరిణామాన్ని చవి చూసింది. వృత్తి నైపుణ్యం, పారదర్శకత పెరిగింది. రెరా, జీఎస్‌టీ తీసుకొచ్చి పీఎంఏవై పథకం ప్రవేశపెట్టి ఈ రంగం కీలక మార్పులకు బాటలు వేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లైన జాతీయ రహదారుల విస్తరణ, మెట్రో నెట్‌వర్క్‌తో ప్రాధాన్యత ఇవ్వడంతో అనుసంధానం పెరిగింది. తద్వారా స్థిరాస్తుల విలువలపైన స్పష్టమైన ప్రభావాన్ని మెట్రో నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కన్పించింది.


1000 బిలియన్‌ డాలర్లు 2030 నాటికి దేశంలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అంచనా
66 మిలియన్‌ డాలర్లు 2024 అర్ధ వార్షిక సంవత్సరం నాటికి స్థిరాస్తి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
13 శాతం జీడీపీలో 2025కి నాటికి స్థిరాస్తి మార్కెట్‌ తోడ్పాటు
71 మిలియన్‌ 2023 నాటికి ఉపాధి కల్పన   250 పరిశ్రమలు రియల్‌ ఎస్టేట్‌పై ఆధారపడినవి

ఇతరుల వాటానే అధికం

గత పదేళ్లలో లిస్టెడ్‌ డెవలపర్స్‌ వాటా పదేళ్లలో 6 నుంచి 14 శాతానికి పెరిగింది. లిస్టెడ్‌ కాని ప్రముఖ డెవలపర్ల వాటా 11 నుంచి 20 శాతానికి పెరిగింది. ఇతర బిల్డర్లు పదేళ్ల క్రితం 83 శాతం నిర్మాణాలు చేపడితే ఇప్పుడు 66 శాతానికి తగ్గింది. అయినప్పటికీ వీరి వాటానే సింహభాగం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని