ఖాళీ స్థలాలపై పన్ను కట్టాలా?

ఆస్తిపన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను(వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) కూడా అందరూ తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఏడాదికోసారి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో.. వీఎల్‌టీ గురించి చాలా మందికి తెలియదు.

Updated : 16 Apr 2024 21:23 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకూ వీఎల్‌టీ వర్తింపు
నిర్మాణ అనుమతి సమయంలో వసూలు చేస్తోన్న అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌

స్తిపన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను(వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) కూడా అందరూ తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఏడాదికోసారి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో.. వీఎల్‌టీ గురించి చాలా మందికి తెలియదు. కానీ.. ఇంటి స్థలం లేదా ఖాళీ స్థలం కలిగిన ప్రతి వ్యక్తి వీఎల్‌టీని తప్పించుకోలేరు. సదరు భూమిలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా స్థలాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌(లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీము) కింద క్రమబద్ధీకరించుకునే సమయంలో.. వీఎల్‌టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనేగాక, వెలుపలి ప్రాంతాలకూ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రాజధానిలో

  • జీహెచ్‌ఎంసీ చట్టంలో వీఎల్‌టీ రెండు రకాలుగా ఉంటుంది. సెక్షన్‌ 199 ప్రకారం.. వ్యవసాయానికి ఉపయోగించకుండా పూర్తిస్థాయిలో ఖాళీగా ఉన్న భూములకు, మార్కెట్‌ విలువలో 0.05శాతం వీఎల్‌టీ విధిస్తారు. సెక్షన్‌ 212 ప్రకారం.. నిర్మాణానికి అనుమతించదగిన స్థలానికి మార్కెట్‌ విలువలో 0.5శాతం వీఎల్‌టీ చెల్లించాలి.
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 1, 2022 నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ధరణి ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. అప్పట్నుంచి ఆస్తిపన్ను మదింపు, పీటీఐఎన్‌ నంబరు, ఇంటి నంబరు జారీ అక్కడే జరుగుతోంది. దాంతోపాటు ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌ సమయంలో వీఎల్‌టీకి వీటీఐఎన్‌ నంబరు, ఇంటి నంబరు జారీ అవుతున్నాయి. అలా వీటీఐఎన్‌ పొందిన యజమానులు.. ఏటా వారి వీఎల్‌టీని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ లేదా మీసేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాల్లో చెల్లించవచ్చు. దాదాపు 30శాతం మంది యజమానులు క్రమం తప్పకుండా జీహెచ్‌ఎంసీకి వీఎల్‌టీ చెల్లిస్తున్నారు.
  • ఏప్రిల్‌ 1, 2022కు ముందు రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థలాలకు సంబంధిత సర్కిల్‌ ఉపకమిషనర్‌ ఆధ్వర్యంలో వీఎల్‌టీ విధిస్తారు. సదరు యజమాని స్వతహాగా దరఖాస్తు చేసుకున్నప్పుడు.. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి వీఎల్‌టీ నంబరు జనరేట్‌ చేసి, గరిష్ఠంగా మూడేళ్ల పన్ను విధిస్తారు.
  • ఏప్రిల్‌ 1, 2022 తేదీ తర్వాత రిజిస్ట్రేషన్‌ జరిగిన స్థలాలకు అప్పటికే వీఎల్‌టీ ఉంటుంది. అలాంటి భూమిలో నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే.. వీఎల్‌టీ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది.

ముందు కొన్న వాటికి

  • ఏప్రిల్‌ 1, 2022 తేదీకి ముందు రిజిస్ట్రేషన్‌ జరిగి, వీఎల్‌టీ పరిధిలోని ఇళ్ల స్థలాల్లో నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే.. అనుమతి రుసుముతోపాటు ఏడాది వీఎల్‌టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
  • సబ్‌రిజిస్ట్రార్‌ ఆమోదించిన కొనుగోలు ఒప్పందపత్రం(సేల్‌ డీడ్‌) గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన లింకు డాక్యుమెంట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణ పత్రం లేదా ఇతర, ఈసీ, మార్కెట్‌ విలువ సర్టిఫికెట్‌లతో బల్దియా సర్కిల్‌ ఆఫీసును సంప్రదిస్తే.. సంబంధిత బిల్‌ కలెక్టర్‌ లేదా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆయా పత్రాలను పరిశీలించి దరఖాస్తును ఉపకమిషనర్‌కు పంపిస్తారు.
  • తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019లోని 94(ఏ) సెక్షన్‌ ప్రకారం.. నిర్మాణాలకు అనువైన లేదా నిర్మాణాలు అనుమతించదగిన స్థలాలపై వీఎల్‌టీ ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆమేర ఖాళీ స్థలాలకు అనుమతి ఇచ్చే సమయంలో పన్ను వసూలు చేస్తారు.

కొనుగోలుదారుకు భారం

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్‌ విలువ తక్కువగా ఉండేది. గడిచిన తొమ్మిదేళ్లలో ధరలు మూడుసార్లు పెరిగాయి. రెట్టింపుకన్నా అధికమయ్యాయి. దాంతో..పట్టణాలు, నగరాల్లో వీఎల్టీ విలువ భారీగా పెరిగింది. నిర్మాణ అనుమతి సమయంలో.. మిగిలిన ఛార్జీలతోపాటు వీఎల్‌టీని విధిస్తుండటంతో యజమానులపై ఆర్థికభారం పడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని