రెరాతో ఎన్ని ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి?

స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్రం తీసుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ యాక్ట్‌(రెరా) తర్వాత పరిస్థితులు ఏమైనా మారాయా? సత్వరం వివాదాలు పరిష్కారం అవుతున్నాయా?

Published : 13 Apr 2024 01:48 IST

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్రం తీసుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ యాక్ట్‌(రెరా) తర్వాత పరిస్థితులు ఏమైనా మారాయా? సత్వరం వివాదాలు పరిష్కారం అవుతున్నాయా? వేర్వేరు రాష్ట్రాల్లో రెరా అమలు తీరు ఎలా ఉంది? అనేదానిపై నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ రాష్ట్రాల వారీగా ఒక నివేదికను రూపొందించింది.

దేశంలోని 21 రాష్ట్రాల్లోని రెరా అధారిటీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 2016 నుంచి ఫిబ్రవరి 2024 నాటికి 1,21,553 ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదయ్యాయి. 86,262 మంది ఏజెంట్లు రిజిస్టర్‌ అయ్యారు. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రాగా... 1,20,605 ఫిర్యాదులను పరిష్కరించారు.

మహారాష్ట్ర ఆదర్శం... : దేశంలోనే రెరా అమలులో మహారాష్ట్ర ఆదర్శంగా నిలుస్తోంది. 21 రాష్ట్రాలు మొత్తం కలిపి రిజిస్టర్‌ అయిన ప్రాజెక్టుల్లో మూడోవంతు ఒక్క మహారాష్ట్రలో నమోదు కావడం విశేషం. ఇక్కడ ఇప్పటివరకు 45,128 ప్రాజెక్ట్‌లో రెరాలో రిజిస్టర్‌ అయ్యాయి. 16,806 సమస్యలను పరిష్కరించినట్లు నివేదిక తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..  : తెలంగాణలో రెరా ఆధారిటీ ఆలస్యంగా ఏర్పాటైంది. ఇక్కడ ఇప్పటివరకు 8045 ప్రాజెక్ట్‌లు నమోయ్యాయి. 1092 ఫిర్యాదులను పరిష్కరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ః ఆంధ్రప్రదేశ్‌లో 4617 ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదయ్యాయి. 163 ఫిర్యాదులను పరిష్కరించారు.

యూపీలో ఫిర్యాదులు ఎక్కువ

ప్రాజెక్ట్‌ల నమోదుతో పోలిస్తే అత్యధిక ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చాయి. ఇక్కడ 3,459 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్టర్‌ చేస్తే... వీటిపై వచ్చిన ఫిర్యాదుల్లో 44,602 ఇప్పటికే పరిష్కరించినట్లు నివేదిక చెబుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని