వచ్చే పదేళ్లలో రియల్‌ ప్రయాణమిలా

రియల్‌ ఎస్టేట్‌ రంగం గడిచిన దశాబ్దంలో కొవిడ్‌ వంటి విపత్తులను దాటుకుని గణనీయమైన పురోగతి సాధించిన విషయం తెలిసిందే. పదేళ్లలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకున్నారు.

Updated : 20 Apr 2024 09:00 IST

రియల్‌ ఎస్టేట్‌ రంగం గడిచిన దశాబ్దంలో కొవిడ్‌ వంటి విపత్తులను దాటుకుని గణనీయమైన పురోగతి సాధించిన విషయం తెలిసిందే. పదేళ్లలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం స్థిరాస్తులను కొనుగోలు చేస్తే.. వాటి విలువలు పెరగడంతో రాబడులను స్వీకరించారు. కొంతమంది కొనేలోపే ధరల పెరుగుదలతో వాయిదా వేసుకున్నారు. అవకాశం చేజారిందని వాపోతున్నారు. రాబోయే దశాబ్దం ఎలా ఉండబోతుంది? మార్కెట్‌ పయనం ఎలా సాగనుంది?

ఈనాడు, హైదరాబాద్‌: అద్దె ఇంట్లో ఉంటున్నవాళ్లు సొంతిల్లు కొనాలని.. ఇప్పటికే సొంతిల్లు ఉంటే మరింత విశాలమైన ఫ్లాట్‌, విల్లాలోకి మారాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణానికి వచ్చే పదేళ్లలోనూ మంచి డిమాండ్‌ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల విలాసవంతమైన నివాసాలకు అధిక డిమాండ్‌ ఉంది. మున్ముందు ఇది కొనసాగడంతోపాటు అన్ని విభాగాల గృహ నిర్మాణాల్లో డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నారు. 2024-34 వరకు దేశంలో 7.8 కోట్ల ఇళ్ల అవసరం ఉందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా-సీఐఐ నివేదిక వెల్లడించింది.

పట్టణీకరణతో...  

వచ్చే పదేళ్లలో దేశవ్యాప్తంగా పట్టణ జనాభా 42.5 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా. తెలంగాణలో 2028 నాటికి పట్టణాల్లో నివసించే జనాభా 50 శాతానికి చేరుకుంటుంది. 2034కి అంటే సగానికంటే ఎక్కువే. అందులోనూ హైదరాబాద్‌ చుట్టుపక్కలకే ఎక్కువ వలసలు రానున్నాయి. ఓఆర్‌ఆర్‌ లోపల పూర్తిగా జనావాసాలతో నిండిపోయి... ప్రాంతీయ వలయ రహదారి వైపు విస్తరించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడే విల్లా ప్రాజెక్ట్‌లు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్పులు, విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది.

ఆదాయాలు పెరుగుతుండటంతో..

సిటీకి వలసలు ప్రధానంగా మెరుగైన ఉపాధి, అధిక ఆదాయం కోసమే. ప్రస్తుతం కుటుంబ ఆదాయపరంగా దేశంలో అధిక ఆదాయం వర్గాలు 8 మిలియన్లు ఉంటే.. 2030 నాటికి 29 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఎగువ మధ్యతరగతి వర్గం సైతం 61 మిలియన్ల నుంచి 168 మిలియన్లకు పెరగనుంది. మొత్తం జనాభాలో వీరి వాటానే 44 శాతం ఉండనుంది. ఆదాయాలు పెరిగేకొద్దీ వ్యవస్థీకృత మార్కెట్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. దిగువ మధ్య వర్గాలు 97 మిలియన్ల నుంచి 132 మిలియన్లకు పెరగనుంది. వీరి వాటా 34 శాతంగా ఉంది. ఈ మూడు వర్గాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం ఉండదు. ప్రత్యేకించి దిగువ మధ్య తరగతి వర్గం పైసా పైసా కూడబెట్టుకుని స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడుతుంటాయి. ఈ వర్గాలకు బడ్జెట్‌ ధరల్లో నివాసాలకు డిమాండ్‌ ఉండనుంది.

సిటీలో చూస్తే..

బడా నిర్మాణ సంస్థలు ఇప్పుడు కడుతున్న నిర్మాణాలను చూస్తే అత్యధిక శాతం అధిక ఆదాయం కలిగిన వారిని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టులే ఉన్నాయి. సరసమైన ధరల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ విభాగంలో ఇళ్లకు డిమాండ్‌ అధికంగా ఉంది. సరసమైన ధరల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వపరంగా సమగ్ర విధానం అవసరమని నిర్మాణ సంఘాలు పేర్కొంటున్నాయి.

పెట్టుబడుల పరంగా..

ఇప్పటివరకు స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు, కార్యాలయాలు, మాల్స్‌లో స్పేస్‌ను పెట్టుబడి కోణంలో కొనుగోలు చేస్తున్న వారు.. మున్ముందు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ట్రస్ట్‌(రీట్స్‌)లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థిరాస్తుల్లో మదుపు చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. తక్కువ మొత్తంతోనూ వాణిజ్య స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు రీట్స్‌ అవకాశం కల్పిస్తోంది. లక్ష రూపాయలు చేతిలో ఉన్నా రీట్స్‌ కొనుగోలు చేయొచ్చు. వీటిలో వార్షిక రాబడులు 5.8 నుంచి 7.8 శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్‌ రీట్స్‌ పోర్ట్‌పోలియో 100.7 మిలియన్‌ చ.అ. కలిగి ఉంది. ఇందులో 91.1 మి.చ.అ. కార్యాలయ స్పేస్‌నే. రిటైల్‌లో 9.6 మి.చ.అ.గా ఉంది.

మున్ముందు కొనేలా...

  • గృహ రుణ వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇది కూడా ఇంటి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • మౌలిక వసతులు మరింతగా మెరుగుపడనున్నాయి. కొత్త సదుపాయాలు రానున్నాయి. శివార్లకు రియల్‌ ఎస్టేట్‌ మరింతగా విస్తరణతో సరసమైన ధరల్లో ఇళ్ల లభ్యత పెరగనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని