ఆకాశహర్మ్యాలకే ఆదరణ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏటికేడు ఆకాశహర్మ్యాల సంఖ్య పెరుగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎత్తైన భవనాలకు ఎక్కువ అనుమతులు మంజూరుకావడమే అందుకు నిదర్శనం.

Updated : 20 Apr 2024 05:38 IST

గతేడాదితో పోలిస్తే 33 అనుమతులు అధికం
ఇతర విభాగాల్లో అంతంతమాత్రంగా ఎదుగుదల
వరుస ఎన్నికలతో మార్కెట్లో వేచి చూసే ధోరణి

గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్థిరాస్తి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏటికేడు ఆకాశహర్మ్యాల సంఖ్య పెరుగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎత్తైన భవనాలకు ఎక్కువ అనుమతులు మంజూరుకావడమే అందుకు నిదర్శనం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగం ద్వారా జారీ అనుమతులు, ఇతర వివరాలను శుక్రవారం జీహెచ్‌ఎంసీ విడుదల చేయగా.. నివాస కేటగిరీతోపాటు వాణిజ్య కేటగిరీలోనూ ఎత్తైన భవంతులకు ఆదరణ పెరుగుతోందని నివేదికలోని గణాంకాలు స్పష్టం చేశాయి. 40 అంతస్తుల నుంచి 50 అంతస్తుల వరకు నివాసముండాలనే కోరిక జనాల్లో పెరుగుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారుల్లో మారుతున్న అభిరుచులకు తగ్గట్టుగా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం రూపు మార్చుకుంటోందని, ప్రపంచస్థాయి నిర్మాణ సంస్థలు నగరంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు వరుసకడుతున్నాయని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం వెల్లడించింది.

టీఎస్‌బీపాస్‌ ద్వారా 75 గజాల వరకు ఇన్‌స్టెంట్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా, 75-600 చ.గ విస్తీర్ణంలోపు భూమిలో కట్టే నిర్మాణాలకు సత్వర అనుమతి(ఇన్‌స్టెంట్‌ అప్రూవల్‌) ద్వారా, అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు ఏక గవాక్ష విధానం(సింగిల్‌ విండో) ద్వారా అనుమతులు మంజూరవుతాయి. ఎత్తైన భవనాలకు లేదా 250గజాలకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు నివాసయోగ్యపత్రం(ఓసీ) తప్పనిసరి. ఇచ్చిన ప్లాన్‌ ప్రకారం ఆయా నిర్మాణాలు జరిగాయా లేదా ఉల్లంఘనలు ఉన్నాయా? అనే విషయాన్ని అధికారులు తనిఖీలో సరిచూస్తారు. గరిష్ఠంగా జరిమానాతో 10శాతం ఉల్లంఘనలను అనుమతిస్తారు. అంతకుమించి ప్లాన్‌ ఉల్లంఘన జరిగితే.. సదరు భవనానికి ఓసీ మంజూరుకాదు. దీనివల్ల యజమానికి కొంత నష్టం తలెత్తుతుంది. సదరు భవనంలో.. జీహెచ్‌ఎంసీ వద్ద తనఖా పెట్టిన 10శాతం నిర్మాణ స్థలం అలాగే ఉండిపోతుంది. ఓసీ జారీ అయినప్పుడే.. ఆ పది శాతం విడుదలవుతుంది. ఓసీ లేకపోతే మరో ఇబ్బంది కూడా ఉంటుంది. భవనంలోని ఫ్లాట్లకు రెట్టింపు ఆస్తిపన్ను, రెట్టింపు నీటి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాల విషయంలోనూ ఇబ్బందులుంటాయి.

వాటిలో తగ్గుదల..: గత ఆర్థిక సంవత్సరం జారీ అయిన అనుమతులను పరిశీలిస్తే.. ఆకాశహర్మ్యాలు మినహా.. మిగిలిన అన్ని విభాగాల్లోనూ అనుమతుల సంఖ్య తగ్గింది. 75 గజాల్లోపు స్థలాలకు, 600 గజాల్లోపు భూములకు అనుమతులు తీసుకునేవారు తగ్గారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబరులో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయని, దానికి మూడు నెలల ముందు నుంచే స్థిరాస్తి రంగంలో వేచి చూసే ధోరణి కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బస్తీలు, కాలనీల్లో అనుమతిలేని నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయనే విమర్శలూ ఉన్నాయి. దీనివల్ల జీహెచ్‌ఎంసీ ఆదాయం పడిపోయిందన్నారు. భారీ నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులు జనవరి 2024 నుంచి ఇటీవలి వరకు పరిశీలనలోనే ఉన్నాయి. ప్రభుత్వం వాటిపై ఎటూ తేల్చకపోవడంతో అధికారులు అనుమతుల జారీని ఆపేశారు. ఇటీవల పురపాలక శాఖ అనుమతులకు పచ్చజెండా ఊపడంతో.. కొన్నిరోజులుగా ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఆమోదం పొందుతున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని