ఎల్‌ఆర్‌ఎస్‌ కష్టాలు

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, పరిష్కారం లభించడం లేదు.

Updated : 20 Apr 2024 03:12 IST

వెంటాడుతున్న సిబ్బంది కొరత.. సాంకేతిక సమస్యలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, పరిష్కారం లభించడం లేదు. ఒక్కో దరఖాస్తుకు నెలల సమయం పడుతోంది. సాంకేతిక లోపాలతో పాటు సిబ్బంది కొరత, ఒక ప్లానింగ్‌ అధికారి పరిధిలో ఒకరికే వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యే అవకాశం ఉండటంతో దరఖాస్తుల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ హెచ్‌ఎండీఏలో సిబ్బంది చేతులెత్తేస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నర్స్‌ (సీజీజీ) సాంకేతిక సహకారం అందిస్తోంది. అయితే తరచూ సాంకేతిక లోపాలతో ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కార్యచరణను హెచ్‌ఎండీఏ షురూ చేసింది. దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి, మేడ్చల్‌ జోన్ల పరిధిలో 3.44 లక్షల ప్లాట్లు క్రమబద్ధీకరణ దరఖాస్తులు అందాయి. వీరంతా రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వీటి క్రమబద్ధీకరణ ద్వారా దాదాపు రూ.1,000 వేయి కోట్లు వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అంచనా వేసింది.  మొత్తం దరఖాస్తుల్లో 50 వేల దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. ఫీజులు ఇతర ఛార్జీలు చెల్లించిన అనంతరం క్రమబద్ధీకరణ పూర్తి అయినట్లు హెచ్‌ఎండీఏ ప్రొసీడింగ్స్‌ పత్రాలు అందించాలి. అయితే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తుదారులు నిత్యం హెచ్‌ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాయి. నెల రోజుల కిందట ఏ దశలో ఉందో, ఇప్పటికీ అక్కడే ఉండటంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. కొందరైతే అక్కడ సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఎంతమంది అర్హులో...

2020కు ముందు అక్రమ లేఅవుట్‌లో ప్లాటు కొనుగోలు చేసినట్లైతే.. తాజా మార్గదర్శకాలు అనుసరించి వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవచ్చునని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఆయా అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే దరఖాస్తు చేసి ఉండాలి. మరోవైపు ఇప్పటికే లేఅవుట్‌లో కనీసం 10 శాతం ప్లాట్లు విక్రయించి ఉండాలి. ఇలాంటి వాటిలో మిగిలిన ప్లాట్లను ప్రస్తుతం క్రమబద్ధీకరణ చేయనున్నారు. అయితే 10 శాతం ప్లాట్లు విక్రయాలు జరగని చాలా లేఅవుట్లుకు సంబంధించి దరఖాస్తులు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి దరఖాస్తులను పరిశీలించి.. వాటి లెక్క తేల్చాలి. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, ప్రభుత్వ స్థలాలు, పట్టణ భూగరిష్ఠ చట్టం మిగులు భూములు, దేవాదాయ భూముల్లో లేఅవుట్లు ఉంటే.. అలాంటి వాటిలో గతంలో రిజిస్ట్రేషన్‌ చేసినప్పటికీ.. తాజాగా క్రమబద్ధీకరణకు అనుమతించరు. ఇలాంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిబ్బంది కొరత వేధిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని