జీసీసీలదే సింహభాగం

నగరంలో భారీ ఎత్తున వాణిజ్య భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో అత్యధిక కార్యాలయాలు ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల కోసం నిర్మిస్తున్నవే. ఈ భవనాల కట్టడాలు నానక్‌రాంగూడ, గచ్చిబౌలి దాటి కోకాపేట వైపు విస్తరిస్తున్నాయి.

Updated : 20 Apr 2024 03:11 IST

కార్యాలయాల లీజింగ్‌లో కొంగొత్త అవకాశాలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో భారీ ఎత్తున వాణిజ్య భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో అత్యధిక కార్యాలయాలు ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల కోసం నిర్మిస్తున్నవే. ఈ భవనాల కట్టడాలు నానక్‌రాంగూడ, గచ్చిబౌలి దాటి కోకాపేట వైపు విస్తరిస్తున్నాయి. నిర్మాణాలకు తగ్గట్టుగానే లీజింగ్‌ ఆశాజనకంగానే సాగుతోంది. ఏటా సానుకూల వృద్ధిని నమోదు చేస్తోంది. రెండు మూడేళ్లుగా గ్లోబËల్‌ క్యాపబుల్‌ సెంటర్ల(జీసీసీ) వాటానే ఆఫీస్‌ మార్కెట్‌లో అధికంగా కల్గి ఉంటున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ వీటిదే హవా అని అధ్యయనాలు చెబుతున్నాయి. 2030 నాటికి భారత్‌లో 2400 జీసీసీలతో గ్లోబల్‌ టెక్నాలజీ హబ్‌గా మారుతుందని.. 2034 నాటికి వీటి సంఖ్య 2880కి చేరుతుందని అంచనా వేస్తున్నాయి. జీసీసీలకు హబ్‌గా మారేందుకు భారత్‌లో హైదరాబాద్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

గ్లోబల్‌ కంపెనీలు నిర్వహణ వ్యయం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. అది భారత్‌కు కలిసి వస్తోంది. ఆయా సంస్థల వ్యూహాత్మక కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఖర్చు తగ్గడంతో పాటు మానవ వనరుల లభ్యత అందుబాటులో ఉండటం కూడా ఇక్కడ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారని నిపుణులు అంటున్నారు. కార్యాలయాల భవనాలకు డిమాండ్‌ పెరగడానికి ఆఫ్‌షోరింగ్‌ దోహదం చేస్తుందని విశ్లేషిస్తున్నారు.

  • మనదేశంలో 41 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2023లో ఆఫ్‌షోరింగ్‌ పరిశ్రమ ఎగుమతుల వాటానే 60 శాతంగా ఉంది.
  • ఐటీ ఎగుమతులు పదేళ్లలో మూడు రెట్లు పెరిగాయి. 2013లో 63 బిలియన్‌ డాలర్లు ఉండగా.. 2023 నాటికి 185.5 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.
  • 2025 నాటికి ఒక బిలియన్‌ చ.అ. మార్క్‌కు ఆఫీస్‌ స్పేస్‌ చేరుకుంటుందని.. ఇందులో అత్యధికంగా చేరేది జీసీసీలే అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది.
  • 2023లో రంగాలవారీగా లావాదేవీలను చూస్తే ఐటీ 11మి.చ.అ.తో 41శాతం వాటా కల్గి ఉంది. పరిశ్రమలు 5.6 మి.చ.అ.,బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ సంస్థలు 5.6 మి.చ.అ., వాణిజ్య, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ 2.1 మి.చ.అ., ఆరోగ్యరంగం 0.8 మి.చ.అ., ఇతరత్రా 2.2 మిలియన్‌ చదరపు అడుగుల లావాదేవీలు జరిగాయి.

మనకు అవకాశం...

భారత్‌ నుంచి ఐటీ ఎగుమతులను 2023లో 185.5 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉండగా... 2025 నాటికి 230.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కొత్త కంపెనీల రాక, ఉన్నవాటి విస్తరణ ప్రణాళికల్లో ఆయా సంస్థలు ఉన్నాయి. జీసీసీలను ఆకర్షించడంలో బెంగళూరు, హైదరాబాద్‌ ముందుంటున్నాయి. ఇక్కడ మరిన్ని సంస్థల జీసీసీల ఏర్పాటుతో కార్యాలయాల లీజింగ్‌ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. ఐటీ రంగంలో వరసగా రెండేళ్ల పాటు అత్యధిక ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌ నుంచి వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని