ప్రతి మూలకూ మెట్రో

ప్రపంచ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా అభివృద్ధిచేస్తున్నామని, మెట్రో రైలును నగరంలోని ప్రతి మూలకు విస్తరిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 18 May 2024 00:36 IST

హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా అభివృద్ధిచేస్తున్నాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల రెట్టింపే లక్ష్యం
మంత్రి శ్రీధర్‌బాబు
హైటెక్స్‌లో ఐజీబీసీ గ్రీన్‌ ప్రాపర్టీ షో ప్రారంభం

కార్యక్రమంలో జ్యోతి వెలిగిస్తున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు. చిత్రంలో ఐజీబీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.ఆనంద్, జాతీయ ఉపాధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి, హైదరాబాద్‌ ఛాప్టర్‌ కో-ఛైర్మన్‌ శ్రీనివాసమూర్తి

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రపంచ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా అభివృద్ధిచేస్తున్నామని, మెట్రో రైలును నగరంలోని ప్రతి మూలకు విస్తరిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మూసీ ఫ్రంట్‌ పేరుతో ప్రపంచ స్థాయిలో మూసీ పరీవాహక ప్రాంతాలను మెరుగుపరుస్తామని చెప్పారు. మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఐజీబీసీ (ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌) గ్రీన్‌ ప్రాపర్టీ షో (హరిత స్థిరాస్తి ప్రదర్శన)ను శుక్రవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో కలిసి ఉత్తమ్‌కుమార్‌ ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ.. ఉత్తమ మౌలిక వసతులు, అత్యంత నివాసయోగ్యమైన నేపథ్యంలో ప్రపంచ ఉత్తమ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతోందన్నారు. ఐటీ, రియల్‌ ఎస్టేట్, పారిశ్రామిక రంగాలను శక్తివంతం చేస్తున్నట్లు చెప్పారు. తమది వ్యాపార మిత్ర ప్రభుత్వమని.. ఐటీ, పరిశ్రమలు, స్థిరాస్తి ఇలా ఏ రంగంలోనైనా పెట్టుబడులకు అనుకూలమన్నారు. ఏ దేశస్థులైనా, తమకు కావాల్సిన రంగంలో పెట్టుబడులు పెట్టొచ్చని పిలుపునిచ్చారు. తమది కుటుంబ పాలన కాదని, ప్రజాస్వామ్యయుతంగా నడిచే ప్రభుత్వమని చెప్పారు. ప్రతి సమస్యనూ వినేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఐదు నెలలు పరిపాలనపై దృష్టి పెట్టామని, ఇక పారిశ్రామిక రంగాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. తద్వారా రాష్ట్ర జీడీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. నిర్మాణ రంగంలోని సమస్యలపైనా దృష్టి పెడతామని తెలిపారు. ప్రపంచంలో సహజ వనరుల వినియోగం పెరిగిన నేపథ్యంలో భూగ్రహం పర్యావరణ సమస్యలతో సతమతమవుతోందని, ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు పాటుపడి భావితరాలకు ఒక స్వచ్ఛమైన పుడమిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో హరిత శక్తి వినియోగం, హరిత భవనాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. లక్ష్యం కన్నా ముందే కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తెచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. రాష్ట్ర జీడీపీలో నిర్మాణ రంగం కీలకంగా నిలుస్తోందని తెలిపారు. 

ఐజీబీసీ వైస్‌ ఛైర్మన్‌ శేఖర్‌రెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాము పర్యావరణహిత హరిత భవనాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రజలు నేడు సౌకర్యవంతంగా నివసించాలనుకుంటున్నారని, ఇందుకు గేటెడ్‌ కమ్యునిటీల్లో 3, 4 పడక గదుల ఇళ్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఐజీబీసీ గ్రీన్‌ హోమ్స్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం.ఆనంద్, శ్రీనివాస్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

ప్రదర్శనలో 70కిపైగా స్థిరాస్తి సంస్థలు తమ స్టాల్స్‌ ఏర్పాటుచేశాయి. నగరవాసులు తమకు నచ్చిన స్వగృహ కలను సాకారం చేసుకునేలా సంస్థలన్నీ ఒకే ఛత్రం కిందికి తీసుకొచ్చారు. ఈనెల 19 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ప్రదర్శన కొనసాగనుంది. 

ఔషధ మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్‌ వద్ద వివరాలు తెలుసుకుంటున్న కొనుగోలుదారులు

కార్బన్‌ క్రెడిట్‌ ఆధారంగా రుణాలివ్వాలి

నగరం పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలమని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర ఐటీ ఎగుమతులను రూ.2.5లక్షల నుంచి ఐదేళ్లలో రెట్టింపు చేస్తామన్నారు. ఐటీ పెట్టుడులను తమ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని, గతేడాది రూ.19వేల కోట్ల ఐటీ పెట్టుబడులు రాగా తమ ప్రభుత్వం వచ్చాక మూడు నెలల్లోనే రూ.40వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. నగరం డేటా వేర్‌ హౌస్‌ కేపిటల్‌ సిటీగా వెలుగొందుతోందన్నారు. నిర్మాణ రంగం అధికంగా 40శాతం విద్యుత్తును వినియోగిస్తోందని, దాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌ను తక్కువగా నియోగించుకునే, కాలుష్యరహిత హరిత భవనాలు విస్తరించాని చెప్పారు. 2070 నాటికి కర్బన ఉద్గారాల సున్నా స్థాయి సాధించడం దేశం ముందున్న లక్ష్యమని, దాన్ని 2050 నాటికి రాష్ట్రం సాధించాలనే ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు చాలా శ్రమించాలని గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ట్రీ భాగస్వాములను ప్రోత్సహించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃవినియోగం, పునఃఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. నిర్మాణ రంగంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చేలా కార్బన్‌ క్రెడిట్‌ విధానాన్ని అమలుచేయాలని, ఇందులో కార్బన్‌ క్రెడిట్‌లో కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే సంస్థలకే రుణాలు మంజూరు చేసే విధానాన్ని అమలు చేయాలని చెప్పారు.

హరిత భవనాల్లో రాష్ట్రానికి మూడోస్థానం

15 ఏళ్ల క్రితమే నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హరిత భవనాలను ప్రోత్సహించారని మంత్రి శ్రీధర్‌ బాబు గుర్తుచేశారు. ఈ క్రమంలో హరిత భవనాల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలవడం అభినందనీయమని చెప్పారు. ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, గత ప్రభుత్వ విధానాలను విధ్వంసం చేయలేదని, మంచి విధానాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. పట్టణాభివృద్ధిలో కొత్త విధానాలు వస్తున్నాయని తెలిపారు.

నగరంలో సెమీ కండక్టర్ల రంగాన్ని ఆకర్షించేందుకు తాము కృషి చేస్తుండగా ఈ రంగంలో పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్‌కు తీసుకెళ్లి నగరానికి అన్యాయం చేశారని ఆరోపించారు. నగరంలో స్థిరాస్తి ధరలు ఇతర నగరాల కన్నా తక్కువ ఉన్నాయన్నారు. అయినా పేదలు, దిగువ, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో  ఉండేలా చూస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని