గతేడాది మించి రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌లో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 26,027 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Updated : 18 May 2024 13:36 IST

పుంజుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌లో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో 26,027 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం అధికం. 2023లో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు 22,632 యూనిట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. 2022లో 24,866 ఇళ్లతో పోల్చినా ఈసారి అంతకంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపింది. పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నప్పటికీ గత ఏడాది కంటే ఎక్కువ జరగడం విశేషం.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, కొంత సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కువగా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ గత నెలలో 6,578 ఇళ్ల రిజిస్ట్రేషన్లు ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌లో జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 46 శాతం అధికం. 

నగరంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సందడి 

విస్తీర్ణమూ ముఖ్యమే 

ఇంటి కొనుగోలులో హైదరాబాద్‌ మార్కెట్‌లో విస్తీర్ణమే కీలకంగా ఉంది. గత ఏడాది, ఈ ఏడాది ఏప్రిల్‌ నెలతో పోల్చి చూస్తే 3వేలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లు 2 నుంచి 4 శాతానికి పెరిగాయి. 

  • రెండువేల నుంచి మూడువేల విస్తీర్ణం లోపు ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 8 నుంచి 11 శాతానికి పెరిగాయి. 
  • 1000-2000 చ.అ. విస్తీర్ణం కలిగిన ఇళ్లు 69 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయి. 
  • వెయ్యిలోపు ఇళ్ల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 20 నుంచి 16 శాతానికి తగ్గాయి.

రంగారెడ్డి జిల్లాదే అగ్రాసనం 

ఇళ్ల రిజిస్ట్రేషన్లలో ఏడాది కాలంలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా రిజిస్ట్రేషన్ల వాటా 46 శాతం ఉండగా.. ఈ ఏడాది 39 శాతానికి తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో 39 నుంచి 45 శాతానికి రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 

రూ.50 లక్షల లోపు ఇళ్లు 

ఇంటి రిజిస్ట్రేషన్‌ విలువ రూ.50 లక్షల లోపల ఉన్న ఇళ్లు నాలుగు నెలల వ్యవధిలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 శాతం తగ్గాయి. 2023లో 16,060 ఇళ్లు రిజిస్ట్రేషన్‌ జరిగితే.. ఈసారి 15,419 జరిగాయి. అయినప్పటికీ మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటానే అధికం. 

  • రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపల విలువ కలిగిన ఇళ్లు 2023లో 4,512 రిజిస్ట్రేషన్‌ జరిగితే.. 2024లో 6,649 యూనిట్లకు అంటే ఏకంగా 47 శాతం పెరిగాయి. 
  • కోటిపైన విలువ కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. 2023లో 2,060 జరిగితే.. ఈసారి 3,959 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. పెరుగుదల 92 శాతం దాకా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 1,142 యూనిట్లకు పెరిగాయి. అంటే 172 శాతం పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని