‘రెరా’.. అందుబాటులోకి రా..

రాష్ట్రంలో రెరా శకం మొదలుకాబోతుంది. ఇన్నాళ్లు కాగితాలపైనే ఉన్న.. అదిప్పుడు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఉందా..? హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుటేనా..

Published : 28 Jul 2018 01:34 IST

‘రెరా’.. అందుబాటులోకి రా..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెరా శకం మొదలుకాబోతుంది. ఇన్నాళ్లు కాగితాలపైనే ఉన్న.. అదిప్పుడు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఉందా..? హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుటేనా.. అని కొనుగోలుదారులు ఆరా తీసేవారు. ఇకపై రెరా రిజిస్ట్రేషన్‌ ఉందా.. అని అడిగే రోజులు వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి స్థిరాస్తి అభివృద్ధి, నియంత్రణ చట్టం(రెరా) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. కేంద్రం 2016లో చట్టం చేయగా.. గత ఏడాది జులై 31న రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటు చేసింది. ఇంతకాలం వెబ్‌సైట్‌ లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుకాలేదు. ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తుండటంతో 2017 జనవరి 1 తర్వాత అనుమతులు పొందిన నిర్మాణాలు కచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే. కొనుగోలుదారుల హక్కులను కాపాడే లక్ష్యంతో ఈ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి కొనుగోలుదారులు సైతం రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లోనే కొనుగోలు చేయాలని.. అప్పుడే చట్టం వారికి అండగా ఉంటుందని అథారిటీ వర్గాలు అంటున్నాయి. బిల్డర్‌, డెవలపర్ల నుంచి ఏవైనా సమస్యలు వస్తే, నిర్మాణ లోపాలు తలెత్తితే కొనుగోలుదారులు రెరా వెబ్‌సైట్‌లోకి వెళ్లి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకుని ఫిర్యాదు నమోదు చేయాలి. అందుకు ఆధారమైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.
* ప్రస్తుతం చాలా బడా సంస్థలు 30 అంతస్తుల టవర్ల నిర్మాణం చేపట్టినప్పుడు కొనుగోలుదారుల స్పందన, డిమాండ్‌ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ముందు 10 అంతస్తుల వరకు అనుమతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ తమ బ్రోచర్లలో మాత్రం 30 అంతస్తుల టవర్‌ అని ప్రచారం చేస్తున్నారు. ఇకపై ఇలాంటివి కుదరవని రెరా అధికారులు స్పష్టం చేశారు. బ్రోచర్‌లో పేర్కొన్నట్లుగా పూర్తి ప్లాన్‌ సమర్పించి అనుమతులు పొందాలని.. ఫ్లోర్‌, ఫ్లాట్‌వారీగా వివరాలు స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు.
* నిర్మాణదారుడు, కొనుగోలుదారులతో చేసుకునే ఒప్పంద పత్రంలో అన్ని వివరాలు పొందుపర్చాలి. నిర్మాణం స్వాధీనపర్చు తేదీ, నికరంగా కొనుగోలుదారునికి అందించే విస్తరణ పరిమాణం, వ్యక్తిగత గృహ సదుపాయాల వివరాలు, సామూహిక వసతుల వివరాలు, ఉపయోగించే సామగ్రి తయారీదారు పేరు వంటి వివరాలన్నీ పొందుపర్చాలి.
* ఐదు సంవత్సరాలు వరకు నిర్మాణలోపాలకు బిల్డర్‌దే బాధ్యత. ఇక్కడే ప్రస్తుతం చాలామంది నిర్మాణదారులు నాసిరకంగా నిర్మించి విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. రెరాతో కొనుగోలుదారులకు భరోసా పెరగనుంది.
* కార్పెట్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియా, కామన్‌ ఏరియా విడివిడిగా చూపాల్సి ఉంటుంది.
* కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలురకాల వసతులు, నాణ్యత వివరాలు, సాంకేతికత అంశాలుకు చట్టబద్ధత ఉంటుంది. లోపాలుంటే వీటిని ఆధారంగా చూపి న్యాయం పొందవచ్చు. ఆయా కరపత్రాలు, ప్రకటనలపై కచ్చితంగా రెరా నంబర్‌ ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని