T20 WC 2024: బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ

మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్‌లను వెల్లడించారు.

Published : 25 Apr 2024 17:37 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ కోసం (T20 World Cup 2024) బౌలర్ల ఎంపికలో ఎలాంటి రాజీ పడకూడదని భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ సూచించాడు. అలాకాకుండా అదనంగా బ్యాటర్‌ను తీసుకుందామని బౌలింగ్‌ విభాగాన్ని కుదిస్తే ఫలితాలు విభిన్నంగా వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న పొట్టి కప్‌ కోసం ఈనెలాఖరులోగా జట్టును ఎంపిక చేయాల్సిఉంది. మరో రెండు రోజుల్లోనే భారత్ తన టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈక్రమంలో సిద్ధూ కూడా బౌలింగ్‌ విభాగంలో ఎవరు ఉంటే బాగుంటుందో వెల్లడించాడు. 

‘‘రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్టర్లకు నాదొకటే సూచన. మీరు టోర్నీని గెలవాలని భావిస్తే కనీసం ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగాలి. రాజీ అనే అంశంతోనే జట్టు కుప్పకూలేందుకు అవకాశం ఉంటుంది. జట్టులో ముగ్గురు స్పిన్నర్లు కుల్‌దీప్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా ఉండాలి. మయాంక్ యాదవ్‌ ఫిట్‌గా ఉంటే తీసుకోవాలి. ఖలీల్ అహ్మద్, ముకేశ్‌కుమార్, మోసిన్‌ ఖాన్ జట్టుతోపాటు ఉండాల్సిందే. అదనంగా బ్యాటర్‌ ఉండటం వల్లే టోర్నీలను గెలవలేం. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటివరకు టైటిల్‌ విజేతలుగా నిలిచిన ఆయా జట్టు కెప్టెన్లు అత్యుత్తమ బౌలింగ్ ఆప్షన్లతో బరిలోకి దిగారు. ఏడుగురు లేదా ఎనిమిదిమంది బ్యాటర్లు ఉన్నా వరల్డ్‌ కప్‌ను నెగ్గలేరు. బౌలర్ల పాత్ర చాలా కీలకం’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు.

హర్భజన్‌ జట్టు ఇదే..

భారత మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ కూడా తన వరల్డ్‌ కప్‌ జట్టును ప్రకటించాడు. అందులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్‌ పాండ్యకు చోటు కల్పించకపోవడం గమనార్హం. ఇందులో.. రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అవేశ్‌ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్‌ యాదవ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని