HMDA: లేఅవుట్ల అభివృద్ధి ఇక చకచకా

కొన్నినెలలుగా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. కీలక ప్రాజెక్టుల కదలికలో జాప్యం జరుగుతోంది.

Published : 25 May 2024 01:12 IST

ఈనాడు, హైదరాబాద్‌ 

కొన్నినెలలుగా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌తో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. కీలక ప్రాజెక్టుల కదలికలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ముగియడంతో ఫలితాలు వచ్చేలోపు కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించకున్నా ఇప్పటికే అమల్లో ఉన్న ప్రాజెక్టులపై హెచ్‌ఎండీఏ ముందుకు వెళ్లనుంది. పలు ప్రాంతాల్లో రైతుల సమ్మతితో సమీకరించిన వ్యవసాయేతర భూముల్లో లేఅవుట్లు అభివృద్ధి చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లు చేసి విక్రయించడం వల్ల రూ.వేల కోట్లు ఆదాయం వచ్చింది. వ్యవసాయేతర భూములను లేఅవుట్లగా అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా భూములిచ్చిన రైతులకు ప్రయోజనంతోపాటు హెచ్‌ఎండీఏకు ఆదాయం సమకూరనున్న సంగతి తెలిసిందే. ఆ నిధులతో మహానగర పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.

ఇదీ ప్రణాళిక...

ప్పల్‌ భగాయత్‌ తరహాలో ప్రతాపసింగారంలో భారీ లేఅవుట్ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం సుమారు 250 ఎకరాలను హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేశారు. ఎన్నికల కారణంగా ఈ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. కీసర సమీపంలోని బోగారంలోనూ మరో 170 ఎకరాలను సమీకరించి లేఅవుట్‌ను తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

  • కుర్మల్‌గూడ, దండుమైలారం, ఇబ్రహీంపట్నం, లేమూరు, ఇన్ముల్‌నెర్వ, కొర్రెముల, నాదర్‌గుల్‌ తదితర ప్రాంతాల్లో వ్యవసాయేత భూములు వేయి ఎకరాల వరకు ఇప్పటికే హెచ్‌ఎండీఏ గుర్తించింది. అక్కడ రైతులతో మాట్లాడి భూ సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. 
  • ఇందులో ఇప్పటికే ఇన్ముల్‌నెర్వలో 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాలను సేకరించారు. కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, దుండుమైలారంలో మరో 355 ఎకరాలు వ్యవసాయేతర భూములను హెచ్‌ఎండీఏ గుర్తించింది. 
  • ఆయా భూములను సేకరించి ఇందులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తు ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. లేఅవుట్‌లో మౌలిక వసతులు, ప్రజా అవసరాలకు భూమి పోను మిగిలిన భూమిని ప్లాట్లు చేస్తారు. ఇందులో 60 శాతం రైతులకు, 40 శాతం హెచ్‌ఎండీఏకు దక్కుతాయి. వీటిని బహిరంగ వేలం ద్వారా ఇతరులకు విక్రయిస్తారు. 
  • మరోవైపు ఉప్పల్‌ భగాయత్, కోకాపేట్, బుద్వేల్‌లో హెచ్‌ఎండీఏ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరినా మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు అందుబాటులో లేవనే విమర్శలు వచ్చాయి. దీంతో కొత్తగా అభివృద్ధి చేయనున్న లేఅవుట్లల్లో అందరికీ అందుబాటులో ఉండేలా 150, 200 చ.గజాల పరిమాణంలో తీర్చిదిద్దనున్నారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని