ఇంటి కొనుగోలులో ఆచితూచి అడుగులు

కొత్త సంవత్సర ఆరంభం రియాల్టీని నిరాశపర్చింది. జనవరిలో మూడేళ్ల కనిష్టానికి అపార్ట్‌మెంట్ల విక్రయాలు పడిపోయాయి. 34 శాతం తక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Updated : 11 Feb 2023 08:18 IST

ఈనాడు, హైదరాబాద్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును మరోసారి పెంచింది. ఫలితంగా గృహ రుణ వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.  సహజంగానే ఇది రియల్‌ ఎస్టేట్‌పై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మరో పక్క ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న హైదరాబాద్‌ మార్కెట్‌ను ఈ పరిణామాలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొనుగోలుదారులేమో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితులు తాత్కాలికమేనని మార్కెట్‌ తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసేవారు ఉన్నారు.

కరోనా సమయంలో గృహరుణ వడ్డీరేట్లు పదేళ్ల కనిష్ఠానికి దిగి వచ్చాయి. 6.5 శాతానికి బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో ఎక్కువ మంది ఇళ్లు కొనుగోలు చేశారు. కొవిడ్‌కాలంలో ఇంటి అవసరం పెరగడం, అద్దెకు చెల్లించే డబ్బులతో ఈఎంఐ చెల్లించవచ్చని ఎక్కువ మంది సొంతిల్లు కొన్నారు. నగదు లభ్యత పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపారు. ఆ సమయంలో హైదరాబాద్‌ మార్కెట్లో సరఫరా తక్కువగా ఉండటంతో ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో విల్లాలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, స్థలాలు, భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎంతగా అంటే ఒక వర్గం ప్రజలకు ఇల్లంటేనే తాము ఇక కొనలేము అని దూరం జరిగేంతగా ధరలు పెరిగాయి. ఈ పరిణామాలు మార్కెట్లో పెడధోరణులకు దారితీశాయి. ఆయా వర్గాలను ఆకర్షించేందుకు యూడీఎస్‌లో ప్రీలాంచ్‌లో సగం ధరకే ఇళ్ల వంటి అనైతిక వ్యాపారానికి కొందరు డెవలపర్లు తెరలేపారు.

విపరీతంగా పెంచేశారు..

ధరలు పెంచారా? పెరిగాయా? అంటే రెండూ అని చెప్పవచ్చు. నిర్మాణ వ్యయం పెరగడంతో ధరలు కొంతవరకు పెరిగాయి.  ఎప్పటికప్పుడు ధరలు పెంచుకుంటూ పోతే మార్కెట్‌ బూమ్‌లో ఉందనే భావనను కొనుగోలుదారుల్లో కల్పించేందుకు కూడా మూడు నెలలకు ఒకసారి అపార్ట్‌మెంట్‌లలో, లేఅవుట్లలో ధరలను సవరించినవారు ఉన్నారు. వీటిని చూసి భూ యాజమానులు ధరలు పెంచారు. ప్రభుత్వం సైతం భూములను వేలం వేయడంతో ఆయా ప్రాంతాల్లో ధరలు అత్యధికంగా బిడ్‌ చేసిన ధర దగ్గర స్థిరపడ్డాయి. అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ ఉండటంతో పోటీపడి మరీ వేలంలో భూములను దక్కించుకున్న సంస్థలు ఉన్నాయి. సహజంగానే ఆయా భూముల్లో కట్టే ప్రాజెక్టుల్లో ప్రీమియం ధరలు ఉంటాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది కానీ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు సొంతిల్లు దూరం అవుతుందనే విషయాన్ని సర్కారు గుర్తించలేకపోయిందని స్థిరాస్తి సంఘం ప్రతినిధి ఒకరు అన్నారు.

కొనేవారు లేక కాదు

మార్కెట్‌ స్తబ్ధుగా ఉందంటే అర్థం కొనేవారు తగ్గారని. కానీ ఇప్పటికీ ఎంతోమంది తమ బడ్జెట్‌లో దొరికే ఇంటి కోసం అన్వేషిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఇంటి ధరలకు తమ బడ్జెట్‌కు పొంతన కుదరక మిన్నకుండిపోతున్నారు. పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతంలో చూస్తే రూ.కోటిపైనే వెచ్చించాల్సి ఉంటుంది. పేరున్న బిల్డర్లందరూ ప్రీమియం ప్రాజెక్ట్‌లనే చేస్తున్నారు. అందుబాటు ధరల్లో ఇళ్లను కట్టేవాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కాస్త ధర ఎక్కువైనా గృహరుణం తీసుకుని కొందామంటే వడ్డీరేట్లు పెరుగుతూ పోతున్నాయి. దీంతో ధైర్యం చేయలేకపోతున్నారు. అద్దెను, ఈఎంఐని పోల్చి చూస్తున్నారు. అచితూచి అడుగులు వేస్తున్నారు. ఐటీలో ఆర్థిక మాంద్యం భయాలు సైతం వేచి చూసే ధోరణికి కారణం అవుతున్నాయి. ఇవన్నీ మార్కెట్‌ స్తబ్ధతకు కారణంగా కనిపిస్తున్నాయి.

అప్పుడలా.. ఇప్పుడిలా.. 

ప్రస్తుత మార్కెట్‌ పరిణామాలు 2008 పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని రియల్టర్‌ ఒకరు అన్నారు. అప్పట్లో ప్రవాస భారతీయలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున ప్రాజెక్టులను చేపట్టారని.. మాంద్యం ప్రభావంతో దెబ్బతిన్నారని అన్నారు. ఇప్పుడు కూడా అందరూ ప్రీమియం ప్రాజెక్ట్‌లే చేస్తున్నారని.. మిగతా వర్గాలను విస్మరిస్తున్నారని అన్నారు. ధరలు పెరుగుతూ పోతే మార్కెట్‌ బాగున్నట్లు కాదని.. ఎక్కువ మంది ఇళ్లు కొనుగోలు చేస్తే మార్కెట్‌ బాగున్నట్లని చెప్పారు.


వడ్డీరేట్ల ఒత్తిడితో మందగమనం

ఈనాడు, హైదరాబాద్‌

కొత్త సంవత్సర ఆరంభం రియాల్టీని నిరాశపర్చింది. జనవరిలో మూడేళ్ల కనిష్టానికి అపార్ట్‌మెంట్ల విక్రయాలు పడిపోయాయి. 34 శాతం తక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది జనవరిలో అత్యల్పంగా 4872 ఇళ్ల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 2022లో ఈ సంఖ్య 7343 కాగా, 2021లో 7592గా ఉందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. జనవరిలో రిజిస్ట్రేషన్‌ అయిన ఆస్తుల విలువ రూ.2422 కోట్లని పేర్కొంది.

ఎందుకిలా..

* ప్రతి ఏటా కొన్నినెలలు రిజిస్ట్రేషన్లు తగ్గడం హైదరాబాద్‌ మార్కెట్‌లో తరచూ కనిపిస్తుంటుంది.  
* పండగ సీజన్‌ కావడం వల్ల కూడా విక్రయాలపై ప్రభావం పడింది.
* ఒక నెలలో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటే మరుసటి నెలలో తక్కువగా కనిపిస్తాయి.
* ధరల పెరుగుదల, మార్కెట్లో సక్రమంగా లేని పోకడలు సైతం అమ్మకాలు మందగించడానికి కారణం అవుతున్నాయి. .
* హైదరాబాద్‌ గృహ నిర్మాణ మార్కెట్‌ వడ్డీరేట్ల ఒత్తిడిని ఎదుర్కొంటోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీనియర్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ శాంసన్‌ అర్ధర్‌ అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని