ఉగాది ఉషస్సులు
తెలుగు సంవత్సరాది ఉగాది సొంతింట్లో చేసుకుంటే ఆ పండగ సంతోషమే వేరు.. కానీ ఇప్పటికీ ఎంతోమంది ఆ భాగ్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది శోభకృతు నామ సంవత్సరం అంటే లాభాలు కలిగించేదనే అర్థం. కాస్త దృష్టి పెడితే ఇంటి కలను సాకారం చేసుకోవడం సాధ్యమేనని మార్కెట్‌లోని పరిస్థితులు చెబుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు బాహ్యవలయ రహదారి ఇంటికి మార్గం చూపుతోంది.
నగరంలో రూ.కోటి లేనిదే కోరుకున్న ప్రాంతంలో మూడు పడక గదుల ఫ్లాట్ రావడం లేదని.. ఎక్కడి నుంచి తేగలం అని చాలా మంది దిగులు చెందుతున్నారు. రెండు పడక గదులకు తక్కువలో తక్కువ రూ.50 లక్షలైనా కావాల్సిందేనని నిరాశలో ఉంటున్నారు. ప్రధాన నగరంలో, ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో, ఇప్పటికే అభివృద్ధి చెందిన కాలనీల్లో ఉండాలంటే ఈ ధరలు పెట్టక తప్పదు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సొంతింట్లో ఉంటున్న వారంతా ముందుచూపుతో వ్యవహరించి ఆ ప్రాంతం అభివృద్ధి చెందకముందే స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేశారు. ఐదు నుంచి పదేళ్లు తిరిగే సరికి ఆస్తుల విలువ రెట్టింపు కావడమే కాదు ప్రాంతం సైతం అభివృద్ధి చెందింది.
మరో ఛాన్స్ : ..సరే అప్పుడు అవకాశం కోల్పోయాం.. ఇప్పుడు మరో ఛాన్స్ ఉందా అంటారా? అలాంటి అవకాశం ఇప్పుడు బాహ్యవలయ రహదారి కల్పిస్తోంది. దారి వెంట ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఇక్కడ అపార్ట్‌మెంట్ల నిర్మాణం మొదలైంది. మరిన్ని సంస్థలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. వీటిలో చదరపు అడుగు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌లోని తక్కువ విస్తీర్ణం కలిగిన ఫ్లాట్లు రూ.పాతిక లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. వెయ్యి చ.అ. ఫ్లాట్ రూ.35లక్షల ధరల్లో విక్రయిస్తున్నాయి. సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు సైతం స్టాండలోన్ అపార్ట్‌మెంట్లలో ఈ ధరల్లో ఉన్నాయి. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.
వలయం వెంట వెళితే.. : నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర బాహ్యవలయ రహదారి విస్తరించి ఉంది. గచ్చిబౌలి నుంచి అప్పా, కొల్లూరు, పటాన్‌చెరు వరకు బాగా అభివృద్ధి చెందడంతో ఇక్కడ స్థిరాస్తుల ధరలు ఎక్కువే ఉన్నాయి. ఐటీకి చేరువగా ఉండటంతో ఈ ప్రాంతాలకు మొదటి నుంచి బాగా డిమాండ్ ఉంది. ఇది మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే అవుటర్ దాటి అభివృద్ధి పరుగులు పెడుతోంది.
* పై ప్రాంతం కాకుండా బాహ్యవలయ రహదారి మిగతా భాగమంతా ఇప్పుడిప్పుడే జనావాసాలు వస్తున్నాయి. సిటీ నుంచి క్రమంగా నిర్మాణాలు విస్తరిస్తూ బాహ్యవలయ రహదారి వైపు వెళుతున్నాయి. శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల, కొంగర కలాన్, రావిర్యాల, పెద్ద అంబర్‌పేట, పోచారం, ఘట్‌కేసర్, నాగారం, శామీర్‌పేట, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి, బౌరంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు వస్తున్నాయి. ఇక్కడ పదేళ్ల క్రితం లేఅవుట్లు వేయగా... కొవిడ్ తర్వాత నుంచి విల్లాల నిర్మాణం మొదలైంది. ఇప్పుడు అపార్ట్‌మెంట్లు కడుతున్నారు.
* అవుటర్‌కు అనుసంధానంగా ఉన్న బెంగళూరు జాతీయ రహదారి, శ్రీశైలం దారి, సాగర్ హైవే, విజయవాడ జాతీయ రహదారి, వరంగల్, కరీంనగర్, ముంబయి, బీజాపూర్ దారులకు అటుఇటు పెద్ద ఎత్తున ఆవాసాలు వస్తున్నాయి.
మున్ముందు అభివృద్ధి
ఇప్పుడు నిర్మాణాలు వస్తున్న ప్రాంతాల్లో ప్రస్తుతానికి సోషల్ ఇన్‌ఫ్రా అంతగా అభివృద్ధి చెందలేదు. ఆవాసాలు విసిరేసినట్లుగా ఉన్నాయి. విద్యాసంస్థలు మాత్రం ఉన్నాయి. ఆసుపత్రులు, వినోదం పరంగా మరికొంతకాలం పడుతుంది. ఈప్రాంతాల్లో మూడు నుంచి ఐదేళ్లలో రూపురేఖలు మారనున్నాయి. ఇక్కడ స్థలాలు రూ.20వేల నుంచి రూ.35వేల ధరల్లో చెబుతున్నారు. విల్లాలు రూ.80 లక్షల నుంచి కోటిన్నర పలుకుతున్నాయి. చదరపు అడుగు రూ.6500 నుంచి విక్రయిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. చదరపు అడుగు రూ.3వేల నుంచి అందిస్తున్నారు. వ్యక్తిగత ఇళ్లు సైతం కట్టి విక్రయిస్తున్నారు. రూ.65 లక్షల నుంచి ధరలు చెబుతున్నారు. ఆయా వర్గాలకు ప్రస్తుతం ఇక్కడ ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. నిర్మాణాలు పెరిగేకొద్దీ ఇక్కడ సైతం నెలల వ్యవధిలోనే ధరల్లో మార్పులు కన్పిస్తున్నాయి.
మౌలిక వసతులు రాబోతున్నాయ్
* రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలు రాబోతుంది. బీహెచ్‌ఈఎల్ వరకు విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి.
* మూసీపైన 15చోట్ల బ్రిడ్జీలు రాబోతున్నాయి. వంతెనలు పూర్తైతే ఆయా ప్రాంతాలు నివాస కేంద్రాలుగా అభివృద్ధి చెందనున్నాయి.
* అప్పా నుంచి కొల్లూరు వరకు సైక్లింగ్ ట్రాక్ రాబోతుంది. హెచ్‌ఎండీఏ వెంచర్లు కొత్తగా రాబోతున్నాయి.
* శివార్లలోని రద్దీ ప్రాంతాల్లో మరో 10 వరకు ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీ, ఆర్వోబీలు రానున్నాయి.
* ప్రాంతీయ వలయ రహదారి రాబోతుంది. ఓఆర్‌ఆర్, త్రిఫుల్ ఆర్ మధ్య ఫార్మాసిటీ, ఈ-మొబిలిటీ వ్యాలీలు, పారిశ్రామిక వాడలు, ఏరోసెజ్‌లు, ఎలక్ట్రానిక్ సిటీల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు, డేటా కేంద్రాలు రానున్నాయి. భవిష్యత్తులో ఉపాధికి కేంద్రంగా ఉండనున్నాయి. వీటి రాకతో భవిష్యత్తు శివార్లదేనని అంటున్నారు.
ఎంపికలో జాగ్రత్త
* శివార్లలో స్డాండలోన్ అపార్ట్‌మెంట్లు ఎక్కువ. చిన్న బిల్డర్లు వీటిని కడుతుంటారు. ఫ్లాట్ బుక్ చేసేటప్పుడు ఆయా బిల్డర్లు గతంలో కట్టిన ప్రాజెక్ట్‌లు, సకాలంలో అందించారా లేదా వంటి వివరాలు తెలుసుకున్నాకే ముందడుగు వేయండి.
* ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ, స్థానిక కార్పొరేషన్, రెరా అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. అనుమతులు వచ్చాకే వాటిలో కొనుగోలు చేయండి. ప్రీలాంచ్, యూడీఎస్ వలలో పడొద్దు.
* నిబంధనలు పాటించని నిర్మాణాల్లో తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. నిబంధనల మేరకు సెట్‌బ్యాక్‌లు వదిలారా లేదా? అప్రోచ్ రోడ్డు ఉందా లేదా? భవనంలో అన్ని ఫ్లాట్లకు సరిపడా పార్కింగ్ సదుపాయం ఉందా లేదా నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయండి.
* కనీసం 600 గజాలు ఉంటే ఐదు అంతస్తుల భవనాన్ని నిబంధనల మేరకు నిర్మించవచ్చు. అంతకంటే తక్కువ విస్తీర్ణంలో కడుతున్న వాటిలో నిబంధనల మేరకు కడుతున్నారో లేదో పరిశీలించాకే నిర్ణయం తీసుకోండి.
* అపార్ట్‌మెంట్లే కాదు.. వ్యక్తిగత ఇళ్లు సైతం ఈ ప్రాంతాల్లో కడుతున్నారు. విల్లా ప్రాజెక్టుల్లో లభ్యత ఎక్కువగా ఉంది. అనుమతులు ఉన్నాయో లేదో చూసి కొనుగోలు చేయడం మేలు.
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు
-
Sports News
CSK: అత్యుత్తమ ఆల్‌రౌండర్.. ఈ స్టార్‌కు మరెవరూ సాటిరారు: హర్భజన్ సింగ్
-
Movies News
Sai Pallavi: అలా కనిపిస్తాను కాబట్టే నన్ను ఎక్కువ మంది ఇష్టపడతారు: సాయి పల్లవి
-
World News
Donald Trump: పోర్న్ స్టార్ కేసులో అభియోగాలు.. ట్రంప్ భవితవ్యమేంటి?
-
Politics News
Amaravati: ‘వైకాపాతో జరుగుతున్న యుద్ధంలో అంతిమ విజయం అమరావతిదే’
-
Sports News
IND vs PAK: విరాట్ సమాధానంతో ఆశ్చర్యపోయా.. నేను మాత్రం అలా ముగించా: సర్ఫరాజ్