ఇంటిపై బడ్జెట్ కరుణించేనా?
పలు రాయితీలు, ప్రోత్సాహకాలను ఆశిస్తున్న నిర్మాణ రంగ పరిశ్రమ
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా గృహ నిర్మాణ రంగానికి తగిన రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కేనా? గత కొన్నేళ్లుగా బడ్జెట్ సమయానికి పరిశ్రమ వర్గాలు, కొనుగోలుదారులు భారీగా ఆశలు పెట్టుకోవడం.. బడ్జెట్ చూశాక నిట్టూర్చడం పరిపాటైంది. నిర్మాణ వ్యయం పెరిగి సామాన్య, మధ్యతరగతి వాసులకు ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోయిన తరుణంలో రియల్ ఎస్టేట్ జాతీయ, తెలంగాణ సంఘాలు విత్త మంత్రికి ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేశాయి. కొందరు బిల్డర్లు ప్రధానికి లేఖ రాశారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టె 2023-24 బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం ఎలాంటి ప్రోత్సాహకాలను ఆశిస్తోందంటే?
స్థిరాస్తి రంగం కొవిడ్ ఒడిదొడుకులను తట్టుకుని సాధారణ స్థాయికి చేరుకుంది. కొత్త ప్రాజెక్టులు, కొనుగోళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. స్థిరాస్తులు కొనేవాళ్లు ఒకటికి రెండు కొనుగోలు చేస్తున్నారు. కొందరు సొంతింటి కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఇళ్ల ధరలు ఆయా వర్గాలకు ఇంటికలను దూరం చేస్తున్నాయి. ఏడాదిలో దేశవ్యాప్తంగా స్థిరాస్తి ధరలు 14 శాతం పెరిగాయి. భూములు, ముడిసరుకుల ధరలు, జీఎస్‌టీతో కలిపి నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని బిల్డర్లు అంటున్నారు. కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో ప్రోత్సాహకాలను ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
పన్నుల రాయితీ పెంచాలని..
గృహరుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు ఆదాయపు పన్నులో సెక్షన్ 24(బి) ప్రకారం మినహాయింపు ఉంది. గృహ రుణ వడ్డీరేట్లు, ఇళ్ల ధరలు పెరిగిన తరుణంలో ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని పరిశ్రమ కోరుతోంది.
* గృహ రుణం తీసుకుని తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి వడ్డీ మొత్తానికి ఎలాంటి పరిమితి లేకుండా పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉండాలి.
అసలు పైన 3 లక్షల దాకా..
ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద గృహ రుణం అసలు చెల్లింపులపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు, పిల్లల ట్యూషన్ ఫీజులకు సంబంధించి పన్ను మినహాయిపులు ఇందులోకే వస్తాయి. వాస్తవంగా సగటు వేతన జీవి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నా పైవన్నీ కలిపితే రూ.3 లక్షల వరకు అవుతోంది. మినహాయింపు రూ.లక్షన్నర వరకే ఉంటుంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి.
అందుబాటు ధర
అందుబాటు ధరల్లో ఇళ్లపై ఉన్న పరిమితులు సడలించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ విభాగంలో ఇంటి ధర గరిష్ఠంగా రూ.45 లక్షలుగా ఉంది. ఆరేళ్లుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ భూముల ధరలు పెరిగిన పరిస్థితుల్లో పరిమితిని రూ.65 లక్షల నుంచి రూ.75లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. పరిమితి పెంపుతో ఈ విభాగంలో నిర్మాణాలు చేపట్టేందుకు మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉందంటున్నారు.
* స్థిరాస్తుల అమ్మకంపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిమితిని మరింత పెంచాలని కోరుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి
మారం సతీష్, అధ్యక్షుడు, గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్
నగరాల్లో అందరికీ ఇళ్లు అందుబాటు ధరల్లో లేకపోతే నేరాలు, మోసాలకు ఆస్కారం ఉంటుంది. అశాంతి నెలకొంటుంది. హైదరాబాద్ లాంటి నగరంలో భూముల ధరలు పెరిగి ఇళ్ల ధరలు కొన్ని వర్గాలకు అందనంత ఎత్తుకు చేరాయి. ప్రీలాంచ్‌లు రావడానికి ఇది కూడా ఒక కారణం. సామాన్య, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఇంటి స్వప్నం నెరవేర్చేందుకు కేంద్రం పీఎంఏవై పథకం తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించుకుని తెలంగాణ రాష్ట్రంలో 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అందుబాటు ఇళ్లను నిర్మిస్తున్నాం. కొనుగోలుదారులకు వడ్డీ సబ్సిడీ కింద రూ.2.67 లక్షలు అందుతున్నాయి. అయితే ఈ పథకం బాగున్నప్పటికీ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా కొవిడ్ తర్వాత భూముల ధరలు పెరిగాయి. ఇంటి ధర పెరగానికి ప్రధానమైన కారణాల్లో ఇదొకటి. ఈ పథకం కింద చేపట్టే ఇళ్ల విస్తీర్ణం, ధర పరిమితులను ఇప్పుడున్న దానికంటే పెంచాల్సి ఉంటుంది. అందరికీ ఇళ్లు నినాదంగానే మిగలకూడదంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ప్రోత్సహించాలి. ప్రైవేటు రంగ భాగస్వామ్యం ఎంత పెరిగితే పోటీతత్వంతో ధరలు సైతం కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ మద్దతు ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రోత్సాహకాలను కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సూచనలు చేయాలని ఆశిస్తున్నాం.
* ప్రధాన నగరంలో ఇళ్ల ధరలు అధికం కాబట్టి కొనుగోలుదారులు శివార్ల వైపు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వైపు చూస్తారు. కానీ అక్కడ సరైన కనీస మౌలిక వసతులు లేవు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి.
* వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు బిల్డర్లు నాలా ఛార్జీలు చెల్లిస్తున్నారు. అందుబాటు ధరల్లో కట్టే ఇళ్లకు ఈ ఛార్జీలను మినహాయించాలి.
* మున్సిపల్ అనుమతుల ఛార్జీలను నామమాత్రంగా ఉండేలా చూడాలి
* జీఎస్‌టీ బడ్జెట్ ధరలో కట్టే ఇళ్లకు 1 శాతమే ఉండాలి. ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ పునరుద్ధరించాలి.
* తక్కువ వడ్డీకే సులభతరంగా నిర్మాణ ప్రాజెక్ట్‌లకు రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి.
అందుబాటు ఇళ్ల ధరను సవరించాలి
జి.రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్
దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది రియల్ ఎస్టేట్ రంగం. దేశం 5 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని చేరుకోవడానికి స్థిరాస్తి రంగం వాటా కూడా అత్యంత కీలకం. 2023 నాటికి జీడీపీలో 13 శాతం వాటా కలిగి ఉంటుంది. 2030 నాటికి 1 ట్రిలియన్ మార్కెట్ పరిమాణానికి చేరుకుంటుంది. కేంద్ర బడ్జెట్ 2023-24 ఇన్‌ఫుట్‌లను కోరేందుకు వివిధ పరిశ్రమ సంఘాలను ప్రభుత్వం సంప్రదించినప్పుడే క్రెడాయ్ ఇదే విషయాన్ని వెల్లడించింది. వేతనజీవులకు ఊరటనిచ్చేలా ప్రోత్సాహకాలను ఇవ్వాలని కోరింది. తద్వారా పరోక్షంగా ఇది పరిశ్రమకు మేలు జరుగుతుందని వివరించింది.
* గృహ కొనుగోలుదారులు రుణంపై చెల్లించే వడ్డీ పన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి.
* రూ.45 లక్షల్లోపు ఉన్న ఇళ్లను అందుబాటు నివాసాలుగా కేంద్రం పరిగణిస్తోంది. ఇంటి ముడిసరకుల ధరలు పెరిగినందున ఈ ధర పరిమితిని సవరించాలి. ధరపై పరిమితులు లేకుండా ఇంటి విస్తీర్ణం(కార్పెట్ ఏరియా)పై మాత్రమే సరసమైన ఇళ్లుగా పరిగణించేలా మార్పులు చేర్పులు చేయాలి.
* ఏడాదికి రూ.20 లక్షల వరకు అద్దెల ఆదాయంపై పన్ను నుంచి మినహాయింపుతో ఇంటి యజమానులను ప్రోత్సహించేందుకు, రెంటల్ హోమ్స్ నిర్మాణానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.
* దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలి. గడువును 12 నెలలకు తగ్గించాలి.
* రిట్‌ల ద్వారా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులపై మినహాయింపు ఇవ్వాలి.
* క్రెడాయ్ సిఫార్సులు రియల్ ఎస్టేట్‌రంగం మరింత అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: 10,000 దాటిన క్రియాశీల కేసులు.. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం
-
Movies News
Nani: నిర్మాతలందరూ.. వాళ్లకు అడ్వాన్స్ చెక్‌లు ఇచ్చిపెట్టుకోండి : నాని
-
Sports News
Jasprit Bumrah: సర్జరీ తర్వాత ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో జస్ప్రీత్ బుమ్రా సందడి
-
India News
China: అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ-20 సమావేశం.. చైనా డుమ్మా..!
-
General News
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభం..
-
World News
America : అమెరికాలోని గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు..