Lands Market Value: భూముల ధరల సవరణకు సరైన సమయమేనా?

భూములు, స్థలాల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను సవరించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గతేడాది రూ.14వేల కోట్లకుపైగా వస్తే.. అందులో ఒక్క మహానగరం నుంచే రూ.10వేల కోట్ల దాకా ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో మరింతగా ఆదాయం ఆర్జించేందుకు సర్కారు ఆదేశాలతో ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలెట్టారు. ఎన్నికల సమయం కావడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు సక్రమంగా లేకపోవడంతో విక్రయాలు లేక మార్కెట్‌ మందకొడిగా ఉంది.

Updated : 25 May 2024 08:03 IST

మార్కెట్‌ పుంజుకొనే వరకు ఆగాలంటున్న రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు  
ఈనాడు, హైదరాబాద్‌

భూములు, స్థలాల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను సవరించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గతేడాది రూ.14వేల కోట్లకుపైగా వస్తే.. అందులో ఒక్క మహానగరం నుంచే రూ.10వేల కోట్ల దాకా ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో మరింతగా ఆదాయం ఆర్జించేందుకు సర్కారు ఆదేశాలతో ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలెట్టారు. ఎన్నికల సమయం కావడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు సక్రమంగా లేకపోవడంతో విక్రయాలు లేక మార్కెట్‌ మందకొడిగా ఉంది. ఈ తరుణంలో మళ్లీ భూముల ధరల సవరణ తెరమీదకు రావడంతో పరిశ్రమ వర్గాలు కలవరపాటుకు గురవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ప్రభావం పడుతుందనే ఆందోళనలో ఆయా వర్గాలు ఉన్నాయి. ఇది సరైన సమయం కాదని సూచిస్తున్నాయి. మార్కెట్‌ పుంజుకునేవరకు శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. పరిమిత కాలానికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.


రెండేళ్ల క్రితం రెండుమార్లు

భూముల ధరలను రెండేళ్ల క్రితం స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు సవరించారు. కొవిడ్‌ తర్వాత ఆదాయాలు పడిపోవడంతో అప్పటి సర్కారు 2021లో భూములు, స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్‌ విలువలను పెంచింది. వాటితో పాటూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. అప్పట్లోనూ భూముల ధరలు శాస్త్రీయంగా సవరించి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను తగ్గించాలని.. ఫలితంగా కొనుగోలుదారులపై భారం పడకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు సూచించాయి. కానీ తగ్గించకపోగా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుండటంతో పరిశ్రమ తరుఫున వేర్వేరు సంఘాలు పలు సూచనలు చేశాయి. 


మార్కెట్‌ పుంజుకున్న తర్వాత అయితే మేలు 

- వి.రాజశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌ 

భూముల మార్కెట్‌ ధరల్లో వ్యత్యాసం ఉంటే సవరించవచ్చు. కానీ అందుకు ఇది సరైన సమయం కాదు. వరస ఎన్నికలతో మార్కెట్‌ నెమ్మదించింది. ఇలాంటి సమయంలో భూముల ధరల పెంపు అంటే ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రభుత్వానికి వివరించాం. మార్కెట్‌ బాగున్నప్పుడు ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాలని కోరాం. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్‌ విలువ కంటే రిజిస్ట్రేషన్‌ చేసుకునే విలువ ఎక్కువగా ఉంటోంది. ఫ్లాట్‌ చ.అ.మార్కెట్‌ విలువ రూ.3వేలు ఉంటే ఆరువేలకు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి పశ్చిమ హైదరాబాద్‌లో ఉంది. ఇలాంటి చోట్ల చ.అ.రూ.5వేలకు పెంచవచ్చు. ఒకటి రెండేళ్ల డాటాను అధ్యయనం చేసి ఆ మేరకు పెంచాలి. ఇదే విధంగా ఉత్తరం, తూర్పు ప్రాంతాల్లో అందుబాటులో ఇళ్ల ధరకు మార్కెట్‌ విలువ కంటే ఎంత పెంచవచ్చు అనేది నిర్ణయించాలి. హడావుడిగా కాకుండా సమగ్ర అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. 

  • భూముల ధర ఒక్కటే పెంచినా ఆ ప్రభావం అన్నింటిపైనా పడుతుంది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయి. జీఎస్‌టీ పెరుగుతుంది. ఇవన్నీ కొనుగోలుదారులకు భారంగా మారతాయి.
  • స్వల్పకాలానికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో 1 నుంచి రెండు శాతం తగ్గించినా భారీగా సర్కారుకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం కోటి నుంచి రెండు కోట్ల వరకు విలువైన ఇళ్లు కొంటున్నారు. ఒకటి రెండు శాతం తగ్గినా కొనుగోలుదారులకు చాలా ప్రయోజనం ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. స్వల్పకాలానికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీల తగ్గింపును సర్కారు పరిశీలించవచ్చు. 
  • బడ్జెట్‌ ఇళ్లు రూ.50లక్షల లోపు ఉన్నవాటికి మిగతా స్థిరాస్తులతో పోలిస్తే 1 శాతం అదనంగా తగ్గింపు ఎప్పటికీ ఉండేలా చూడాలి. దీంతో అన్ని వర్గాలకు ఇళ్ల లభ్యత పెరుగుతుంది. పెంచాల్సి వస్తే రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో ఈ తరహా వెసులుబాటు కొనుగోలుదారులకు ఇవ్వాలని కోరుతున్నాం. 

కొంత కాలం ఆగితే మేలు 

- హరిబాబు, జాతీయ అధ్యక్షుడు, నరెడ్కో 

భూముల ధరలు కొంచెం పెంచినా ఫర్వాలేదు. తెలంగాణలో ధరలు తక్కువే ఉన్నాయి. కానీ ఇది సరైన సమయం కాదు. మార్కెట్‌ నెమ్మదిగా ఉంది. స్టాక్‌ అధికంగా ఉంది. భూములు, స్థలాల విలువలను 50 నుంచి 100 శాతం వరకు పెంచినా మార్కెట్‌ ధరలకు సర్దుబాటు అవుతాయి. అంతటా ఒకేలా కాకుండా ప్రాంతాలను బట్టి ధర నిర్ణయించాలి. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల చ.అ.ధరలు ఇప్పటికే ఎక్కువ పెంచారు. పెద్ద, చిన్న బిల్డర్లు విక్రయించే ఫ్లాట్ల ధరల్లో చ.అ.కు 30 శాతం వ్యత్యాసం ఉంటోంది. కాబట్టి 15 అంతస్తులలోపు ఒక ధర ఉండేలా చూస్తే బాగుంటుంది. ధరలు సవరించేటప్పుడు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. 


వాణిజ్య స్థలాల ధరలు పెంచొద్దు 

- జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ 

తంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జిల్లా రిజిస్ట్రార్‌ భూముల ధరలను సమీక్షించి సవరించేవారు. భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా ఏళ్లపాటు పెంచలేదు. 2021లో ఒకసారి.. అంతకంటే ముందు వెంటవెంటనే రెండుసార్లు భూముల ధరలు సవరించారు. కొనుగోలు చేసే ధరకు, రిజిస్ట్రేషన్‌ చేసుకునే ధరకు చాలా అంతరం ఉంటుంది కాబట్టి ఇప్పటికే సవరించేందుకు ప్రభుత్వానికి వెలుసుబాటు ఉంది. 

  • స్థలాల ధరలు చూస్తే మాదాపూర్‌లో ప్రభుత్వ నిర్ధారిత విలువ చ.గజం రూ.32వేలు ఉంటే అక్కడ గజం రూ.రెండు లక్షల దాకా పలుకుతోంది. కొండాపూర్‌లో రూ.27వేలు ఉంటే.. గజం రూ.1.75 లక్షల దాకా చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో చ.గజం.రూ.64వేలు ఉంటే.. అక్కడ వాస్తవ విలువ రూ.3 లక్షల వరకూ ఉంది. కాబట్టి వాటిని సవరించవచ్చు.
  • ఎకరాల్లోని భూముల ధరల్లోనూ సవరణకు వెసులుబాటు ఉంది. వాస్తవ ధరకు, క్రయ విక్రయాలు జరిగే ధరకు చాలా వ్యత్యాసం ఉంటోంది. కాబట్టి ఇక్కడ సవరణకు అవకాశం ఉంది.
  •  వాణిజ్య ప్లాట్లలో ఇప్పటికే ధరలు అధికంగా ఉన్నాయి. వాటి మార్కెట్‌ విలువలు మాత్రం పెంచవద్దనేది మా సూచన.
  • అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో కొంతవరకు అవకాశం ఉంది. గృహరుణాలతో ఇండ్లు కొనేవారు పూర్తి విలువతోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఎటొచ్చి వ్యవసాయ, వ్యాపార నేపథ్యం ఉన్నవారు మాత్రమే నగదు రూపంలో చెల్లింపులు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ ధరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.  
  • వీటన్నింటిని పరిశీలించి భూముల ధరలు సహేతుకంగా, శాస్త్రీయంగా ఉండేలా సవరిస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.  

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు