వూరు వెలేసింది... దేశం సెభాష్‌ అంది!

అమ్మానాన్నలకు అక్షరమ్ముక్కరాదు... అతడేమో అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు... కన్నవాళ్లు భూమినే నమ్ముకున్న వ్యవసాయ కూలీలు... తనేమో మట్టిని చీల్చుకుంటూ వచ్చిన విత్తనంలా ఎదిగాడు... పద్దె్ద్దనిమిదేళ్లు వచ్చేవరకు వాళ్లింట్లో కరెంటే లేదు... ఆ కుర్రాడేమో సమాజానికి వెలుగులు పంచే హోదాలో ఉండాలని తపించాడు... చేయని నేరానికి వూరంతా కుటుంబాన్ని వెలేసింది...

Published : 03 Jun 2017 01:42 IST

వూరు వెలేసింది... దేశం సెభాష్‌ అంది!

అమ్మానాన్నలకు అక్షరమ్ముక్కరాదు... అతడేమో అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు... కన్నవాళ్లు భూమినే నమ్ముకున్న వ్యవసాయ కూలీలు... తనేమో మట్టిని చీల్చుకుంటూ వచ్చిన విత్తనంలా ఎదిగాడు... పద్దె్ద్దనిమిదేళ్లు వచ్చేవరకు వాళ్లింట్లో కరెంటే లేదు... ఆ కుర్రాడేమో సమాజానికి వెలుగులు పంచే హోదాలో ఉండాలని తపించాడు... చేయని నేరానికి వూరంతా కుటుంబాన్ని వెలేసింది... భగభగమండే గుండె మంటను సైతం దిగమింగుకొని ఆ వూరివాళ్లే గర్వపడేలా కసిగా సాధించాడు... కష్టాలు.. అవమానాలు.. ఛీత్కారాలు.. శ్రీకాకుళం యువకుడు రోణంకి గోపాలకృష్ణ సివిల్స్‌ లక్ష్యాన్ని ఇసుమంతైనా అడ్డుకోలేకపోయాయి... స్వప్నం సాకారం చేసుకున్న దారిలో అతగాడు ఎదుర్కొన్న కడగండ్లు.. అనుభవాలు అతడి మాటల్లోనే.* సివిల్స్‌ మూడో ర్యాంకు నా వేల అడుగుల ప్రయాణంలో మొదటి అడుగే. ఐఏఎస్‌ అధికారిగా ప్రజలకు సేవ చేయడంతోనే నా అసలు ప్రయాణం మొదలవుతుంది.
* ఇంగ్లిష్‌ మాధ్యమంలో రాస్తేనే సివిల్స్‌ దక్కుతుందనేది అపోహే. మాతృభాషలో పరీక్ష రాసినా, ఇంటర్వ్యూ చేసినా బోర్డు చిన్నచూపు చూడదు. అందుకు నేనే ఉదాహరణ.
* ఫోన్‌ మనకు సమాచారం ఇచ్చే వస్తువుగానే ఉండాలి. సమయాన్ని తినేదిగా కాదు. అందుకే నేను స్మార్ట్‌ఫోన్‌కి బదులు మామూలు ఫోన్‌నే వాడుతున్నా
* అబ్దుల్‌ కలాం జీవితచరిత్ర నుంచి స్ఫూర్తి పొందా. యండమూరి వీరేంద్రనాథ్‌ రచనలు ఇష్టం. పట్టాభిరాం వ్యక్తిత్వ వికాస పాఠాలు వింటుంటా.
* దేవుడ్ని నమ్ముతా. కానీ ఒక మనిషికి మంచి జరిగేది కచ్చితంగా సాటిమనిషి ద్వారానే.
* రోజూ పద్దెనిమిది, ఇరవై గంటలు చదవమని సలహా ఇవ్వను. సొంతంగా నోట్స్‌ తయారు చేసుకుంటే సబ్జెక్టుపై పూర్తి అవగాహన వస్తుంది.

కుటుంబం అండ
పూరి గుడిసె. గుడ్డి వెలుతురు దీపం. ఇంటర్‌దాకా ఇంట్లో కరెంట్‌ కూడా లేని పేదరికం. నా నేపథ్యం గురించి చెప్పాలంటే వీటితోనే మొదలెట్టాలి. అమ్మానాన్నలకు అక్షరమ్ముక్కరాదు. అయినా చదువు విలువ బాగా తెలుసు. వాళ్లు వ్యవసాయ కూలీలు. కొద్దిపాటి సేద్యం ఉంది. ఓరోజు నాన్న పొలం దగ్గరికి తీసుకెళ్లి్ల ‘చూడయ్యా... నాకు చదువు రాకపోయినా కష్టపడి ఇతరుల కడుపు నింపే పంట పండించా. చదువుకున్నోడు కష్ట్టపడితే సమాజాన్నే మార్చేయొచ్చు. ఆ పని నువ్వు సేయాలా. నిన్ను పెద్దపెద్ద స్కూళ్లలో చదివించే స్థోమత నాకు లేదు. కానీ తల తాకట్టు పెట్టైనా నిన్ను సదివిస్తానయ్యా’ అన్నారోసారి. ఆ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. ఆరోజు నుంచి నేను చదువునే నమ్ముకున్నా. అన్నయ్య కోదండరావు సైతం నాకు మార్గదర్శే. గోడలపై మసిబొగ్గులతో రాసి నా సందేహాలు తీర్చేవాడు. గురువుగా, వెన్నుతట్టి వెంట నిలిచే స్నేహితుడిగా అన్నివేళలా అండగా ఉన్నాడు.

చదువుల యాగం
ఒకటి నుంచి ఆరు దాకా సొంతూరు పారసంబలో చదువుకున్నా. ఆరునుంచి పది వరకు బ్రాహ్మణతర్లలో చదివాను. రానూపోనూ రోజూ ఎనిమిది కిలోమీటర్ల నడక. చదువంటే తగని మమకారం ఉండటంతో అదేమంత పెద్ద కష్టం అనిపించలేదు. ఇంటర్‌ పలాసలో పూర్తి చేశా. తర్వాత టీటీసీ రాయడం.. సీటు రావడం.. అదైపోగానే డీఎస్సీ రాసి టీచరుగా ఎంపికవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. మా ఉపాధ్యాయ శిక్షణ సమయంలో ఒక టీచర్‌ ఉండేవారు. ఆయన్ని మేం ‘దేవుడు’ అనేవాళ్లం. కేవలం పాఠాలు చెప్పి వదిలేయడమే కాదు.. మా ఎదుగుదలకు పనికొచ్చే జీవిత పాఠాలు నూరిపోసేవారు. పల్లెటూరిలో పుట్టినా, కార్పొరేట్‌ స్కూళ్లలో చదవకపోయినా నేను ఏదైనా సాధించగలననే నమ్మకం కలిగిందంటే ఆయన చలవే. 2006లో ఉపాధ్యాయుడిగా కెరీర్‌ మొదలుపెట్టా. బోధన గౌరవప్రదమైన వృత్తి. తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెబుతూ మెరుగైన సమాజాన్ని తయారు చేయొచ్చు. అయినా ఏదో అసంతృప్తి. సమాజానికి ఇంకా బాగా మంచి చేసే ఉన్నతోద్యోగం సంపాదించాలనే తపన. సరిగ్గా అప్పుడే రేవు ముత్యాలరాజు ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. నాలాంటి గ్రామీణ నేపథ్యం, కటిక పేదరికం నుంచి వచ్చిన ఆయన సివిల్స్‌లో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించారు. అది నాలో స్ఫూర్తి నింపింది.

అవమానాలే ఆశీర్వాదాలు
సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాక దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశా. 2010లో మొదటిసారి పుస్తకాలు కొనుక్కోవడానికి హైదరాబాద్‌ వచ్చా. ఈ క్రమంలో కొందరు ఉద్యోగార్థులు పరిచయం అయ్యారు. కొన్ని ఇనిస్టిట్యూట్‌లకు వెళ్లి నేను సివిల్స్‌కి ప్రిపేరవుతానన్నా. నా నేపథ్యం చూసి, తెలుగులో పరీక్షలు రాస్తానంటే కొందరు నవ్వారు. ‘సివిల్స్‌ నీవల్ల కాదు.. వూరెళ్లి హాయిగా ఉద్యోగం చేసుకో’ అని ఉచిత సలహా ఇచ్చారు. కొన్ని సంస్థలైతే నన్ను చేర్చుకోవడానికి నిరాకరించాయి. అయినా పట్టువదలకుండా ప్రయత్నించా. 2011లో మొదటిసారి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ కూడా దాటలేదు. 2014, 15ల్లోనూ వైఫల్యమే వెక్కిరించింది. మధ్యలో గ్రూపు 1 ఇంటర్వ్యూ వరకెళ్లినా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఈ సమయంలో నాకు ఫీనిక్స్‌ పక్షి గుర్తొచ్చేది. పట్టుదల ఉంటే పాతాళం నుంచైనా నింగికి ఎదగొచ్చని నాకు నేనే భరోసా ఇచ్చుకునేవాణ్ని.

మా వూరివాణ్ని
నాకు మా వూరంటే చాలా అభిమానం. పారసంబ వాడినని గర్వంగా చెప్పుకుంటా. కానీ మా వూరికి మా కుటుంబమంటే అసహ్యం. వూరు వూరంతా మమ్మల్ని వెలేశారు. కనీసం మాతో మాట్లాడరు. ఎలాంటి సాయం చేయరు. ఇంతకీ మేమేం చేశాం? ఓ నిమ్న వర్గానికి చెందిన ఇంట్లో మా నాన్న పెళ్లి భోజనం చేయడమే మేం చేసిన నేరం. అదీ ఇరవై ఏళ్ల కిందట. ఈ వెలివేతే నాలో అనుక్షణం ఏదైనా సాధించాలనే కాంక్షను జ్వలింపజేసేది. నా ఇంటర్వ్యూ జరిగిన ముందురోజు సైతం వూళ్లొ కొందరు తాగి మా ఇంటికొచ్చి నానా యాగీ చేశారు. అన్నయ్య డిఫెన్స్‌లో పనిచేస్తే ప్రభుత్వం కొద్దిగా స్థలం ఇచ్చింది. దాంట్లో వేసిన పూల మొక్కల్ని ధ్వంసం చేశారు. గాబరా పడుతూ అమ్మానాన్నలు నాకు ఫోన్‌ చేశారు. ‘నా విజయం మీరు చూడాలంటే మీరు ప్రాణాలతో ఉండండి. వాళ్లేం చేసినా పట్టించుకోకుండా తలుపులు వేసుకొని ఇంట్లో ఉండండి’ అని చెప్పా. ఇంత చేసినా నాకు వూరన్నా ఆ గ్రామస్తులన్నా ప్రేమే తప్ప కోపం లేదు.

పుస్తకాలే ఆస్తులు
నేనుండేది చిన్న ఇరుకుగదిలో. గదిలో సగం స్థలం పుస్తకాల అల్మారాలకే సరిపోతుంది. మొదట్లో మాకు చాలా ఆర్థిక కష్టాలుండేవి. ఇప్పుడు ఫర్వాలేదు. ‘టీచరుద్యోగం చేస్తున్నావ్‌. మంచి ఇంట్లో ఉండొచ్చుగా.. మంచి దుస్తులు వేసుకోవచ్చుగా’ అంటారు చాలామంది. మొదట్నుంచీ నాది సాధారణ జీవితం. చిన్నప్పుడు తినడానికి సరైన తిండి ఉండేది కాదు. కట్టుకోవడానికి మంచి దుస్తుల్లేవు. స్నేహితులు, బంధువులు సైతం పేదవాళ్లే. ఉన్నవాళ్లతో స్నేహం చేస్తే చిన్నచూపు చూస్తారని వారికి దూరంగానే ఉండేవాడిని. తర్వాత ఆర్థిక పరిస్థితిలో కొంచెం మార్పొచ్చినా పాతరోజుల్లోలాగా ఉండటమే నాకిష్టం. సినిమాలు, షికార్లు నచ్చవు. నచ్చిన పుస్తకం ఎక్కడ కనిపించినా వెంటనే కొనేస్తా. నా దృష్టిలో అవే అవసరాలు.. విలాసాలు.. ఆస్తులు.. దోస్తులు.

- సీహెచ్‌ మురళీకృష్ణ, ఈనాడు: హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని