డిజైన్లతో రంజింప చేశాడు

ప్రపంచ అత్యుత్తమ ఫ్యాషన్‌ డిజైనర్లు జాన్‌ గ్యాలినో, అలెగ్జండర్‌ మెక్వీన్‌ (బ్రిటిష్‌). జాన్‌ తండ్రి సాధారణ ట్యాక్సీడ్రైవర్‌... మెక్విన్‌ నాన్న ప్లంబర్‌. చాలా పేదరికం నుంచి వచ్చిన వీళ్లు ఫ్యాషన్‌ రంగంలో రాణించారు....

Published : 19 May 2018 01:49 IST

ఫ్యాషన్‌...ప్యాషన్‌
డిజైన్లతో రంజింప చేశాడు
ఫ్యాషన్‌ రంగంలో గ్రామీణ మెరుపు

ప్రపంచ అత్యుత్తమ ఫ్యాషన్‌ డిజైనర్లు జాన్‌ గ్యాలినో, అలెగ్జండర్‌ మెక్వీన్‌ (బ్రిటిష్‌). జాన్‌ తండ్రి సాధారణ ట్యాక్సీడ్రైవర్‌... మెక్విన్‌ నాన్న ప్లంబర్‌.  చాలా పేదరికం నుంచి వచ్చిన వీళ్లు ఫ్యాషన్‌ రంగంలో రాణించారు. మరి నేనెందుకు ఎదగకూడదనుకున్నాడో కుర్రాడు. పేదరికం, కష్టాలు అధిగమించి ప్రతిభతో తనని తాను నిరూపించుకున్నాడు. ప్రపంచంలోని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కళాశాల్లో ప్రముఖమైన రాయల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌, లండన్‌లో ప్రవేశం పొందాడు రంజిత్‌కుమార్‌. ఇంతకీ ఎవరీ యువకుడు? ఏమతని కథ?
దేశంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ల వద్ద కొంతకాలం పనిచేశాను. గతేడాది రాయల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ -లండన్‌లో ఏడాది పీజీ డిప్లమో కోర్సుకు(ఉమెన్స్‌వేర్‌)  అడ్మిషన్‌ దొరికింది. ఈ కోర్సుకు రూ.30 లక్షలు ఖర్చవుతుంది. అందులో రూ.20 లక్షలు ప్రభుత్వం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా పథకం కింద మంజూరు చేసింది. మిగిలిన సొమ్ము కోసం ప్రయత్నిస్తున్నా.’’సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన యువకుడు పిండిగా రంజిత్‌ కుమార్‌. తండ్రి మల్లయ్య, తల్లి నాగమ్మ. 5 ఎకరాల వ్యవసాయభూమే జీవనాధారం. చిన్నప్పుడు వాళ్లింట్లో బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రపటం ఉండేది. అందులో ఆయన మంచి సూటు, కోటుతో కన్పించేవాడు. ఊర్లో వ్యక్తుల బట్టలు, అంబేడ్కర్‌ వేసుకున్న దుస్తులనూ పోల్చి చూసేవాడు. ఎప్పటికైనా ఇలాంటి మంచి డ్రెస్స్‌లు రూపొందించాలని అనుకొనేవాడు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, ప్రభుత్వం సంయుక్తంగా 1992లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో హెచ్‌పీఎస్‌లో చదువు, వసతి ఉచితంగా లభించాయి. అక్కడ ఉన్నప్పుడే ఫ్యాషన్‌ డిజైన్లకు సంబంధించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పలు బహుమతులు గెలుచుకున్నాడు. దిల్లీలో జేడీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. నిఫ్ట్‌ ప్రవేశ పరీక్ష రాసి ఆలిండియా మూడో ర్యాంకు సాధించాడు.  నామమాత్రపు ఫీజుతో నిఫ్ట్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైను కోర్సులో సీటు దొరికింది. సెమిస్టర్‌కు రూ.35 వేలు చెల్లించాలి. మొదటి సెమిస్టర్‌ ఫీజు బంధువుల సాయంతో కట్టాడు. మిగిలిన మూడు సెమిస్టర్ల ఫీజులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు ప్రవీణ్‌కుమార్‌, సునీతలు అందించారు.
రెండు డిజైన్లతో గుర్తింపు
* ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రంజిత్‌ తయారు చేసిన రెండు డిజైన్లు అతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. పారిశుద్ధ్య కార్మికులు  నగరాల్లో రాత్రుళ్లు రోడ్లను శుభ్రం చేస్తారు. ఈ సమయంలో వీరు ప్రమాదాల బారిన పడేవారు. దీనికి పరిష్కారంగా వారు ధరించే జాకెట్లకు రేడియం రంగులు జోడించాడు. డైమండ్‌ ఆకారపు గుర్తులు డిజైన్‌ చేశాడు. కార్మికులు పనిచేస్తున్నప్పుడు వాహన చోదకులకు వారు మెరుస్తూ కనిపిస్తారు. దీంతో ప్రమాదాలు తగ్గాయి. దీన్ని దిల్లీ ప్రభుత్వం వారి కార్మికులకు అందజేస్తోంది. భూగర్భ కాల్వలు శుభ్రం చేసే వారికి రసాయనాలతో కూడిన జాకెట్లను తయారు చేసి ఇచ్చాడు. ఇవీ మంచి పేరు తెచ్చాయి.ఆకట్టుకున్న ట్రక్‌ ఆర్ట్‌, గెలాక్సీ
లండన్‌లో సీటు రావాలంటే ప్రవేశపరీక్షతోపాటు 6 విభిన్న డిజైన్లలో ఉమెన్స్‌ వేర్‌ రూపొందించి పంపాలి. కోర్సులో 30 సీట్లే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వేలల్లో దరఖాస్తులు వస్తాయి. వాటిల్లో రంజిత్‌ రూపొందించిన ట్రక్‌ ఆర్ట్‌, గెలాక్సీ డిజైన్లు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి.
* ట్రక్‌ ఆర్ట్‌ అంటే మన దేశంలోని ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలతోపాటు పాకిస్థాన్‌, ఆప్గనిస్థాన్‌ దేశాల్లో ట్రక్‌ (లారీలు)లను రకరకాల డిజైన్లతో ముస్తాబు చేస్తారు. వాటిని దుస్తులపై పొందుపరిచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు.
* నక్షత్రాలు దూరం నుంచి చూస్తే ఒకలా..దగ్గరి నుంచి చూస్తే ఇంకోలా కనిపిస్తాయి, నక్షత్రాలను సైతం రకరకాల డిజైన్లతో దుస్తులపై పెట్టాడు.
* బిహార్‌లోని మధుబని జిల్లాలో రంగులను ప్రకృతి నుంచి తీసుకుని పేపర్ల మీద మధుబని ఆర్ట్‌ వేస్తుంటారు. అక్కడికి వెళ్లి దాదాపు నెల రోజులపాటు కష్టపడి ప్రకృతి నుంచి వివిధ రకాల రంగులను సేకరించాడు. వాటిని మధుబని డిజైన్లనే దుస్తులపై వేశాడు.
* ఇంటర్యూ సమయంలో ట్రక్‌ ఆర్ట్‌, గెలాక్సీ, మధుబని డిజైన్లు న్యాయనిర్ణేతలకు బాగా నచ్చాయి. దీంతో ప్రతిష్ఠాత్మక కళాశాలలో సీటు సంపాదించాడు.

- సత్యనారాయణ జానపాటి
ఈనాడు, సూర్యాపేట డిజిటల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని