Published : 10 Jun 2017 01:32 IST

వయసే.. యాభై సొగసే.. ఇరవై

వయసే.. యాభై సొగసే.. ఇరవై

క్కనున్న ఫొటో చూశారా... ‘వావ్‌.. ఇంత అందగా ఉంది ఎవరీ అమ్మాయి?’ అనుకుంటున్నారా? తను అమ్మాయి కాదు.. పాతికేళ్ల కుర్రాడికి అమ్మ. ఇంకో నాలుగేళ్లు్ల గడిస్తే బామ్మ అని కూడా పిలవొచ్చు. ఎందుకంటే తన వయసు అచ్చంగా 52. ఏంటి అవాక్కయ్యారా? మీరే కాదు.. ఇప్పుడు ప్రపంచం మొత్తమే ఆశ్చర్యపోతోంది తనని చూసి. సామాజిక మాధ్యమాల్లో తాజా సంచలనం అయిన ఈ చైనా అమ్మడి పేరు లియు యెలిన్‌. లియు కొడుకు గ్జీ యిచువాన్‌ మొదటిసారి ఆమె ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో యాభై రెండేళ్ల అందం గురించి ప్రపంచానికి తెలిసింది. ‘ఏంటి తను నీ గాళ్‌ఫ్రెండా?’ అంటూ యిచువాన్‌ని అడిగేవారు స్నేహితులు. కన్నతల్లి అని చెబితే మొదట్లో ఎవరూ నమ్మలేదు. తర్వాత తప్పలేదు.

యాభై దాటినా యెలిన్‌ మొహం మీద ఒక్క ముడత కూడా లేదు. మేకప్‌ చేసుకునేది కూడా అరుదే. మరి ఇంత అందానికి కారణం ఏంటంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఈతని జీవితంలో ఒక భాగం చేసుకోవడం అంటోంది తను. అందం, నాజూకుతనంలోనే కాదు.. ఫిట్‌నెస్‌లోనూ ఆమె మేటినే. ‘అందం సరే.. ఫిట్‌నెస్‌లో నువ్వు అమ్మమ్మవే’ అని ఓసారి ఇరుగుపొరుగూ అనడంతో దాన్ని సవాలుగా తీసుకొని ఆర్నెళ్ల కిందట 12 కిలోమీటర్ల మలక్కా జలసంధిని నాలుగు గంటల్లో ఈదేసింది. సామాజిక అనుబంధాల మాధ్యమాల్లో ఖాతాలు తెరిచాకే ఆమె ఘనతలన్నీ ప్రపంచమంతా మార్మోగడం మొదలయ్యాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే అందంగా కనిపించడమే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది. ఈ మాట చెప్పడానికి నా వంతు ప్రచారం చేస్తాను అంటూ డెయిల్‌ మెయిల్‌ ఇంటర్వ్యూలో చెప్పింది. అన్నట్టు లియు తన ఇరవైల్లో మోడల్‌గా రాణించాలని ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు అనుకోకుండా అవకాశాలు వచ్చి పడటంతో లేటు వయసులో మోడల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్లు: 28 వేలు, వీబో అడ్మైరర్లు: 75 వేలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు