అమ్మమ్మ కోసం తెలుగు పాప్‌ గీతాలు

అజంతా భాష తెలుగు... పదాలు అచ్చులతో అంతమవుతాయి. ఇటాలియన్‌ భాషలోనూ ఇదే ఒరవడి. ఇప్పుడు ఈ ఒరవడిని అందిపుచ్చుకొని తెలుగు పాప్‌ గీతాలతో అలరిస్తున్నాడు తెలుగు...

Published : 16 Dec 2017 02:01 IST

కొత్త కెరటం
అమ్మమ్మ కోసం తెలుగు పాప్‌ గీతాలు

అజంతా భాష తెలుగు... పదాలు అచ్చులతో అంతమవుతాయి. ఇటాలియన్‌ భాషలోనూ ఇదే ఒరవడి. ఇప్పుడు ఈ ఒరవడిని అందిపుచ్చుకొని తెలుగు పాప్‌ గీతాలతో అలరిస్తున్నాడు తెలుగు యువకుడు అల్లూరి శ్రీరామ్‌. ఇటీవల హైదరాబాద్‌లోనూ తెలుగు పాప్‌ సాంగ్స్‌తో ఉర్రూతలూగించాడు. యూరప్‌లోనూ మన భాషా సౌరభాలు విరబూయిస్తున్న శ్రీరామ్‌ను తెలుగు మహాసభల సందర్భంగా ‘ఈతరం’ పలకరించింది.

మా అమ్మ పుట్టిల్లు చిత్తూరు జిల్లా, పీలేరు. మా నాన్నది అనంతపురం జిల్లా. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాలుగేళ్ల వయసులోనే వయొలిన్‌ క్లాస్‌ నచ్చక వదిలేశా. మా బంధువొకాయన మా ఇంటికొచ్చాడు. అప్పుడు నాకు పన్నెండేళ్లు. ఆ అబ్బాయి ‘‘స్పోక్‌ ఆన్‌ ది వాటర్‌’’ అనే ఆల్బమ్‌ వినిపించాడు. అవి ‘డీప్‌ పర్పుల్‌’ (1960) బ్యాండ్‌ చేసినవి. ఎందుకో తెలీదు.. ఆల్బమ్‌ వింటూనే ఏదో షాక్‌ కొట్టినట్లనిపించింది. ఎలాగైనా గిటార్‌ ప్లే చేయాలనుకున్నా. మానాన్న గిటార్‌ కొనివ్వటం, క్లాసులకు హాజరవ్వటం రెండ్రోజుల్లోనే జరిగింది. పాశ్చాత్య సంగీతం వినటం.. ఆ విన్నదాన్నే గిటార్‌పై ప్లే చేయటమే నా లోకం.

తెలుగు పాప్‌ రచయితను..
ఇంటర్‌ తర్వాత లండన్‌కి వెళ్లాను. బీఎస్సీలో మ్యూజిక్‌ టెక్నాలజీ చేశాను. తర్వాత మ్యూజిక్‌ మైండ్‌ అండ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేశాను. యూరప్‌లో లైవ్‌బ్యాండ్‌ కల్చర్‌ ఎక్కువ. వారాంతాల్లో లైవ్‌మ్యూజిక్‌కి వెళ్లేవాడ్ని. మాస్టర్స్‌ అయ్యాక హైదరాబాద్‌కి వచ్చేశా. ‘ఐ రూట్‌ దిస్‌ లైన్‌ లుకింగ్‌ అట్‌ యు, అండ్‌ ఓన్లీ ఐ సింగ్‌ ఫర్‌ యు’ అంటూ ఓ పాట రాశాను. అదే నా తొలిపాట. ఎందుకో ఆ పాట నాకే నచ్చలేదు. పక్కన పడేశా. రాయటం ఆపలేదు. 2015లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ట్రూత్‌’ అనే ఆల్బమ్‌ చేశాను. కాస్త పేరొచ్చింది. మా అమ్మమ్మకి ఈ ఆల్బమ్‌ వినిపిస్తే ‘ఇవేం పాటలు? తెలుగులో రాయవా’ అన్నది. అలా తెలుగులో పాటలు రాయాలనిపించింది. పాప్‌ సాంగ్స్‌ చేయాలనే ఆలోచన వచ్చింది.

* 2016లో ‘ఎవరికోసం’ అనే లవ్‌ఫెయిల్యూర్‌ పాటను రాశా. దానికి వీడియో చేయించా. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే ‘తెలుగుపాప్‌ సింగర్‌’ గా పేరొచ్చింది. తర్వాత నేను రాసి, పాడిన ‘ఎందుకలా’ విడుదలైంది. ఈ రెండు పాటల్ని లండన్‌, ఇటలీ, పారిస్‌లో లైవ్‌ మ్యూజిక్‌ చేశా. వాళ్లకు భాష అర్థంకాకున్నా భలే నచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరో పాటను విడుదలచేస్తా. ప్రస్తుతం ‘ఓ కథ’ అనే తెలుగు పాప్‌ ఆల్బమ్‌ను చేస్తున్నా. ఇందులో పన్నెండు పాటలుంటాయి. ఈ ఆల్బమ్‌ను ఇంగ్లీషులో ‘అల్లూరి ఓ కథ.. టేల్స్‌ ఆఫ్‌ ది తెలుగుమ్యాన్‌’ పేరుతో రికార్డింగ్‌ చేస్తున్నాను. వచ్చే జూన్‌లో ఈ ఆల్బమ్‌ విడుదల అవుతుంది.

బాల్యంలో గిటార్‌ నేర్చుకోవటానికి అన్యమనస్కంగా వెళ్లిన నేను అనుకోకుండా ఇప్పుడు గిటారిస్ట్‌, పాప్‌ సింగర్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. ఇటీవలే ‘డోంట్‌ బ్రేక్‌ డౌన్‌’ అనే పేరుతో ఓ మ్యూజిక్‌ టూర్‌ చేశా. అది లండన్‌నుంచి ప్రారంభించి.. ఆ తర్వాత ఫ్రాన్స్‌కెళ్లాం. అటునుంచి నేరుగా ముంబయి, పుణె, హైదరాబాద్‌, బెంగళూరు వరకూ సంగీత ప్రయాణం చేశాను. ఇటలీ నగరం మిలాన్‌లో నేను రాసిన తెలుగు ఆల్బమ్‌ రికార్డు కావటం ఓ విశేషం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో గంటన్నర పాటు తెలుగు పాప్‌ సాంగ్స్‌ పాడాలన్నదే నా డ్రీమ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని