చూసే కళ్లుంటే చుట్టూ ఉపాధే

ఎంటర్‌ప్రెన్యూర్‌ కావడమంటే మాటలా? చేతినిండా డబ్బుండాలి.. అదిరిపోయే ఐడియా తట్టాలి.. అదే కదూ మీ అభిప్రాయం? అపసోపాలు పడక్కర్లేదు.. అవసరాల్ని కనిపెడితే చాలు.. అది మీ సొంతూరు కావొచ్చు.. మండల కేంద్రం అవ్వొచ్చు.. ఏం ఫర్లేదు.. ఇల్లు కట్టేవాళ్లకు సరంజామా సరఫరా.. పల్లెలకు శుద్ధజలం పంపిణీ.. కూలీలను ఏర్పాటు చేసే పని..

Published : 20 Jan 2018 03:36 IST

పంచ సూత్రాలు
చూసే కళ్లుంటే  చుట్టూ ఉపాధే

ఎంటర్‌ప్రెన్యూర్‌ కావడమంటే మాటలా?
చేతినిండా డబ్బుండాలి.. అదిరిపోయే ఐడియా తట్టాలి.. అదే కదూ మీ అభిప్రాయం?
అపసోపాలు పడక్కర్లేదు.. అవసరాల్ని కనిపెడితే చాలు..
అది మీ సొంతూరు కావొచ్చు.. మండల కేంద్రం అవ్వొచ్చు..
ఏం ఫర్లేదు.. ఇల్లు కట్టేవాళ్లకు సరంజామా సరఫరా.. పల్లెలకు శుద్ధజలం పంపిణీ.. కూలీలను ఏర్పాటు చేసే పని.. ఏదైతేనేం? ప్రతి పనీ ఒక స్టార్టప్‌కు పనికొచ్చే ఐడియానే! చూసే కళ్లుంటే చుట్టూ ఉపాధే! ఆలోచన మీకుంటే.. దారిచూపి ధైర్యం నూరిపోసే సంస్థ ఒకటుంది. అదే 1ఎం1బి..

నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడం

సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు గమనించడం

ఓటమికి భయపడి పని ప్రారంభించకపోవడం మన రాతను మనమే మార్చుకొనే అవకాశాన్ని కోల్పోవడం

భిన్నమైన ఆదాయ మార్గాలు ఎంచుకొన్నప్పుడే విఫలమనే మాట దరిచేరదు

అప్పటి వరకూ లేని కొత్త మార్గంలో వ్యాపారం

చాలా మంది యువతకు ప్రపంచంలో ఉన్న అవకాశాల గురించి తెలియదు. ఉపాధి అంటే ఏ వెబ్‌సైట్‌ ప్రారంభించడమో, స్టార్టప్‌ అంటే ఓ యాప్‌ అభివృద్ధి చేయడమో అనుకుంటారు. ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. పరిశ్రమంటే పెద్ద పెట్టుబడి కావాలి కదా? అని కొందరు వెనకడుగు వేస్తారు. ఇలా ఆలోచించే యువతకు దిశానిర్దేశం చేసి, వారిలో నమ్మకం పెంచి, సొంతంగా ఎదగడానికి మార్గాలు చూపే సంస్థే 1ఎం1బీ. వాస్తవానికి ఇది సంస్థ కాదు... ఓ వ్యక్తి లక్ష్యం. పది లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారి ద్వారా వంద కోట్ల మందికి ఉపాధి చూపాలనేది మనవ్‌సుబోధ్‌ ఉద్దేశం. 18 నుంచి 25 ఏళ్ల యువతలో చైతన్యం కల్పించే దిశగా మనవ్‌ సుబోధ్‌ అనేక కార్యక్రమాలు చేపడతున్నారు. ఇప్పటికే 30 దేశాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 1ఎం1బీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ ముందడుగు వేస్తోంది.
బెంగళూరుకు చెందిన మనవ్‌ ఇంటెల్‌లో గ్లోబల్‌ మేనేజర్‌గా పనిచేశారు. అంతకుముందూ అనేక సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. చాలా చోట్ల యువతలో నైరాశ్యం కనిపించింది. ఇలాంటి వాళ్లలో చైతన్య కాంతులు నింపే బాధ్యతను స్వీకరించారు. అనుకున్నదే తడవుగా 1ఎం1బీకి బీజం పడింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇంటెల్‌ కంపెనీలో తన బాస్‌కు చెప్పారు. అది ఆయనకు ఎంతో నచ్చింది. దీన్ని నీవు ఉద్యోగం వదిలి చేయొద్దు... మన కంపెనీ నీ ఆశయానికి సహాయం అందిస్తుంది... డూఇట్‌ అన్నారు. ఆదే ఉత్సాహంతో తొలుత ఈజిప్టులో తన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అక్కడున్న ఓ కళాశాలకు వెళ్లి శిక్షణ మొదలు పెట్టారు. అక్కడి యువతలో నమ్మకం ఏర్పడింది. సొంత కాళ్ల మీద నిలదొక్కుకునేందుకు పలు అవకాశాలు ఉన్నాయని గ్రహించారు. అక్కడ లభించిన స్పందనతో.. అమెరికా, ఈజిప్ట్‌, కొస్టారికా, ఐర్లాండ్‌, జోర్డాన్‌, కరేబియన్‌ దీవులు... ఇలా 30 దేశాల్లో మనవ్‌ మరికొంత మంది ప్రతినిధులు కలిసి శిక్షణలు ఇస్తున్నారు.

గ్రామీణ యువతే లక్ష్యం
గ్రామాల్లో చాలా మంది ఎలాగోల డిగ్రీ వరకూ చదువుతారు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. దగ్గరలోని నగరాలకు వలస వెళ్లి... తమ చదువుకు సంబంధం లేని ఉద్యోగం చేస్తూ... అరకొర జీతానికి పనిచేస్తుంటారు. దీనివల్ల వారి జీవనానికే కష్టంగా ఉంటుంది. ఇలా దిశానిర్దేశం లేని గ్రామీణ యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే లక్ష్యంతో 1ఎం1బీ  అడుగులు వేస్తోంది. గ్రామాల్లో వ్యవసాయం, తాగునీరు, ఆరోగ్యం, విద్య వంటి విషయాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను వారికి తెలియజెప్పి, స్థానికంగా ఉన్న వనరులు ఉపయోగించుకొనేలా చైతన్యం చేస్తోంది. ప్రభుత్వాలు కల్పిస్తున్న భరోసా, రాయితీలనూ వివరిస్తోంది. టాటా కంపెనీ ప్రోత్సాహంతో ఉత్తరాఖండ్‌, కర్ణాటక, ఝార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో శిక్షణ కేంద్రాలు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మోరీ గ్రామంలో ఇప్పటికే టెలీ హెల్త్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి.

గురుకుల్‌  

రెండు తెలుగు రాష్ట్రాల్లో గురుకుల్‌ పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో భీమవరంలలోని యువతకు ఇవి చేదోడుగా ఉంటాయి. నైపుణ్యాలకు మెరుగులద్దడం, పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన వనరులు సమకూర్చడం వీటి లక్ష్యం. స్థానిక  వనరుల గుర్తింపు, ప్రభుత్వ సహకారం అందేట్లు చేయడం తద్వారా పలువురికి ఉపాధి చూపడమే ధ్యేయంగా సాగుతోంది.

చిన్ని చిన్ని ఆశ.. పెద్ద భరోసా!  

నేను ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు తిరిగాను. ముఖ్యంగా మన దేశంలో యువతకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నా... కమ్యునికేషన్‌ స్కిల్స్‌, ఫైనాన్సింగ్‌, మార్కెటింగ్‌, అకౌంటింగ్‌లలో అవగాహన తక్కువ. అందరూ కంప్యూటర్లనే నమ్ముకుంటే ఈ రంగంలో ఎంత మందికి ఉపాధి లభిస్తుంది? మిగతా రంగాలనూ పరిశీలించాలి. ఉదాహరణకు గ్రామాల్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో కష్టం... అవసరమైన ఇనుము, ఇసుక, ఇటుక, తలుపులు, కిటికీలను సమకూర్చుకోవడం పెద్ద పని. దీనికి పరిష్కారంగా 20 గ్రామాలకు అందుబాటులో ఉండే మనం ఈ వస్తువులను సరఫరా చేస్తే... మనతో పాటు మరికొంత మందికి ఉపాధి లభిస్తుంది. గ్రామాల్లో సురక్షిత జలాలు దొరకవు. దీన్నొక అవకాశంగా చేసుకొని తక్కువ ధరలో శుద్ధజలం అందించే పరిశ్రమ పెట్టొచ్చు. చాలామంది యువతకు ఆంగ్లభాషపై పట్టు లేకపోవడం ఒక సమస్య. ఇది కూకొక ఉపాధి మార్గమే! ఇలా మన చుట్టూ ఉన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో సమస్య ఉంటుంది. ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారమే మన పరిశ్రమ అని గుర్తించాలి. ఈ విషయాలను యువతకు చెప్పడానికే 1ఎం1బీ పనిచేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. వీరు అందిస్తున్న రాయితీలను మేం యువతకు వివరిస్తాం. వాటిని అందిపుచ్చుకోవడానికి ఏంచేయాలో చెబుతాం. గురుకుల్‌ శిక్షణ కేంద్రాల లక్ష్యమిదే..! 

- మనవ్‌సుబోధ్‌, సహ వ్యవస్థాపకులు, 1ఎం, 1బీ.
శ్రీరామకుమార్‌ది పశ్చిమగోదావరి జిల్లా అనాకోడేరు. ఈయనకున్న 3ఎకరాల్లో రొయ్యల పెంపకం చేసేవారు. దీనికి అత్యంత శ్రద్ధ అవసరం. చెరువు నీటిలో ఉష్ణోగ్రత, పీహెచ్‌ విలువ, ఆక్సిజన్‌ శాతం, అమ్మోనియా స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఇందుకు కూలీలు అవసరం. పైగా ఆక్సిజన్‌ తగిన శాతంలో ఉందో లేదో తెలియక... గాలి యంత్రాలు నిరంతరం ఆడించేవారు. దీనికి విద్యుత్తు-డీజిల్‌ బిల్లు విపరీతంగా వచ్చేది.  నెలకు రూ.40,000 వరకూ వెచ్చించాల్సి రావడం భారంగా మారింది. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 1ఎం 1బీ ఆధ్వర్యంలో గురుకూల్‌ పేరుతో నిర్వహించిన సదస్సులో యువతకు ఈ విషయం తెలియజెప్పారు. పరిష్కారం కనుక్కొనే మార్గముందని అర్థమైంది. అక్కడి కళాశాలలోని ప్రయోగశాలను ఉపయోగించుకొని ఐఎస్‌ఎఫ్‌ టెక్నాలజీని రూపొందించారు. మొదట రామకుమార్‌ రొయ్యల చెరువులోనే పరీక్షించారు. ఈ టెక్నాలజీతో చెరువులోని నీటిలో ఏవి ఎంత స్థాయిల్లో ఉన్నాయో సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశ రూపంలో వస్తుంది. ఇది ఎప్పటికప్పుడు తెలుస్తుంటుంది. దీని వల్ల గాలిమరలు నిరంతరం ఆడాల్సిన పనిలేదు. విద్యుత్తు బిల్లు కూడా రూ.20,000 కు తగ్గింది. ఈ ప్రయోగం ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతోంది. ఇలా ఇదో అంకుర పరిశ్రమగా అవతరిస్తోంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని