సంచలనానికి ‘కన్నుగీటు’రాయి

పాజ్‌కొట్టి.. రిపీట్‌ చేసి.. ఆ 30 సెకన్ల దృశ్యాన్నే తిప్పి తిప్పి చూసి.. నెటిజన్లందరూ అలసిపోయారు. అప్పటికైతే ప్రేమికుల దినోత్సవం మత్తులో ఉన్నవాళ్లకు..గమ్మత్తయిన జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిన సంఘటన ఇది. ఒక్క ప్రేమికులకే కాదు. పద్దెనిమిదేళ్ల ఈ మళయాల కుట్టీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నేషనల్‌ క్రష్‌. ఒక్క కనుసైగతో మాయచేసి.. రాత్రికి రాత్రే అంతర్జాలంలో అతిలోక సుందరిలా వెలిగిపోయింది..! తనేమీ కష్టపడి డ్యాన్సులు చేయలేదు...

Published : 24 Feb 2018 01:45 IST

సంచలనానికి ‘కన్నుగీటు’రాయి

ఆ నల్ల కలువల్లాంటి కళ్లు..
పెద్దవి చేసి చూసి..
ఎక్కుపెట్టిన విల్లంభులాంటి కనుబొమలు.. ఎగరేసి...
ఓ గీటు గీటితే... ఎంతటి పురుషపుంగవులైనా గాలిలో తేలిపోవాల్సిందే
అలా ఆ కళ్లతో బాణం వేసి...
రెండు వేళ్లతో గురి చూసి
గుండెల్లో   కాల్చింది.. ప్రియా!
అంతే....!

 పాజ్‌కొట్టి.. రిపీట్‌ చేసి.. ఆ 30 సెకన్ల దృశ్యాన్నే తిప్పి తిప్పి చూసి.. నెటిజన్లందరూ అలసిపోయారు. అప్పటికైతే ప్రేమికుల దినోత్సవం మత్తులో ఉన్నవాళ్లకు..గమ్మత్తయిన జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిన సంఘటన ఇది. ఒక్క ప్రేమికులకే కాదు. పద్దెనిమిదేళ్ల ఈ మళయాల కుట్టీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నేషనల్‌ క్రష్‌. ఒక్క కనుసైగతో మాయచేసి.. రాత్రికి రాత్రే అంతర్జాలంలో అతిలోక సుందరిలా వెలిగిపోయింది..! తనేమీ కష్టపడి డ్యాన్సులు చేయలేదు. మగరాయుడిలా ఫైట్లు చేయలేదు. యాక్షన్‌తో అదరగొట్టలేదు. తను చేసిందల్లా.. సులువుగా, సొగసుగా, కొంటెతనంతో కన్నుకొట్టిందంతే! ఆ ఓరచూపులో అమాయకత్వం. అప్పుడే అరవిరిసిన సహజత్వం. ఆ పిలగాడు (హీరో) ఒక కనుతో సైగ చేస్తే.. తను రెండు కనుబొమలు ఎగరేస్తుంది. కాస్త ఆశ్చర్యంగా మళ్లీ ‘నేనంటే ఇష్టమా’ అన్నట్లు కళ్లతోనే అడుగుతాడు. ‘ఎందుకు కాదు, చచ్చేంత ఇష్టం’ అన్నట్లు కన్నుకొట్టి బుట్టలో పడేస్తుంది ప్రియ. మళయాలీ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’లోని మాణిక్య మలరాయ పూవీ పాట టీజర్‌ అంత సంచలనం అవుతుందని దర్శకుడే ఊహించలేదు. అప్పటి వరకు గూగుల్‌లో అత్యధికంగా శోధించే సెలబ్రిటీ సన్నీలియోన్‌ను ప్రియావారియర్‌ అధిగమించింది. ఇప్పుడు మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ తనే! కన్నుగీటడంలో తనూ పీహెచ్‌డీ ఏం చేయలేదు. కన్ను గీటడంలో తనేం శిక్షణ పొందలేదు. అయినా లోకం ఆమెకు ఫిదా అయ్యింది. ఇందులో తన గొప్పెంత ఉందో... దీన్ని ఆస్వాదించిన కళ్లదీ అంతేగొప్ప. సున్నిత భావాలకు దూరంగా...మోడుబారిన వృక్షాలపై తొలకరి చినుకుల్లా కురిసిందా కన్నుగీటు సుందరి. అంతే ఒక్కసారిగా లోలోపల దాగున్న సున్నితత్వం ఇంతలా పరమళించింది. కన్నుగీటడం ఇప్పుడే కాదు.. .ఎప్పుడూ సంచలనమవుతూనే ఉంది... కావాలంటే మీరే చదవండి.

చిన్నప్పుడు సరదాగా కన్నుకొట్టి సరసం ఆడిన సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ప్రియావారియర్‌ కన్నుకొట్టే దృశ్యాన్ని చూసి.. ‘నా కళ్లు చెబుతున్నాయి.. నిను ప్రేమించానని’ అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లేవాళ్లుంటారు. అలాగని కళ్లకు నచ్చినవన్నీ సొంతం అవ్వవు. ‘కన్నులతో చూసేవి గురువా.. కనులకు సొంతమవునా’ అన్నది అందుకే! మనసు లోతుల్లో గూడుకట్టుకున్న ఆ ప్రేమను కొందరు అర్థం చేసుకోలేరు. ‘కన్నుల బాసలు తెలియవులే.. కన్నెల మనసులు ఎరుగములే’ అనీ పాడుకుని బాధను దిగమింగుకోవాల్సి వస్తుంది. కళ్లు పలికించే ఆ సరసం విరిగిపోతే.. చూపులు చురకత్తుల్లాగే ఉంటాయి. ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు.. చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు’ అని మధనపడాల్సి వస్తుంది. కళ్ల సైగలతో మాట్లాడుకునేంత దగ్గరైన ప్రేమ.. రెండు గుండెల్ని తాకిందనుకోవచ్చు. ‘కళ్లు కళ్లు ప్లస్సు.. వాళ్లు వీళ్లు మైనస్‌.. ఒళ్లు ఒళ్లు ఇన్‌ టు.. చేసేటి ఈక్వేషన్‌’లా కథ మొత్తం మారిపోతుంది. అప్పుడా ప్రేమకు హద్దులు ఉండవు. ఎందుకంటే ప్రేమ గుడ్డిది. లేకపోతే.. ప్రియా వారియర్‌ కన్ను కొట్టిన దృశ్యాన్ని.. అందరూ గుడ్డిగా ఎందుకిలా పదే పదే చూస్తున్నారు చెప్పండి?

ముఖం కింది భాగం సులభంగా కదులుతుంది. అంటే.. పెదవులు, బుగ్గలు, నోరు, ముక్కు.. వీటిని అవలీలగా కదిలించి.. భావోద్వేగాలను వ్యక్తపరచవచ్చు. ముఖం పైభాగాన్ని ఇంత సులభంగా కదిలించలేం. కారణం మన మెదడు అడుగు భాగంలోని మోటార్‌ న్యూక్లియర్స్‌. కదలికలకు కేంద్రమైన ఈ నాడీ కణ సముదాయమే.. ముఖకవలికల్ని నియంత్రిస్తుంది. కనురెప్పల్ని పైకెగరేసి కన్నుకొట్టాలంటే.. మనసులో సంకల్పిత చర్య జరిగాకే సాధ్యమవుతుంది. పెదాలతో చిరునవ్వు నవ్వి.. మన ఆనందాన్ని వ్యక్తపరిచినంత సులభంగా.. కన్నుకొట్టలేం.

* రియో ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో పాల్గొంది హెర్నాండెజ్‌. పోటీలో విన్యాసం చేస్తూ.. జడ్జిలవైపు చూసి కన్నుకొట్టింది. అప్పట్లో అదో పెద్ద సంచలనం అయ్యింది.

* ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ కూడా.. వాణిజ్య ప్రకటనల్లోని తన బేబీ కూడా కన్నుకొట్టించింది.

* ఇతరుల్ని ఆటపట్టించేందుకు మరో వ్యక్తిని చూస్తూ కన్నుకొడుతుంటారు.
*ఉత్తినే, ఊరికే.. అంటూ తాత్కాలికంగా నిజాన్ని దాచిపెట్టే సందర్భంలోనే ఇలా చేస్తుంటారు.
* తమకు తామే అవాక్కయిన సందర్భంలో ‘అబ్బా.. ఛా’ అంటూ కళ్లు మిటకరించే వాళ్లున్నారు.
* ప్రేమికులు, స్నేహితులు, భార్యాభర్తలు.. ఇలా చనువున్న బంధాల్లో కన్నుగీటడం సహజం.
* ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తడానికి చూపులు కలిసిన శుభవేళ తప్పనిసరి. ఆ చూపులు వలచి.. మనసులు మురిసి.. హృదయాలు ఒక్కటయ్యాక.. కన్నుకొట్టని కొంటెతరం ఉంటుందా?
* కారు ముందు అద్దానికి వైపర్స్‌ ఉన్నట్లే.. మన ముఖాలకు కనురెప్పలు అలాంటివన్న మాట. లవర్స్‌కు ప్రేమదారి చూపించే వైపర్స్‌ కళ్లు.
* తల్లీ బిడ్డల మధ్య అల్లుకున్న మాతృబంధంలోని చిలిపితనం.. అప్పుడప్పుడు కన్నుగీటేలా చేస్తుంది. పిల్లలు ముద్దుమాటలు చెబుతున్నప్పుడు.. చిలిపిచేష్టలతో అల్లరి చేస్తున్నప్పుడు.. కనుసైగలు మురిపిస్తాయి.
* కను సైగలతోనే భయపెట్టేవాళ్లున్నారు. మాటలతో కాకుండా.. కేవలం చూపులతోనే అంతరార్థాన్ని గ్రహించవచ్చు.
* ఆసియాలో కన్ను గీటడం కొంచె చిలిపితనంగా ఎక్కువగా భావిస్తారు. అదే యూరప్‌లోనైతే పెద్దలు ఏదైనా మాట్లాడుకోవాల్సిన సమయంలో చిన్నపిల్లలు ఇక్కడి నుంచి వెళ్లాలని చెబుతూ ఇలా చేస్తారు.

* పదేళ్ల కిందట రిపబ్లికన్‌ పార్టీ తరఫున వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు సరాపాలిన్‌ కన్నుకొట్టారు. ఆమె ఏకంగా ఆరుసార్లు కన్నుకొట్టడంతో అప్పట్లో అదో సంచలనవార్త అయ్యింది.

* ఆస్ట్రేలియాకు చెందిన టోనీ అబోట్‌ కూడా కన్నుగీటిన ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. రేడియోలో బడ్జెట్‌ మీద చర్చాకార్యక్రమం నడుస్తోందప్పుడు. పన్నుల విధానంపై ఒక సెక్స్‌వర్కర్‌ అడిగిన ప్రశ్నకు.. రేడియో జాకీని చూస్తూ.. ఆయన కన్నుగీటి నవ్వారు.

* అమెరికాలోని శ్వేతసౌధంలో ఆహ్వానవేడుక అట్టహాసంగా జరుగుతోంది. జార్జ్‌ డబ్ల్యు బుష్‌ ప్రసంగిస్తున్నారు.  ఎలిజబెత్‌ క్వీన్‌ గురించి చెబుతున్నప్పుడు.. 1976కు బదులు 1776 సంవత్సరం అంటూ పొరపాటు దొర్లింది. తప్పును గ్రహించానంటూ కన్నుగీటి మరీ సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడాయన.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని